wall poster
-
సండే ఫ్లాష్..: బ్యాక్సినిమాకెళ్తాం నాన్నా!
షూటింగ్‌లు ఆగిపోతాయట.. సినిమా టికెట్లు తగ్గించాలట. కలెక్షన్లు లేవట.. థియేటర్లు ఖాళీ అట. ఇవీ ఇవాళ్టి వార్తలు. కాని థియేటర్లో రిలీజయ్యే సినిమాయే ఏకైక వినోదంగా ఉన్న 1980–90లలో సినిమాకు వెళ్లాలంటే ఎంత తతంగం. ఎంత ప్రిపరేషను. ఎన్ని పర్మిషన్లు. ఎంత హడావిడి. ఎంత సంబరం. జ్ఞాపకం ఉన్నాయా ఆ రోజులు. జ్ఞాపకం చేయమంటారా? నేల డెబ్బయి అయిదు పైసలు. బెంచి రూపాయి. కుర్చీ రూపాయిన్నర. బాల్కనీ రెండు రూపాయలు. ఆ డబ్బులు ఉండేవి కాదు. సినిమాకంటూ కొంత డబ్బు మిగలాలంటే ఇంటి బడ్జెట్లో చాలా కుదరాలి. ఎవరికో హటాత్తుగా జ్వరం రాకూడదు. ఏ ఇంటనో పెళ్లి జరక్కూడదు. ఏదో ఒక బంధువుల ఇంటికి ప్రయాణం పడకూడదు. చుట్టాలు ఊడి పడకూడదు. నోటు పుస్తకాలని, టెక్ట్స్ పుస్తకాలని పిల్లలు డబ్బులు అడక్కూడదు. అన్నీ కుదిరి ఇంట్లో ఐదు రూపాయల వరకూ ఉంటే ఫ్యామిలీ అంతా సినిమాకు పోవచ్చు. సినిమా మారితే గోడ మీద పోస్టర్ పడుతుంది. దానిమీద నీలి సిరాతో థియేటర్ పేరు... ఎన్ని ఆటలో రాసి ఉంటుంది. బండి వీధుల్లో తిరుగుతూ మైక్‌లో ‘మీ అభిమాన థియేటర్ శ్రీ వేంకటేశ్వరలో... రేపటి నుండి’... అని అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. అది ఫ్యామిలీ సినిమా అయితే అమ్మ మనసు లాగుతుంది. ఫైటింగ్ సినిమా అయితే పిల్లలకు తబ్బిబ్బవుతుంది. నాన్నకు ఏ సినిమా అయినా ఒకటే. ఆయన ఉదయం వెళ్లి రాత్రివరకూ పని చేస్తూనో ఉద్యోగం చేస్తూనో షాపు నడుపుతూనో బిజీ. సినిమా మారినట్టే తెలియదు. చూద్దామనే ఆసక్తీ ఉండదు. కాని పర్మిషన్ ఇవ్వాల్సిందీ డబ్బు చేతిలో పెట్టాల్సిందీ ఆయనే. కొందరు నాన్నలు ఎప్పుడూ ధుమధుమలాడుతూ ఉంటారు. వారిని సినిమాకు పర్మిషన్ అడగాలంటే భయం. కాని ఆ నాన్నలే పిల్లల మాట వింటారు. ‘రేయ్... సినిమాకెళ్తామని మీ నాన్నని అడగండిరా’ అని తల్లులు పిల్లల్ని రాయబారానికి పంపుతారు. కొందరు నాన్నలు చుట్టాలు ఇంటికి రాగానే పొంగిపోతారు. ‘అందరు కలిసి సినిమాకు పోండి’ అని డబ్బులిచ్చి పంపుతారు. కొందరు నాన్నలు చాలా వింత. వాళ్లకై వాళ్లు ఏ మ్యాట్నీయో చూసేసి ఏమెరగనట్టు ఉంటారుగాని ఇంట్లోవాళ్లు సినిమాకు వెళతామంటే మాత్రం ఒప్పుకోరు. కొందరు నాన్నలు అందరూ కలిసి వెళ్లేలా టికెట్లు ముందే తెచ్చి తీసుకువెళతారు. వీళ్లు మాత్రం చాలా మంచి నాన్నలు. ఈ రోజు ఫస్ట్ షోకు వెళ్లాలంటే పొద్దున్నుంచే హడావిడి. ఇరుగమ్మకు పొరుగమ్మకు అవసరం ఉన్నా లేకపోయినా ‘ఇవాళ మేము సినిమాకు వెళుతున్నాం’ అని చెప్తుంది అమ్మ. మంచి చీరా జాకెట్టు వెతుక్కోవడం, వంట తొందరగా ముగించడం, నాన్నకోసం తాళం పక్కింట్లో ఇవ్వడం.... పిల్లలు స్కూల్లో ఫ్రెండ్స్ దగ్గర గొప్పలు పోతారు– సినిమాకు వెళుతున్నామని. ఇంట్లో నానమ్మ ఉంటే ఆమె మెల్లగా నడుస్తుంది కనుక చాలా ముందే బయలుదేరాలి. ఆమె వేలు పట్టుకుని నడిపించడానికి మనవడు తెగ తొందర పడుతుంటాడు. ట్రైల్పార్ట్ ఉంటుందని కొందరు ఆరాంగా బయలుదేరుతారు. మరికొందరు ‘డింగ్డింగ్ డింగ్డింగ్’ అని మ్యూజిక్ వచ్చి కుచ్చుల తెర పైకి లేచేప్పటి నుంచి చూడాలని ముందే వచ్చేస్తారు. చివరి నిమిషంలో టికెట్లు అయిపోయాయని వెనక్కు వెళ్లేవాళ్లు కొందరైతే... సినిమాకు గంట ముందే వచ్చి ముందు జాగ్రత్తగా ఖాళీ క్యూలో నిల్చునేవారు కొందరు. ఇంటర్వెల్లో ఏం తినాలి? దాని బడ్జెట్ ఎంత? అనేదానికి కూడా ఒక లెక్క ఉంటుంది. పిల్లలకు పావలా ఇవ్వడం పెద్ద విషయం. కొందరు తల్లులు ఏ జామకాయనో, బొరుగులనో జేబుల్లో పోసి ఇవి తిను అంటారు. ఉప్పుజల్లిన రేక్కాయలు పది పైసలకు కూడా దొరుకుతాయి హాలు బయట. లోపలకు తీసుకెళ్లి తినడమే. వడలు, బజ్జీలు తింటే అదో తృప్తి. పెద్ద కుటుంబాల వారు ఇంటర్వెల్లో గోల్డ్‌స్పాట్ కొనుక్కుని మెల్లమెల్లగా తాగుతూ చూస్తారు. అన్నింటికంటే ముఖ్యం స్టిల్స్ డబ్బా ముందు నిలబడి ఎన్ని స్టిల్స్ ఫస్ట్ హాఫ్‌లో ఉన్నాయో ఎన్ని స్టిల్స్ సెకండ్ హాఫ్‌లో రానున్నాయో చూసుకోవడం. రాబోయే సినిమాల పోస్టర్లను నోరు వెళ్లబెట్టి చూడటం. తెలిసిన ఏ ఒక్కరు కనిపించినా ‘ఏవోయ్... సినిమాకు వచ్చావా?’ అని అడగడం. సినిమాహాల్లో కనిపించినవాడు సినిమాకు రాక టిఫిన్ తినడానికి వస్తాడా? సినిమాలో మనం కట్టుకోలేని బట్టలు హీరో హీరోయిన్లు కట్టుకుంటారు. మనం చేయలేని సాహసాలు హీరోలు చేస్తారు. మనం చూడని ప్రదేశాలు అందంగా చూపిస్తారు. మనం నవ్వే ఏడ్చే సందర్భాలను రక్తి కట్టిస్తారు. అద్దె ఇళ్లు, రేషన్ సరుకు, చాలీ చాలని ఆదాయం, స్లిప్పర్లు కూడా లేని జీవితం, బయట టీ తాగడానికి కూడా ఆలోచించే బతుకు... వీటిమధ్య మూడు గంటలసేపు ఒక పెద్ద రిలీఫ్ సినిమా. అది చాలా మందిని బతికించింది. చాలామందిని చేదు వాస్తవాల నుంచి కలల్లోకి పంపింది. చాలామందికి ఆత్మబంధువుగా ఒక హీరోను ఇచ్చింది. తక్కువ తక్కువగా ఉన్నది ఏదైనా రుచిగా ఉంటుంది. అపురూపంగా ఉంటుంది. ఇవాళ? చేతిలో కంప్యూటర్లో టీవీలో ఎన్ని కావాలంటే అన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎటువంటి సినిమాలు కావాలంటే అటువంటివి ఉంటే... అంతా అతి అయిపోతే కొద్దిపాటి రుచిలోని మాధుర్యం పోయింది. ఎంతో గొప్ప వంటకం తెర కోసం తయారైందని తెలిస్తే తప్ప హాలు వైపు నడవడం లేదు ఎవరూ. కొత్తొక రోత. పాతొక వింత. మూడు గంటలసేపు ఒక పెద్ద రిలీఫ్ సినిమా. అది చాలా మందిని బతికించింది. చాలామందిని చేదు వాస్తవాల నుంచి కలల్లోకి పంపింది. చాలామందికి ఆత్మబంధువుగా ఒక హీరోను ఇచ్చింది. తక్కువ తక్కువగా ఉన్నది ఏదైనా రుచిగా ఉంటుంది. అపురూపంగా ఉంటుంది. -
నగరానికి అందం తెస్తున్న ‘ఆ నలుగురు’!
