* కేంద్ర ముసాయిదాను ఆమోదించాలన్న వామపక్షాలు
* తగ్గింపునకు వ్యతిరేకమన్న కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ
* సర్కారూ వ్యతిరేకమేనన్న మంత్రి
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ భూ గరిష్ట పరిమితి (ల్యాండ్ సీలింగ్)ని కుదించాలనే ప్రతిపాదనపై రాజకీయ పక్షాలు, రైతుకూలీ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. కేంద్ర భూసంస్కరణల ముసాయిదా-2013పై సూచనలు, సలహాల నిమిత్తం ప్రభుత్వం ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి అధ్యక్షతన రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) కార్యాలయంలో ఈ భేటీ జరిగింది.
ప్రస్తుతం ఫ్యామిలీ హోల్డింగ్‌కు (కుటుంబం) మాగాణి భూమి అయితే 27 ఎకరాలు, మెట్ట అయితే 54 ఎకరాలు ఉండవచ్చని రాష్ట్ర గరిష్ట భూపరిమితి చట్టం చెబుతోంది. అయితే మాగాణి అయితే 10 ఎకరాలు, మెట్ట అయితే 15 ఎకరాలు మాత్రమే ఉండేలా చట్ట సవ రణను ముసాయిదా ప్రతిపాదిస్తోంది. ‘ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న ల్యాండ్ సీలింగ్‌ను కుదించొద్దు. లొసుగులను అరికట్టి పకడ్బందీగా అమలు చేయాలి. పరిమితి కుదింపునకు మేము వ్యతిరేకం..’ అని ఉమామల్లేశ్వరరావు (కాంగ్రెస్), కోదండరెడ్డి (కిసాన్ కాంగ్రెస్), కోడెల శివప్రసాదరావు (టీడీపీ), ఇంద్రసేనారెడ్డి (బీజేపీ) స్పష్టం చేశారు.
ఇప్పటికే చిన్న కమతాలు పెరగడం వల్ల యాంత్రీకరణ ఇబ్బంది అవుతోందని, సాగు గిట్టుబాటుకాక రైతులు ఇబ్బంది పడుతున్నారని వారన్నారు. ఇంకా సీలింగ్ తగ్గిస్తే కమతాలు మరింత చిన్నగా అవుతాయని అందుకే వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ముసాయిదాను యథాతథంగా ఆమోదించాలని సీపీఐ నేత నారాయణ, సీపీఎం నేత రాఘవులు, ఎమ్మెల్సీ జెల్లి విల్సన్‌తోపాటు కొన్ని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కోరారు. ‘ముసాయిదాను యథాతథంగా అంగీకరించడం సరికాదు. ఒకప్రాంతానికి మరో ప్రాంతానికి భూమితీరు, విలువ, నీటిపారుదల సౌకర్యం తదితర అంశాల్లో భారీ వ్యత్యాసం ఉంది. అందువల్ల అన్ని భూములను ఒకేగాటన కట్టి గరిష్ట పరిమితిని అమలు చేయకుండా దీనిపై శాస్త్రీయ అధ్యయనం నిర్వహించాలి’ అని కొందరు కోరారు.
విస్తీర్ణం కొలబద్ద కారాదు: వైఎస్సార్‌సీపీ
విస్తీర్ణం కొలబద్దగా భూ గరిష్ట పరిమితిని నిర్ధారించడం ఏమాత్రం సమంజసం కాదని వైఎస్సార్ సీపీ రైతు విభాగం నేత ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. ‘పంటలు పండక కరువుసీమ అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో ఎకరా భూమి విలువ రూ.లక్షకు పడిపోయింది. హైదరాబాద్ లాంటి నగరాల సమీపంలో ఎకరా వ్యవసాయ భూమి విలువ కోట్లలో ఉంది. కృష్ణా డెల్టాలో కొన్నిచోట్ల ఎకరా రూ 3 లక్షలు ఉంటే మరికొన్ని చోట్ల రూ.30 లక్షలు వరకూ ఉంది. ఈవిషయం అందరికీ తెలుసు. అందువల్ల ఆయా ప్రాంతాల్లో భూముల విలువ ఆధారంగా పరిమితి ఉండాలి. జాతీయ భూ సేకరణ విధానం ప్రకారం రిజిస్ట్రేషన్ విలువపై నాలుగురెట్లు నష్టపరిహారం చెల్లించి రైతుల నుంచి భూమిని తీసుకుంటే ఇచ్చేందుకు అంతా సిద్ధంగా ఉన్నారు’ అని ఆయన అన్నారు.
పోడు వ్యవసాయంతో అడవి నాశనమైందని మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రాజకీయపక్షాలు, స్వచ్చంద సంస్థలు, రైతు కూలీల అభిప్రాయాలు క్రోడీకరించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతామని సమావేశం అనంతరం రఘువీరారెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. భూగరిష్ట పరిమితిని యథాతథంగా ఉంచాలని ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్న నిర్ణయం సమంజసమైనదేనని ఆయన స్పష్టం చేశారు. లోక్‌సత్తా ప్రతినిధి వర్మ, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, రిటైర్డు ఐఏఎస్ గోపాల్‌రావు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
భూస్వాముల కొమ్ముకాస్తున్న ప్రభుత్వం: రాఘవులు
కేంద్ర ముసాయిదాను వ్యతిరేకించడంతో రాష్ట్ర ప్రభుత్వం భూస్వాముల కొమ్ముకాస్తున్నట్లు స్పష్టమైందని సీపీఎం నేత రాఘవులు అన్నారు. సమావేశానంతరం ఆయన వామపక్ష, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ధార్మిక సంస్థలకు గరిష్ట భూపరిమితిలో మినహాయింపులు వద్దని కేంద్ర ముసాయిదా పేర్కొనడాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించిందని ఆయన దుయ్యబట్టారు. కౌలు రైతులకు రుణ అర్హత కార్డుల జారీలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై, కార్డులను చూసి బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడాన్ని ప్రస్తావిస్తే మంత్రి సమాధానం చెప్పలేదని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు.
‘భూ పరిమితి’పై భిన్నాభిప్రాయాలు
Published Mon, Sep 9 2013 2:03 AM | Last Updated on Fri, Sep 1 2017 10:33 PM
Advertisement