సాక్షి, విజయవాడ: గత ఐదేళ్ల టీడీపీ పాలనలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఊసే ఎత్త లేదని దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం సౌమరంగ చౌక్ లో శ్రీవాసవీ ఫౌండేషన్, వాసవీసేవాదళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అమరజీవి పొట్టి శ్రీరాములు 67వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన రోజున సైతం చంద్రబాబు దిక్కుమాలిన నవ నిర్మాణ దీక్షలు చేశారని మండిపడ్డారు. పొట్టి శ్రీరాములు త్యాగం ప్రజల్లో గుర్తుండిపోయే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించారని తెలిపారు. టీడీపీ పాలనలో పొట్టి శ్రీరాములు ఆచూకీ లేకుండా చేశారన్నారు. అవతరణ దినోత్సవం రోజున శ్రీరాములు మనవరాలును సీఎం జగన్ ఘనంగా సత్కరించారన్నారు. వైశ్య కార్పొరేషన్ అంశంపై నిర్ణయం త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. అన్ని వర్గాలవారికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
ఆయన పోరాటం అజరామరం..
సత్యనారాయణపురంలో నిర్వహించిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణ త్యాగం చేసిన మహనీయుడని ప్రస్తుతించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన పోరాటం అజరామరం అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment