బండారు భగభగ
- మంత్రి పదవి దక్కక మనస్తాపం
- టీడీపీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా
- అయ్యన్నకు అందలంపై గుర్రు
సాక్షి, విశాఖపట్నం : జిల్లా టీడీపీలో మంత్రి పదవుల సెగ రాజుకుంది. చంద్రబాబు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన మర్నాడే ఆ పార్టీలో అసంతృప్తి పెల్లుబికింది. తొలి పందేరంలో తనకు స్థానం దక్కకపోవడంతో మనస్తాపానికి గురై పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి రాజీనా మా చేశారు. ఆదివారం రాత్రి గుంటూరులో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వెళ్లిన ఆయన తనకు మంత్రివర్గంలో చోటివ్వక పోవడంతో మధ్యలోనే వెనుదిరిగారు.
సోమవారం హుటాహుటీన అనుచరులతో సమావేశమై ఆ తర్వాత పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అధ్యక్షుడు చంద్రబాబుకు ఫ్యాక్స్‌లో తన రాజీనామా పంపారు. తనకు 18 వేల ఓట్ల మె జార్టీ వస్తే, అయ్యన్నకు రెండు వేల ఓట్ల ఆధిక్యతే వచ్చిందని, అయ్యన్నతో పోల్చితే వివాద రహితుడినైన తనకు బాబు మొండిచేయి చూపారంటూ ఆవేదనకు గురయినట్టు తెలిసింది.
ఇటీవల పార్టీలో చేరిన గంటా కు మంత్రి పదవి ఎలా ఇస్తారని బండారు ప్రశ్నిస్తున్నారు. చాన్నాళ్ల నుంచి అయ్యన్న, బండారుల మధ్య అసలు పొసగడం లేదు. అయ్యన్న జిల్లాలో పార్టీపై పెత్తనం చేస్తున్నారనే నెపంతో ఆయనకు చెక్ పెట్టేందుకు గంటా శ్రీనివాసరావును పార్టీలో చేర్చుకున్నారన్న వాదన ఉంది. బండారు ప్రయత్నాలతో గంటా పార్టీలో చేరడం అయ్యన్నకు రుచించలేదు. దీంతో చంద్రబాబు సమక్షంలోనే గంటాపై విమర్శలు చేసి తన వైఖరిని స్పష్టం చేశారు.
ఈనేపథ్యంలో అయ్యన్నపై చంద్రబాబు గుర్రుగా ఉన్నందున ఆయనకు బదులు తనకు మంత్రి పదవి వస్తుందని బండారు అంచనా వేశారు. కానీ బాబు అయ్యన్న వైపే మొగ్గు చూపడంతో బండారుకు ఆశనిపాతమైంది. మంత్రి పదవి ఇవ్వకపోయినా వచ్చేసారైనా అవకాశం ఇస్తామన్న హామీ కూడా దక్కకపోవడం బండారు మనస్తాపానికి కారణంగా చెబుతున్నారు.
అయితే బండారుకు వుడా ఛైర్మన్ పదవి దక్కుతుందని ఆయన అనుచరులు ఆశాభావంతో ఉన్నారు. దీనిపై బండారుతో ‘సాక్షి’ మాట్లాడగా, తనకు వుడా ఛైర్మన్ పదవి వద్దని చెప్పారు. బండారు అలకను పార్టీ అధిష్ఠానం పట్టించుకుంటుందో లేదో చూడాలి.