* మీరు త్యాగాలు చేయరా అని మంత్రులను ప్రశ్నించిన విపక్షం
* ఆలయాలకు పాలక మండళ్లు, మార్కెట్ కమిటీలకు అవకాశం
* అభ్యంతరాలను తోసిరాజని బిల్లులకు శాసనసభ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు పీఆర్సీ కోసం ఉద్యోగులు అడుగుతున్నా స్పందించని ప్రభుత్వం.. మంత్రుల ఇంటి అద్దెను రూ. 50 వేల నుంచి రూ. లక్షకు పెంచుకోవడానికి సభలో బిల్లు పెట్టడాన్ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి తప్పుబట్టారు. మంత్రుల ఇంటి అద్దెను రూ. 50 వేల నుంచి రూ. లక్షకు పెంచడానికి ఉద్దేశించిన ‘ఏపీ జీతాలు, పెన్షన్ల చెల్లింపు సవరణ బిల్లు’ మీద శుక్రవారం జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ‘‘విభజన వల్ల రూ. 16 వేల కోట్ల లోటు ఉంది.
త్యాగాలకు సిద్ధం కావాలని సీఎం పదేపదే ప్రజలకు పిలుపునిస్తున్నారు. మరోవైపు రాజధానికి విరాళాలు సేకరిస్తున్నారు. త్యాగాలకు సిద్ధం కావాలని ప్రజలకు పిలుపునిస్తున్న వారు.. కనీసం పొదుపునకైనా సిద్ధం కారా? పొదుపు కోసం కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మంత్రుల భత్యాలు పెంచడం తగదు’’ అని హితవు చెప్పారు. ప్రతిపక్షం అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణించలేదు. బిల్లుకు ఆమోదం తెలపాలని ఆర్థిక మంత్రి యనమల ప్రతిపాదించారు. బిల్లుకు సభ ఆమోదముద్ర వేసింది.
డీజీపీకి 2 సంవత్సరాల పదవీ కాలం
పదవీ విరమణతో సంబంధం లేకుండా డీజీపీకి 2 సంవత్సరాల పదవీ కాలాన్ని కల్పించడానికి ఉద్దేశించిన పోలీసు సంస్కరణల సవరణ బిల్లుకు కూడా సభ ఆమోదం తెలిపింది. యూపీఎస్సీ సూచించిన ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల నుంచి ఒకరిని ఎంపిక చేసే అధికారం తాజా బిల్లు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ‘‘ఒకట్రెండు నెలల్లో పదవీ విరమణ చేసే అధికారిని డీజీపీగా ఎంపిక చేస్తే, తర్వాత రెండేళ్ల వరకు పదవిలో ఉంటారు.
సీనియారిటీలో తర్వాత స్థానాల్లో ఉన్న ఐపీఎస్ అధికారులకు అన్యాయం జరగదా?’’ అని విపక్ష నేత జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆయన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండానే హోం మంత్రి చినరాజప్ప బిల్లును ఆమోదించాలని సభను కోరారు. బిల్లుకు సభ ఆమోదం లభించింది. దేవాలయాల ప్రస్తుత పాలక మండళ్ల రద్దు, పాలక మండళ్లలో సభ్యుల సంఖ్య పెంపునకు అవకాశం కల్పించే ‘ఏపీ ధార్మిక, హిందూ మతపర సంస్థలు, దేవాలయాలు(సవరణ) బిల్లు’ మీద చర్చ జరగకుండానే సభ ఆమోదం తెలిపింది. ఫలితంగా కొత్త పాలక మండళ్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి అవకాశం లభించింది.
మంత్రుల ఇంటి అద్దె రూ.లక్షకు పెంపు
Published Sat, Sep 6 2014 2:45 AM | Last Updated on Sat, Sep 2 2017 12:55 PM
Advertisement