* ‘అనంత సూపర్ స్పెషాలిటీ’కి చంద్రబాబు రూ.150 కోట్లిచ్చారన్న మంత్రులు సునీత, పల్లె
* కేంద్రం రూ.120 కోట్లు, రాష్ట్రం రూ.30 కోట్లు అంటూ అదే వేదికపై మరో మంత్రి కామినేని ప్రకటన
* పరస్పర విరుద్ధ ప్రకటనలతో నవ్వులపాలైన అమాత్యులు
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ‘బొంకరా మల్లన్నా.. అంటే గోల్కొండ మిరపకాయలు తాటి పండంత’ అన్నట్లుగా ఉంది రాష్ట్ర మంత్రుల వ్యవహారం. గురువారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ జిల్లాలోని పెనుకొండ, హిందూపురం తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఆయనతో పాటు జిల్లా మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి ఉన్నారు. మంత్రి పర్యటనలో భాగంగా అనంతపురంలో బోధనాస్పత్రి సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఇందులో జిల్లా మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ రెడ్డి అనంతపురం జిల్లా అభివృద్ధికి తమ నాయకుడు చంద్రబాబు చేస్తున్న కృషిని పోటీ పడి మరీ శ్లాఘించారు.
ఈ క్రమంలో ఈ ఇద్దరు మంత్రులూ అనంతపురంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి చంద్రబాబు రూ.150 కోట్లు కేటాయించారని చెప్పారు. వీరి తర్వాత ప్రసంగించిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మాత్రం అనంత సూపర్ స్పెషాలిటీకి మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం రూ.120 కోట్లు సమకూరుస్తుందని, మిగతా రూ.30 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. ఒకే వేదికపై మంత్రులు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. బీజేపీ నుంచి గెలుపొందిన కామినేని శ్రీనివాస్ పొత్తు ధర్మంలో భాగంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి అయ్యారు. మిగిలిన ఇద్దరూ టీడీపీ మంత్రులు.
కాబట్టే ఇలా పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో కొసమెరుపు ఏమిటంటే... అసలు అనంతపురానికి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఎన్నికలకన్నా ముందే యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ రూ.120 కోట్లు మంజూరు చేసింది. మిగిలిన రూ.30 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని 2014 జనవరి 1న కేంద్రం.. రాష్ట్ర సర్కారుకు లేఖ పంపింది. జిల్లా మంత్రులేమో చంద్రబాబు రూ.150 కోట్లు కేటాయించారని.. కామినేని ఏమో తమ కేంద్ర ప్రభుత్వం రూ.120 కోట్లు కేటాయించిందంటూ వాస్తవాన్ని కప్పిపుచ్చి ప్రజల చెవిలో పువ్వు పెట్టే ప్రయత్నం చేశారు.
చెవిలో పువ్వు!
Published Fri, Sep 12 2014 2:29 AM | Last Updated on Fri, Jun 1 2018 8:31 PM
Advertisement
Advertisement