సాక్షి, విజయవాడ: గత ఐదేళ్ల టీడీపీ హయాంలో అభివృద్ధి శూన్యమని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. తూర్పు నియోజకవర్గంలో నాలుగు కోట్ల 20 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్ దేవినేని అవినాష్, నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ సీఎం గా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టిన ఏడాది కాలంలోనే తూర్పు నియోజకవర్గంలో 110 కోట్లు రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి, నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించారని పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభూత కల్పనలు, షోలు చేయడానికి మాత్రమే పరిమితమయ్యారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో నగరానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నగరంలోని అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి 500 కోట్లు కేటాయించిందని తెలిపారు. గత ఐదేళ్లు అమరావతి పేరు చెప్పి అభివృద్ధి అంటూ ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. అభివృద్ధికి అడ్డుపడేవారు చంద్రబాబు అని.. అభివృద్ధికి పాటుపడే వారు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు. దేవినేని అవినాష్ నాయకత్వంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. (కొత్త ఒరవడికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం)
విజయవాడ గ్యాంగ్‌వార్ ఎవరి తాలుకో ప్రజలందరికీ తెలుసునన్నారు. ఇంతకు ముందులేని గ్యాంగ్‌వార్‌లు ఇప్పుడెందుకు వచ్చాయని ప్రశ్నించారు. విజయవాడలో విధ్వంసం సృష్టించాలని టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు.. ఆయన బినామీల లబ్ధికోసం జన్మభూమి కమిటీలంటూ దిక్కుమాలిన కమిటీలు, పథకాలు తెచ్చారని ధ్వజమెత్తారు. కమిటీలతో పనిలేకుండా సంక్షేమ ఫలాలను వైఎస్ జగన్ నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్నారన్నారు. కుల, మత,రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నారని వెల్లంపల్లి పేర్కొన్నారు.
గత ఐదేళ్లలో ఎన్ని హామీలు నెరవేర్చారు..?
తూర్పు నియోజకవర్గంలో 210 కోట్లతో అభివృద్ధి పనులు చేట్టామని దేవినేని అవినాష్ తెలిపారు. మెజార్టీ రాని ప్రాంతాల్లో సైతం అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు.గత ఐదేళ్లలో ఎన్ని హామీలు నెరవేర్చారో టీడీపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు. రౌడీ రాజ్యానికి పేటెంట్ హక్కు తెలుగుదేశం పార్టీదని, బెజవాడ గ్యాంగ్‌వార్లోని కొందరు సభ్యులు టీడీపీ నేతల అనుచరులేన్నారు. గ్యాంగ్‌స్టార్‌లు, గంజాయి బ్యాచ్‌లు గత టీడీపీ హయాంలోనే తయారయ్యారని దేవినేని అవినాష్ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment