
గల్లా అరుణకుమారి
తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని మంత్రి గల్లా అరుణకుమారి డిమాండ్ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుపతిలో నిర్వహించిన భారీ ర్యాలీలో గల్లా అరుణ పాల్గొన్నారు. రుయా ఆస్పత్రి వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని తెలుగుతల్లి విగ్రహం వరకు ఈ ర్యాలీ సాగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ హైదరాబాద్‌తో అనుబంధం ఉందని.. విభజన వాదులు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని గల్లా అరుణ సూచించారు.
హింసకు తావివ్వకుండా శాంతియుతంగా నిరసనలు తెలియజేయాలని సీమాంధ్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ విగ్రహలను ధ్వంసం చేయడం సరైన చర్యకాదని ఆమె అభిప్రాయపడ్డారు. ఆ ర్యాలీకి మద్దతుగా అధిక సంఖ్యలో జిల్లా వాసులు పాల్లొన్నారు. రాష్ట విభజన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చిత్తూరు జిల్లావాసులు యూపీఏ సర్కార్ను డిమాండ్ చేశారు.