మైనర్ బాలికపై అత్యాచారం | Minor girl raped | Sakshi
Sakshi News home page

మైనర్ బాలికపై అత్యాచారం

Published Fri, Jul 11 2014 2:44 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM

Minor girl raped

 అనంతపురం క్రైం : బుక్కరాయసముద్రం మండలంలో ఓ మైనర్ బాలిక(15)పై అత్యాచారం జరిగింది. నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి కాళ్లు చేతులు కట్టిపడేసి.. ఓ యువకుడు అత్యాచారం చేయగా.. మరో యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మరో ఇద్దరు ఈ దాష్టీకానికి కాపలాగా ఉన్నారు. బాధితురాలు, ఆమె తల్లిదండ్రులు తెలిపిన మేరకు వివరాలు.. బుక్కరాయసముద్రం మండలంలోని ఒక గ్రామానికి చెందిన బాలిక (15) ఏడో తరగతి వరకు చదువుకుంది. తల్లిదండ్రులు ఓ చికెన్ సెంటర్‌లో పనిచేస్తున్నారు. బుధవారం సాయంత్రం బాలిక బహిర్భూమి కోసం సమీపంలోని వంకవద్దకెళ్లి వస్తుండగా ప్రసాద్, శివతోపాటు మరో ఇద్దరు యువకులు రెండు బైక్‌లపై వచ్చి బాలికను కిడ్నాప్ చేశారు.
 
 నోటిని అదిమిపట్టి.. అరిస్తే చంపుతామని బెదిరించి ఎస్‌ఆర్‌ఐటీ కళాశాల వెనుకవైపు ఓ పాడుబడిన గుడిసెలోకి తీసుకెళ్లారు. అక్కడ బాలిక కాళ్లు, చేతులు కట్టేసి.. ముగ్గురు యువకులు బయట నిల్చోగా...ప్రసాద్ అత్యాచారం చేశాడు. ఆ తర్వాత శివ లోనికి వచ్చి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అనంతరం బాలికను తాడిపత్రి వైపు తీసుకెళ్లేందుకు నలుగురూ చర్చించుకుంటుండగా బాలిక కేకలు వేసింది. అరవకపోతే ఊరిలో వదిలేస్తామని చెప్పడంతో వారు చెప్పినట్టు చేసింది. బైక్‌లో ఎక్కించుకుని రాత్రి 9 గంటల తర్వాత గ్రామ శివారులోని ప్రభుత్వ పాఠశాల వద్ద వదిలేసిన యువకులు.. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని మరోసారి హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
 
 రాత్రి 7.30 గంటలకు ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు కూతురు కనిపించకపోవడంతో పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. అనుమానం ఉన్న వ్యక్తులపై ఫిర్యాదు చేయబోతే ‘మీ ఊర్లో ఎప్పుడూ ఇదే పంచాయితీనా.. వెళ్లండంటూ’ ఓ పోలీసు చీదరించుకున్నాడు. దీంతో చేసేదిలేక స్వగ్రామానికి తిరిగి వస్తున్న తల్లిదండ్రులకు గ్రామంలోని పాఠశాల వద్ద ఏడ్చుకుంటూ నిస్సహాయ స్థితిలో ఉన్న కూతురు కనిపించింది. గురువారం ఉదయం ఓ దళితనేత సహకారంతో బాధితురాలి కుటుంబ సభ్యులు ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అయితే అక్కడ ఓ అధికారి జోక్యం చేసుకుని తాను ఇటుకలపల్లి సీఐకి చెబుతాను.. అక్కడికెళ్లి కలవండంటూ సూచిం చారు. ఈ మేరకు వారు ఇటుకలపల్లి సర్కిల్ కార్యాలయానికి వెళ్లగా సీఐ అందుబాటులో లేరు. ఈ లోపు బుక్కరాయసముద్రం ఎస్‌ఐ దళిత నేతకు ఫోన్ చేసి.. తాము కేసు నమోదు చేసుకోమని చెప్పామా.. అంటూ మందలించి.. వెంటనే స్టేషన్‌కు రావాల్సిందిగా ఆదేశించారు. ఎట్టకేలకు ప్రసాద్, శివపై కేసు నమోదు చేసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement