సాక్షి, విశాఖపట్నం: బాధితులకు భరోసా ఇచ్చేందుకే విషవాయువు ప్రభావిత గ్రామాల్లో బస చేశామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..స్టైరీన్ ప్రభావిత గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. తిరిగి జన జీవనం కొనసాగేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. అన్ని గ్రామాల్లో పూర్తిగా పారిశుధ్య పనులతో పాటు.. ఇళ్లను శుభ్రం చేయించామని తెలిపారు. ఇళ్ల ముందున్న చెట్లను తొలగించామని పేర్కొన్నారు. 10 మంది వైద్యులతో కమిటీ ఏర్పాటు చేశామని.. గ్రామాల్లో ప్రజలను ఎప్పటికప్పుడు వైద్యుల కమిటీ పరిశీలన చేస్తోందని తెలిపారు.
(‘అప్పుడు గుర్తుకు రాలేదా బాబూ..’)
బాధితులకు హెల్త్‌కార్డులు..
ఇలాంటి ఘటన మొదటిసారి జరిగింది కాబట్టి పూర్తిస్థాయిలో అధ్యయనం చేయిస్తున్నామని చెప్పారు. ప్రతి బాధిత గ్రామంలో 24 గంటలు పనిచేసేలా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. వెంకటాపురంలో ‘వైఎస్సార్ క్లినిక్’ కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఇన్ పేషంట్ ఉండేలా ఈ క్లినిక్ నిర్మాణం జరుగుతుందని వివరించారు. బాధిత గ్రామాల ప్రజలకు ఒక ఏడాదిపాటు వైద్య సేవలు అందే విధంగా హెల్త్ కార్డులు ఇవ్వనున్నామని పేర్కొన్నారు.
(మన నీళ్లను తీసుకుంటే తప్పేంటి?: సీఎం జగన్)
స్టైరీన్‌ను వెనక్కి పంపిస్తున్నాం..
రాష్ట్రవ్యాప్తంగా రసాయన పరిశ్రమలను తనిఖీ చేస్తామన్నారు. విశాఖలో 20 రసాయన పరిశ్రమలను గుర్తించామని.. వచ్చే 4 రోజుల్లో పరిశ్రమల్లోని భద్రతా ప్రమాణాలు తనిఖీ చేస్తామని కన్నబాబు తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు స్టైరీన్‌ను దక్షిణ కొరియాకు వెనక్కి పంపిస్తున్నామని పేర్కొన్నారు. రేపు ఉదయానికి ఒక షిప్ వెనక్కి వెళ్లనుందని తెలిపారు.
తప్పుడు ప్రచారాలు దుర్మార్గం..
గ్యాస్ ఘటన బాధితులు మంగళవారం కొంతమంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని..రేపు(బుధవారం) మరి కొంతమంది డిశ్చార్జ్ అవుతారని పేర్కొన్నారు. విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనలో మృతి చెందిన చిన్నారి గ్రీష్మ తల్లిపై కేసులు నమోదు చేశామని తప్పుడు ప్రచారాలు చేయడం దుర్మార్గమని మంత్రి కన్నబాబు మండిపడ్డారు. ప్రజల్లో అపోహలు కలిగించే విధంగా తప్పుడు ప్రచారం చేయొద్దని కన్నబాబు హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment