
సాక్షి, భీమునిపట్నం: భీమిలి ఉత్సవాలను నిర్వహించడం ఎంతో గర్వకారణంగా ఉందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం మధ్యాహ్నం విశాఖ డైరెర్ట్ మార్గంలోని రెల్లివీధి వద్ద నుంచి నిర్వహించిన కార్నివాల్‌ను ప్రారంభించారు. ప్రతి ఏడాది ఈ ఉత్సవాలు జరగాలని.. అప్పుడే అన్ని ప్రాంతాల వారికి ఇక్కడి చరిత్ర, గొప్పదనం గురించి తెలుస్తుందన్నారు. ఉత్సవాల్లో విద్యార్థులు కూడా భాగస్వాములు కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
సంక్రాంతి ముందే వచ్చింది..
భీమిలి ఉత్సవాలతో సంక్రాంతిపండగ ముందుగానే వచ్చినట్లుందని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభివృద్ధితో పాటు సంప్రదాయాలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.
వచ్చే నెలలో విశాఖ ఉత్సవ్..
వచ్చే నెలలో విశాఖ ఉత్సవ్ తర్వాత అరకు ఉత్సవ్‌లు నిర్వహిస్తామని విశాఖ కలెక్టర్ వినయ్‌చంద్ వెల్లడించారు. విశాఖ జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ఆకట్టుకున్నవిద్యార్థుల వేషధారణలు
విద్యార్థులు పలు వేషధారణలను ప్రదర్శిస్తూ.. చిన్నబజారు నుంచి మెయిన్‌రోడ్డు మీదగా బీచ్ వరకు ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు, అధికారులు పాల్గొన్నారు.