బాలికకు ప్రేమ పెళ్లిచేసిన పెద్దలు
- అవమానంతో బాలిక తండ్రి ఆత్మహత్య
- పోలీస్ స్టేషన్ వద్ద గ్రామస్తుల ధర్నా
కేవీబీపురం: మైనరైన తన కుమార్తెకు గ్రామ పెద్దలు కులాంతర వివాహం జరిపించారనే అవమానం భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం చిత్తూరు జిల్లా, కేవీబీపురం మండలంలోని రాగిగుంట గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులు శవాన్ని తీసుకొచ్చి పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. బాధితుల కథనం మేరకు రాగిగుంట గ్రామానికి చెందిన చెల్లా గోపాల్ కుమారుడు వాసు (21) ఆటో నడుపుతుంటాడు.
అతడు, అదే గ్రామానికి చెందిన అగరం సుబ్రమణ్యం కూతురు కవిత (16) ప్రేమించుకున్నారు. వీరి కులాలు వేరుకావడంతో అమ్మాయి తల్లిదండ్రులు వాసును మందలించారు. దాంతో వాసు తన బంధువులు, గ్రామ సర్పంచ్ పిన్నబోయిన అరవింద్, గ్రామ పెద్దలు ఇట్టగుంట శ్రీధర్, గెంజి జనార్ధన్, డబ్బుగుంట కృష్ణయ్య, బిల్లు నరేష్, గెంజి లోకనాథం, గెంజి రమణయ్యను ఆశ్రయించాడు.
వారు రహస్యంగా తీసుకెళ్లి ఈ నెల ఐదో తేదీ పెళ్లి చేశారు. దీం తో తీవ్ర మనస్థాపానికి గురైన అగరం సుబ్రమణ్యం గురువారం తెల్లవారుజామున ఉరివేసుకుని మృతి చెందాడు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని రాగిగుంట గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ఎదుట ఉదయం 9 గంటల నుం చి మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నా చేశారు.
రహస్య వివాహం జరిపించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్వేటినగరం ఎస్‌ఐ శ్రీనివాసులు కేవీబీపురం చేరుకుని అందరిపైనా కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు ధర్నా విరమించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు.