మంత్రి గంటా ఆస్తులు మరిన్ని స్వాధీనం
⇒ చెన్నై, హైదరాబాద్‌లో ఆస్తులను స్వాధీనం చేసుకున్న ఇండియన్ బ్యాంక్
⇒ రూ.203.62 కోట్లకు చేరిన రుణ బకాయిలు
సాక్షి, విశాఖపట్నం: ఇండియన్ బ్యాంకు నుంచి తీసుకున్న రుణం తిరిగి చెల్లించని కారణంగా రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావుతోపాటు ఆయన బంధువుల ఆస్తుల స్వాధీనం కొనసాగుతోంది. తాజాగా ‘ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్’ కోసం కుదవపెట్టిన మరో రెండు విలువైన స్థిరాస్తులను ఇండియన్ బ్యాంకు స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు ఇండియన్ బ్యాంక్ బుధవారం ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో స్వాధీన ప్రకటన జారీ చేసింది. వరుసగా ఆస్తుల స్వాధీన ప్రకటనలు జారీ కావడం రాజకీయంగా కలకలం రేపుతోంది.
60 రోజులు గడువిచ్చినా...
మంత్రి గంటా బంధువు భాస్కరరావు సోదరుల పేరిట ఉన్న ఈ కంపెనీ విశాఖప ట్నం డాబాగార్డెన్‌లోని ఇండియన్ బ్యాంకు నుంచి 2005లో దాదాపు రూ.141.68 కోట్లు రుణం తీసుకుంది. ఈ రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించని కారణంగా వడ్డీతో కలిపి రూ.196 కోట్ల మేర బకాయి పేరుకు పోయింది. దీన్ని చెల్లించాలంటూ పలుమార్లు నోటీసులు జారీచేసినా కంపెనీ నుంచి స్పందన రాలేదు. దీంతో ప్రత్యూష ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రత్యూష గ్లోబల్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు చెందిన ఆస్తులతోపాటు ఈ రుణం కోసం మంత్రి శ్రీనివాసరావు, కంపెనీ డైరెక్టర్లు పరుచూరి రాజారావు, పరుచూరి వెంకయ్య ప్రభాకరరావు, పరుచూరి వెంకట భాస్కరరావు, కొండయ్య బాలసుబ్రహ్మణ్యం, నామి అమూల్యల ఆస్తులను గత డిసెంబర్ 21వ తేదీ నుంచి 26వ తేదీ మధ్య స్వాధీనం చేసుకున్నట్టు ఇండియన్ బ్యాంకు అధికారులు ప్రకటించారు.
స్వాధీనం నోటీసు అనంతరం 60 రోజుల్లోగా బకాయిలు చెల్లించేందుకు అవకాశం ఇచ్చారు. అయితేకంపెనీతోపాటు హామీదారులెవరూ స్పందించకపోవడంతో ఆస్తులను తమ అధీనంలో తీసుకుంటున్నట్టు బుధవారం పొజిషన్ నోటీసు జారీ చేశారు. కాగా, పెరిగిన వడ్డీతో సహా రుణ బకాయిలు ప్రస్తుతం రూ.203.62 కోట్లకు చేరినట్లు బ్యాంకు తాజా ప్రకటనలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇందులో ఎంతోకొంత రికవరీ చేసుకోవాలన్న ఉద్దేశంతో గతంలో ఆయా కంపెనీలు, హామీదారుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులతోపాటు అదనంగా మరో రెండు కీలకమైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్టుగా ప్రకటన జారీ చేసింది.
తాజాగా స్వాధీనం చేసుకున్న ఆస్తులివే..
తమిళనాడులోని కాంచీపురం జిల్లా సైదాపేట తాలూకా సీషోర్ టౌన్ పరిధిలోని షోలింగనల్లూర్ గ్రామంలో సర్వే నెం.12/1, 13/1 పార్ట్, 13/2 పార్ట్‌లలో 6 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ప్లాట్ నెం.281ఏను ఫిబ్రవరి 16న స్వాధీనం చేసుకున్నట్టుగా ప్రకటించారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం మణికొండ జాగీర్ గ్రామంలో సర్వే నెం.201లో ల్యాంకో హిల్స్ టవర్–5లో 67.92 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన మొదటి, రెండో అంతస్తులను ఫిబ్రవరి 17న స్వాధీనం చేసుకున్నట్టుగా ప్రకటించారు.