సాక్షి, విజయనగరం: అన్నా క్యాంటీన్లను తాత్కాలికంగా మాత్రమే మూసివేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. క్యాంటీన్లను నిలిపివేయడం తమకు కూడా బాధగానే ఉందని, కానీ గత ప్రభుత్వం అనవసరమయిన చోట క్యాంటీన్లను నిర్మించిందని అన్నారు. శుక్రవారం ఆయన విజయనగరంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అన్నా క్యాంటీన్ల కోసం గత ప్రభుత్వం లక్షల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. త్వరలోనే ప్రభుత్వ క్యాంటీన్లు నిర్మిస్తామని, రద్దీ ప్రాంతాల్లో అవసరమయితే మొబైల్ క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
జిల్లా పర్యటనలో భాగంగా పట్టణ పరిధిలోని పేదల కోసం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఎన్టీఆర్ గృహ నిర్మాణాలను మంత్రి పరిశీలించారు. గత ప్రభుత్వం అధిక ధరలకు టెండర్లను పిలిచి నిర్మాణాలను చేపట్టిందని మంత్రి విమర్శించారు. తక్కువ ధరలకు పేదలకు ఇళ్ల నిర్మాణాలను కేటాయించాలనేదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణలపై ధరలను తగ్గించుకోవాలని కాంట్రాక్టర్లను కోరినట్లు మంత్రి తెలిపారు. ఇసుక కొరతపై భవన నిర్మాణ కార్మికులు చింతించాల్సిన అవసరం లేదని, ప్రజలకు నిర్మాణాల కోసం అవసరమైన ఇసుకను కేటాయించాలని, కొత్తగా రీచ్ లను తెరిపించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment