పదిహేనేళ్ల బాలికను మూడు రోజులపాటు గదిలో నిర్బంధించి ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కృష్ణా (విజయవాడ) : పదిహేనేళ్ల బాలికను మూడు రోజులపాటు గదిలో నిర్బంధించి ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయవాడలోని మాచవరం కార్మికనగర్ కొండ ప్రాంతానికి చెందిన బాలికను గుణదలకు చెందిన యువకులు మాయమాటలతో మభ్యపెట్టి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశారు. బాలికను వైద్య పరీక్షలకు పంపిన పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఘటన వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ కుటుంబం విజయవాడలోని కార్మికనగర్ కొండ ప్రాంతంలో నివాసం ఉంటోంది. ఇటీవల భర్త చనిపోవడంతో ఇళ్లలో పనికి వెళ్లే బాలిక తల్లి.. తన పదిహేనేళ్ల కుమార్తెను చదువు మాన్పించి ఇంటి వద్దనే ఉంచింది. కాగా మంగళవారం గుణదల చర్చికి వెళ్లిన బాలికను పరిచయస్తుడైన యువకుడు బెత్లెహాంనగర్‌లోని తన రూమ్‌కి తీసుకెళ్లాడు. ఆమెను సాయంత్రం వరకు తన వద్దనే ఉంచుకొని ఇంటి వద్ద దింపిన యువకుడు మరుసటి రోజు తిరిగి ఆమెను రూమ్‌కి రప్పించాడు.
ఆపై తన నలుగురు స్నేహితులతో కలిసి జక్కంపూడిలోని ఖాళీగా ఉన్న జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఫ్లాట్కు తీసుకెళ్లాడు. వారు చెప్పినట్టు చేసేందుకు బాలిక నిరాకరించడంతో కర్రతో కొట్టి చిత్రహింసలకు గురి చేశారు. ఆమెకు మత్తు మందు ఇచ్చి సామూహిక అత్యాచారం చేసిన వీరు నేరుగా గుణదలలోని తమ గదికి తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఆమెను గదిలోనే నిర్బంధించి పదే పదే అత్యాచారం చేశారు. మరోపక్క కుమార్తె కనిపించకపోవడంతో ఆమె తల్లి తమ బంధువుల ఇళ్లకు వెళ్లి వెదుకులాట ప్రారంభించింది.
ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం అపస్మారక స్థితికి చేరుకున్న బాలికను ఆ యువకులు శనివారం ఇంటి వద్ద దించి పరారవుతుండగా సమీపంలోని బంధువులు గమనించి ముగ్గురినీ పట్టుకున్నారు. వారిని పోలీసులకు అప్పగించగా మరో ఇద్దరు పరారయ్యారు. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం నక్కలపాలెం గ్రామానికి చెందిన నిందితులు గుణదలలో గదులు అద్దెకు తీసుకొని ఉంటూ ప్రసాదంపాడులోని చాక్లెట్ తయారీ కంపెనీలో పనిచేస్తున్నారు. మాచవరం పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.