బీసీ సంక్షేమ శాఖ డీడీ కార్యాలయంలో ఉద్యోగుల హాజరు చూసి అసహనం వ్యక్తం చేస్తున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ
సాక్షి, అనంతపురం: ‘‘ఇదేమైనా కార్యాలయమా..? మరేదైనా అనుకుంటున్నారా..? వేళకు రావాలని తెలీదా.? ఇష్టానుసారం ఎలా వస్తారు..? పద్ధతి మార్చుకోవాలి. తొలిసారి వదిలిపెడుతున్నా. మళ్లీ వస్తా. అప్పటికీ పద్ధతి మార్చుకోకపోతే ఇబ్బంది పడతారు.’’ అని బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ బీసీ సంక్షేమ శాఖ ఉప సంచాలకుల కార్యాలయ ఉద్యోగులను హెచ్చరించారు. మంగళవారం ఉదయం ఆయన కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా అటెండెన్స్ పరిశీలించారు. టైపిస్ట్ విజయరాజు, కంప్యూటర్ ఆపరేటర్ శేఖర్ రిజిస్టర్‌లో సంతకాలు చేయకపోవడంతో వారు డ్యూటీకి రాలేదా? అని డీడీ యుగంధర్‌ను మంత్రి ప్రశ్నించారు. కంప్యూటర్ ఆపరేటర్ ఆఫీసుకు వచ్చి బయోమెట్రిక్ వేసి అనుమతితో వెళ్లారని వివరించారు. వచ్చి కూడా రిజిస్టర్‌లో సంతకం చేయకపోతే ఎలా? ఏమనుకుంటున్నారు? అని మంత్రి మండిపడ్డారు. అనారోగ్య రీత్యా విజయరాజు సరిగా రావడం లేదని, వచ్చినా పని చేయడని డీడీ వివరించారు. మంత్రి స్పందిస్తూ రెగ్యులర్ ఉద్యోగి దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంటే మరొకరిని నియమించుకుని పనులకు ఆటంకం కలుగకుండా చూడాలని సూచించారు.
అర్జీల నమోదులో నిర్లక్ష్యంపై ఆగ్రహం
‘స్పందన’ కార్యక్రమానికి అందిన అర్జీల నమోదు ప్రక్రియ సరిగా లేకపోవడంతో మంత్రి శంకరనారాయణ అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘స్పందన’ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం కార్యాలయ ఆవరణను పరిశీలించారు. కార్యాలయ స్థలాన్ని ఆక్రమించిన వారిపై కేసులు నమోదు చేయించి బంకులను తొలగించాలని ఆదేశించారు.
బయోమెట్రిక్ తప్పనిసరి
బీసీ సంక్షేమ వసతి గృహాల్లో కచ్చితంగా బయోమెట్రిక్ అటెండెన్స్ అమలు చేయాలని మంత్రి శంకరనారాయణ ఆదేశించారు. బీసీల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. బీసీలను ఉన్నత స్థాయిలో చూడాలనే ఆలోచనతోనే ఆయన పాలన సాగిస్తున్నారన్నారు. పేదరికం కారణంగా వెనుకబడిన తరగతుల విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో నియోజకవర్గానికి ఒక వసతి గృహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
రుచికరమైన భోజనం అందించేందుకు ప్రతి విద్యార్థికీ నెలకు రూ.1,050 వెచ్చిస్తున్నామన్నారు. హాస్టళ్లను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లడమే లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం వసతి గృహాల స్థితిపై ఫొటోలు తీయిస్తున్నామన్నారు. రెండేళ్ల తర్వాత చేసిన అభివృద్ధిపై ఫొటోలు తీయించి ‘నాడు–నేడు’ అని ప్రజలకు తెలియజేస్తామన్నారు. అలాగే కార్పొరేషన్ ద్వారా అర్హులైన బీసీలకు సంక్షేమపథకాలు అమలు చేస్తామన్నారు. మంత్రి వెంట బీసీ సంక్షేమశాఖ ఉప సంచాలకులు యుగంధర్, అనంతపురం ఏబీసీడబ్ల్యూఓ నాగరాజు, సూపరింటెండెంట్ శ్రీనివాసులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment