సాక్షి, తాడేపల్లి: గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకూడదని..అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని బీసీజీ కమిటీ స్పష్టంగా చెప్పిందని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. శనివారం తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీసీజీ కమిటీ మీద కొందరు అవాకులు చవాకులు పేలుతున్నారని.. బీసీజీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న కమిటీ అని పేర్కొన్నారు. చంద్రబాబుతోనూ బీసీజీ కమిటీ కలిసి పనిచేసిందన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉందని చెప్పారు. ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతమని..అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే మంచి ఉద్దేశం సీఎం వైఎస్ జగన్‌కు ఉందన్నారు. రాజధాని ప్రాంత రైతుల్లో కొంత ఆందోళన ఉందని.. రైతులకు అన్యాయం జరగకుండా సీఎం చూసుకుంటారన్నారు.
ఆ ప్రాంతాల పరిస్థితి ఏమిటీ..?
రాజధాని పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని దుయ్యబట్టారు. బినామీల పేరుతో చంద్రబాబు, టీడీపీ నేతలు భూములు కొనుగోలు చేశారన్నారు. ఐదేళ్ల కాలంలో కేవలం చంద్రబాబు రూ.5వేల కోట్లు ఖర్చు చేశారని..ఆ సొమ్ముకు 700 కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తుందన్నారు. లక్ష 16వేల కోట్లు పెట్టి రాజధాని కడితే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రాజధాని కట్టడంలో చంద్రబాబు వైఫల్యం చెందారన్నారు. మహిళలను అడ్డం పెట్టుకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. 6న హై పవర్ కమిటీ సమావేశమవుతుందని.. కమిటీ నివేదికను చట్టసభల్లో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అమరావతికి ఎక్కడికి తరలిపోలేదు..అలాంటి అపోహలు సృష్టించవద్దన్నారు.
మత్స్యకారుల విడుదలకు సీఎం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు..
పాకిస్తాన్ చెరలో ఉన్న ఆంధ్రా జాలర్లు.. తమ వల్లే విడుదల అవుతున్నారని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని మంత్రి మోపిదేవి మండిపడ్డారు. శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు పొరపాటున పాకిస్తాన్ జలాల్లోకి వెళ్ళి ఆ దేశం చెరలో చిక్కుకున్నారని.. ఆ విషయాన్ని జాలర్ల కుటుంబ సభ్యులు వైఎస్ జగన్ పాదయాత్రలో ఉన్న సమయంలో ఆయన దృష్టికి తీసుకెళ్లారన్నారు. మత్స్యకారులను విడిపించేందుకు వైఎస్ జగన్ ప్రత్యేకశ్రద్ధ తీసుకున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి ప్రధాని మోదీ, అమిత్‌షా దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారన్నారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం దృష్టికి మత్స్యకారుల కుటుంబాలు ఎన్ని సార్లు తీసుకెళ్లిన పట్టించుకోలేదన్నారు. వైఎస్ జగన్ ఆదేశాలతో ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయన్నారు. ఈ నెల 6న మత్స్యకారులు విడుదల అవుతున్నారని మంత్రి మోపిదేవి చెప్పారు.
చదవండి:
పెరుగన్నం అరగక ముందే పవన్ మాటమార్చారు..
మూడు రాజధానులు.. రెండు ఆప్షన్లు!
బీసీజీ నివేదికలో ప్రస్తావించిన అంశాలు
ఆ డబ్బుతో విశాఖలో రాజధాని నిర్మాణం..
Comments
Please login to add a commentAdd a comment