చార్మినార్ చూసేందుకు రూ.65వేలతో రైలెక్కాడు..
హైదరాబాద్ : చార్మినార్ చూడాలనే కోరిక నాలుగో తరగతి చదువుతున్న ఓ బాలుడిని హైదరాబాద్ తీసుకొచ్చింది. తన కోరికను నెరవేర్చుకోవడం కోసం ఇంట్లో ఎవరికి చెప్పకుండా 65వేల డబ్బుతో నగరానికి చేరుకున్నాడు. బాలుడు నాంపల్లి రైల్వేస్టేషన్లో తిరుగుతుండగా.. రైల్వే పోలీసులు అనుమానం వచ్చి ఆరా తీశారు. దీంతో అసలు విషయం బయటపడింది. డబ్బును, బాలుడ్ని అదుపులో తీసుకోని తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా కనిగిరి స్థానిక శివనగర్ కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు కుమారుడు కొత్తపల్లి వెంకట కార్తికేయ ...చార్మినార్ చూడాలని కోరిక కలిగింది. దాంతో ఇంట్లో ఉన్న రూ.65వేల నగదుతో హైదరాబాద్ రైలు ఎక్కేశాడు. నగదుతో పాటు కుమారుడు అదృశ్యం కావటంతో అతని తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించారు.
మరోవైపు నాంపల్లి రైల్వేస్టేషన్లో ఉన్న కార్తికేయ...రైల్వే ఎస్ఐ ఇబ్రహీం కంటపడ్డాడు. అసలు విషయం ఆరా తీస్తే...చార్మినార్ చూసేందుకు హైదరాబాద్ వచ్చానని, తన దగ్గర నగదు ఉన్నట్లు చెప్పటంతో ఎస్ఐ...ఈ విషయాన్ని కనిగిరి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో హైదరాబాద్ చేరుకున్న కార్తికేయ తల్లిదండ్రులకు కుమారుడితో పాటు, నగదును అప్పగించారు.