
సాక్షి, అమరావతి: మంత్రుల శాఖల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులను ఆశిస్తున్న ప్రభుత్వం ఆ దిశగా వ్యవసాయ రంగానికి సంబంధించిన కొన్ని కీలక శాఖలను ఒకే మంత్రిత్వశాఖ కిందకు తీసుకువచ్చింది. దీంట్లో భాగంగానే మంత్రి మోపిదేవి వద్దనున్న మార్కెటింగ్‌శాఖను, అలాగే మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వద్దనున్న ఫుడ్ ప్రాససింగ్ శాఖను.. వ్యవసాయ, సహకార శాఖలను చూస్తున్న మంత్రి కె.కన్నబాబుకు అప్పగించారు. పరిపాలనా పరమైన సౌలభ్యంతో పాటు మరింత మేలు జరిగే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
మంత్రి మోపిదేవి వద్ద ప్రస్తుతం పశుసంవర్థక, మత్స్యశాఖలు ఉన్నాయి. మరో శాఖను మోపిదేవికి అప్పగించాలని సీఎం యోచిస్తున్నారు. దీనికి సంబంధించి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. అలాగే బదలాయించిన ఫుడ్ ప్రాసెసింగ్ పోనూ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి వద్ద పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖలున్నాయి. కొద్దిరోజుల కిందటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్కిల్‌డెవలప్‌మెంట్ శాఖను మంత్రి గౌతంరెడ్డికి అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment