సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై కోర్టు తీర్పు చంద్రబాబు, టీడీపీకి చెంపదెబ్బ అని.. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని విద్యుత్ శాఖమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పీపీఏల పునఃసమీక్ష వ్యవహారాన్ని తాము కోరినట్టుగా ఏపీఈఆర్‌సీకి హైకోర్టు అప్పగించిందన్నారు. రేట్లు ముట్టుకోకూడదన్న కంపెనీల వాదనను కోర్టు తోసిపుచ్చిందని తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలన్నీ ప్రజల కోసమేనని తెలిపారు. విద్యుత్‌రంగ వ్యవస్థను గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశ్వప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. అవినీతి రహిత, పారదర్శక పాలనను ప్రజలకు అందించడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందడుగు వేస్తున్నారని.. అందులో భాగంగా పీపీఏలపై కూడా సమీక్ష చేయాలని నిర్ణయించారని వెల్లడించారు. చేతనైతే ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం ధైర్యంగా తీసుకుంటున్న చర్యలను సమర్థించాలని.. లేకపోతే మౌనంగా కూర్చోవాలన్నారు.
(చదవండి : విద్యుత్ కంపెనీలకు హైకోర్టులో ఎదురుదెబ్బ..!)
ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని కట్టుకథలు..
కొన్ని కంపెనీలతో కుమ్మక్కై అధిక ధరకు గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను మాత్రమే పునఃసమీక్షిస్తామని చెప్పామన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం, విద్యుత్ పంపిణీ సంస్థలు బతికి బట్టకట్టడానికే ఈ నిర్ణయాలని చెప్పామన్నారు. ప్రజలకోసం కాకుండా లోపాయికారీ ఒప్పందాలు కోసం చంద్రబాబు, టీడీపీ నాయకులు పోరాటం చేశారని మండిపడ్డారు. ఎల్లోమీడియాను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేశారన్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పునఃసమీక్ష ఘోర అపరాధంగా, అభివృద్ధికి నిరోధంగా కట్టుకథలు అల్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు లంచగొండి విధానాల వలనే..
పీపీఏల పునఃసమీక్ష రాజ్యాంగవిరుద్ధం, చట్ట విరుద్ధం అని మాట్లాడారని.. పరిశ్రమలకు తక్కువ ధరకు విద్యుత్ రావాలన్నా, డిస్కంలు బతికి బట్టకట్టాలన్నా, విద్యుత్ కంపెనీలకు సకాలంలో చార్జీలు చెల్లించాలన్నా... ఈ చర్యలు తప్పనిసరి అని మంత్రి బాలినేని పేర్కొన్నారు. తాము ప్రజల తరఫున మాట్లాడుతున్నామని.. ఛార్జీలు తక్కువ ఉంటేనే ప్రజలకు, పారిశ్రామిక రంగానికి మేలు జరుగుతుందన్నారు. చంద్రబాబు లంచగొండి విధానాల వల్లే గడచిన ఐదేళ్లలో విద్యుత్ సంస్థల బకాయిలు 20 వేల కోట్లు దాటాయని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment