సాక్షి, అమరావతి: ‘రాజ్యాంగ బద్ధమైన పోస్టులో ఉండి తప్పుడు ప్రచారం చేస్తారా’ అంటూ ఈసీ తీరుపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా అప్రజాస్వామికం అని ధ్వజమెత్తారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో కరోనాపై అధికారికంగా ఈసీ సమీక్ష చేసిందా.. రాష్ట్రంలో కరోనాపై అంచనా వేయకుండా ఎన్నికలను ఎందుకు వాయిదా వేశారు. స్థానిక ఎన్నికలు వాయిదా వేసినప్పుడు వైద్యాధికారులను సంప్రదించారా? రాష్ట్రంలో పరిస్థితిపై వైద్యాధికారుల నుంచి వివరాలు తెప్పించుకున్నారా? ఈసీకి సీఎస్ లేఖ రాసిన తర్వాత కూడా సీఎస్‌తో ఎందుకు మాట్లాడలేదు? కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేస్తే కోడ్ ఎందుకు కొనసాగించారు’’ అని పలు ప్రశ్నలను మంత్రి రాజేంద్రనాథ్ సంధించారు. (ఆక్వా రైతుల్లో కరోనా కల్లోలం)
దురుద్దేశం అర్థమవుతుంది..
క్యావియేట్ పిటిషన్ దాఖలు చేయడంతో మీ దురుద్దేశం అర్థమవుతుందని దుయ్యబట్టారు. అధికార పార్టీ ఒత్తిడి ఉంటే ప్రతిపక్షాలు భారీ స్థాయిలో నామినేషన్లు ఎలా వేసాయన్నారు. టీడీపీ వాళ్లు నామినేషన్లు వేయకుంటే దానికి అధికారపార్టీ బాధ్యత వహిస్తుందా అని ప్రశ్నించారు. కరోనాపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందస్తు చర్యలకు ఆదేశించారని తెలిపారు. కరోనా నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. (‘కరోనాపై పోరాటం టెస్టు క్రికెట్‌లాంటిది’)
ఏకగ్రీవం కావడంలో తప్పేముంది..
అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్‌సీపీ వంద శాతం సీట్లు గెలిచిందని.. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు ఏకగ్రీవం కావడంలో తప్పేముందన్నారు. ప్రజా మద్దతు తమకుంది కాబట్టే మెజార్టీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని పేర్కొన్నారు. సీఎంను టార్గెట్ చేస్తూ ఎన్నికల కమిషనర్ మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment