సాక్షి, పలమనేరు: ఎద్దు కనబడటం లేదంటూ కరపత్రాలు, వాల్‌పేపర్లు ముద్రించి గాలిస్తున్న ఘటన బుధవారం చిత్తూరు జిల్లా పలమనేరులో వెలుగుచూసింది. గంగవరం మండలం బండమీద జరావారిపల్లిలో ఈ నెల 25న మైలేరు (ఎడ్ల పరుగు పందెం పోటీలు)ను నిర్వహించారు. ఇందులో పాల్గొనేందుకు మన రాష్ట్రం నుంచేగాక.. తమిళనాడు నుంచి కూడా భారీగా ఎద్దులను తెచ్చారు. తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా పనమడుగుకు చెందిన ఎద్దును దాని యజమాని కొందరితో కలిసి లారీలో తెచ్చారు. పండుగలో దాన్ని వదలిపెట్టే క్రమంలో మూడో రౌండ్‌లో అది కనిపించకుండా పోయింది.
దాని కోసం గ్రామం చుట్టుపక్కల వెతికినా లాభం లేకుండా పోయింది. గ్రామానికి ఆనుకుని ఉన్న కౌండిన్య అడవిలో మూడు రోజులుగా గాలిస్తున్నా ఆచూకీ లభించలేదు. దీంతో పట్టణంలోని పలు చోట్ల ఎద్దు కనిపించడంలేదంటూ వాల్‌పోస్టర్‌లంటించారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఎద్దు ఆచూకీ కోసం కరపత్రాలను ముద్రించి పంచుతున్నారు. ఆచూకీ లభిస్తే సెల్ : 09585172143కు సమాచారం ఇవ్వాలని కూడా వాటిలో కోరారు. మైలేరు పండగల్లో బహుమతులు తెచ్చే ఈ ఎద్దులకు భలే గిరాకీ ఉంది. దీని ఖరీదు రూ.మూడు లక్షల దాకా పలుకుతుందట. తప్పిపోయిన ఎద్దు పేరు ఎక్స్‌ప్రెసిడెంట్. ఇది గతంలో పలు బహుమతులను సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment