
సాక్షి, అమరావతి: అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ ఇవ్వాలన్నదే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం లక్ష్యమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పూర్తి పారదర్శకతతో పింఛన్లను ప్రభుత్వం మంజూరు చేస్తోందని స్పష్టం చేశారు. సంతృప్తిస్థాయిలో వైఎస్సార్ పెన్షన్ కానుకను అమలు చేయాలనే సంకల్పంతో వైఎస్సార్‌సీసీ ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. పెన్షన్ల పంపిణీలో ప్రభుత్వం రికార్డు సృష్టించిందన్నారు. రాష్ట్రంలో పెన్షన్లు మంజూరు కాని వారికి న్యాయం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అర్హత ఉన్న కూడా పెన్షన్ రాని వారిని గుర్తించేందుకు వారం రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెలలో మొత్తం 54.68 లక్షల మందికి 1వ తేదీనే పింఛన్లు పంపిణీ చేశామన్నారు. వాలంటీర్ల ద్వారా మొత్తం రూ.1320 కోట్లను లబ్ధిదారులకు అందించి ప్రభుత్వం రికార్డు సృష్టించిందన్నారు.
నవశకం సర్వే ద్వారా రాష్ట్రంలో అర్హులైన పెన్షనర్లను గుర్తించామని.. కొత్తగా ఈ నెలలో 6.14 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేసామని పేర్కొన్నారు. అర్హత లేని కారణంగా 4.80 లక్షల మందికి పెన్షన్లు తొలగించామని వెల్లడించారు. సుమారు 31,672 మంది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పింఛన్లు ఇచ్చామని వెల్లడించారు. అర్హులందరికీ లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశ్యంతో గతం కన్నా మార్గదర్శకాలను కూడా సరళం చేశామని వివరించారు. దివ్యాంగులకు వారి వైకల్య శాతంతో సంబంధం లేకుండా 40 శాతం పైబడిన వారందరికీ రూ.3వేలు పెన్షన్ ఇస్తున్నామన్నారు. దివ్యాంగులు,దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్న కుటుంబంలో అర్హత ఉన్న వారికి రెండో పెన్షన్ ఇచ్చే వెసులుబాటు కల్పించామని పేర్కొన్నారు.
‘కుటుంబ ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాలలో నెలకు రూ.10వేలు, పట్టణ ప్రాంతాలలో రూ. 12వేలకు పెంచాం. టాక్సీ, ట్రాక్టర్, ఆటో లకు నాలుగు చక్రాల వాహన పరిమితి నుంచి మినహాయింపు ఇచ్చాం. అభయహస్తం పెన్షన్ తీసుకునేవారికి అర్హతను బట్టి వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేస్తున్నాం. మున్సిపల్ ఏరియాలో వెయ్యి చదరపు అడుగుల నివాసం వున్న వారికి కూడా పెన్షన్ ఇస్తున్నామని’ తెలిపారు. కుటుంబ నెలసరి విద్యుత్ వినియోగం 300 యూనిట్ల వరకు మినహాయింపు ఇచ్చామని’ మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.