సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్‌సీపీ తరపున ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి హాజరయ్యారు. ఏపీలో క్షీణించిన శాంతి భద్రతల పరిస్థితులను వైఎస్సార్‌సీపీ వివరించింది. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేయగా, టీడీపీ మాత్రం మౌనంగా ఉంది. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని జేడీయూ డిమాండ్ చేసింది.
ఢిల్లీ వేదికగా టీడీపీ దాడులను ఎండగడతాం: విజయసాయిరెడ్డి
అఖిల పక్ష భేటీ అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో 45 రోజుల్లో 39 హత్యలు, 300 మందిపై హత్యాయత్నాలు జరిగాయని.. ఢిల్లీ వేదికగా టీడీపీ దాడులను ఎండగడతామన్నారు. ఢిల్లీలో బుధవారం వైఎస్ జగన్ నేతృత్వంలో ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. బ్లాక్ మెయిల్ చేసే మీడియాను అడ్డుకునే చట్టం తీసుకురావాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.
కాగా, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి(సోమవారం) నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో నిన్న (శనివారం) ఆయన తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. సమావేశాల్లో అనునరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిశా నిర్దేశం చేశారు.
రాష్ట్రంలో హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, విధ్వంసాలు సృష్టిస్తూ చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న దారుణకాండను యావత్ దేశం దృష్టికి తీసుకెళ్లేందుకు ఢిల్లీలో ఈ నెల 24వ తేదీ బుధవారం నిర్వహించే ధర్నాకు అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నామని వైఎస్ జగన్ చెప్పారు.
గత 45 రోజులుగా రాష్ట్రంలో ఏం జరుగుతోందో వివరించి.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేస్తున్న పోరాటంలో కలిసి వచ్చే అన్ని పార్టీలనూ కలుపుకుపోదామని ఎంపీలకు సూచించారు. ధర్నా అనంతరం పార్లమెంట్‌కు హాజరై రాష్ట్రంలో సాగుతున్న ఆటవిక పాలనపై గళమెత్తాలని దిశా నిర్దేశం చేశారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కక్షతో చేస్తున్న దురాగతాలను తమ సభల్లోని సభ్యులందరి దృష్టికి తీసుకెళ్లాలని ఉద్భోధించారు.
Comments
Please login to add a commentAdd a comment