సాక్షి, బంజారాహిల్స్: రంగురంగుల శిల్పాలు.. ఆలోచనాత్మక పెయింటింగ్స్‌తో వీధులు కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా బాటసారులు ఎక్కువగా సంచరించే ప్రాంతాలతో పాటు ప్రధాన కూడళ్లలో ఆకట్టుకునే శిల్పాలను ఏర్పాటు చేస్తూ నగరానికి మరింత వన్నె చేకూరుస్తున్నారు. జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ పరిధి కిందకు వచ్చే పలు ప్రాంతాల్లో జేఎన్టీయూకి చెందిన నలుగురు విద్యార్థులు ఈ కళాత్మక ఆకృతులను తీర్చిదిద్దుతూ ఆయా ప్రాంతాలకు కొత్త ఆకర్షణ తీసుకొస్తున్నారు. జేఎన్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి చెందిన సంతోష్ బుద్ది, అబ్దుల్ రహ్మాన్, మహేష్‌కుమార్ గంగనపల్లి, మురళీకృష్ణ కంపెల్లిలు గత కొద్ది రోజులుగా పలు ప్రహరీలకు కొత్త నగషిలు చెక్కుతున్నారు. కేవలం రంగులు పూసి చేతులు దులుపుకోకుండా ఆ ఆకృతులకు ఆలోచనల రూపురేఖలు తీసుకొస్తున్నారు. జీహెచ్ఎంసీ సౌజన్యంతో ఈ నలుగురు యువకులు ప్రధాన కూడళ్లతో పాటు పలు ప్రహరీలకు కొత్త రూపును సంతరించుకునేలా పెయింటింగ్స్ వేస్తున్నారు. అధికారులు, ప్రభుత్వం ఈ విషయంలో తమకు సంపూర్ణ సహకారం అందిస్తూ మరింతగా ప్రోత్సహిస్తున్నాయని, ఈ పెయింటింగ్స్, శిల్పాలు తమకు మరిన్ని అవకాశాలను తెచ్చిపెడుతున్నాయని ఈ సందర్భంగా వారు పేర్కొంటున్నారు. ముందుగా తాము పెయింటింగ్ వేసే ప్రాంతాన్ని లేదా శిల్పాలు తీర్చిదిద్దే చౌరస్తాలను పరిశీలించి ఆ ప్రాంతాల్లో ఏ రకమైన శిల్పాలు, పెయింటింగ్స్ ఉంటే బాగుంటుందో డిజైన్లు రూపొందించుకొని ఆ మేరకు తీర్చిదిద్దుతున్నామని అంటున్నారు. విద్య, పచ్చదనం, పూలు ఇలా వివిధ రకాల ఆలోచనలతో ఈ ఆర్ట్ వర్క్స్ ఉంటాయని వారు తెలిపారు. ఆకట్టుకునే శిల్పాలివే.. ► ఖైరతాబాద్ జోన్ పరిధిలోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్.70 అశ్విని లేఅవుట్ చౌరస్తాలో రాష్ట్ర పక్షి పాలపిట్ట శిల్పాన్ని ఏర్పాటు చేశారు. ►బంజారాహిల్స్‌రోడ్ నెంబర్.1/5 జీవీకే వన్ చౌరస్తాలో గులకరాళ్ల శిల్పాన్ని తీర్చిదిద్దారు. ► బంజారాహిల్స్ రోడ్ నెంబర్.45 జంక్షన్లో వాల్ ఆర్ట్‌ను వేశారు. ►లక్డీకాపూల్ రైల్వేస్టేషన్ వద్ద కూడా ఈ వాల్ ఆర్ట్ కనువిందు చేస్తున్నాయి. ►బంజారాహిల్స్ రోడ్ నెంబర్.1/12 పెన్షన్ కార్యాలయం చౌరస్తాలో బస్టాప్‌ను వాల్ ఆర్ట్‌తో సుందరంగా తీర్చిదిద్దారు. ► ఖైరతాబాద్ ఫ్లైఓవర్ పైన చిన్నారులకు విద్య తప్పనిసరి అనే కాన్సెప్ట్‌తో వాల్ ఆర్ట్ ఆకట్టుకుంటున్నది. ► ఫిలింనగర్ సీవీఆర్ న్యూస్ చౌరస్తాలో వాల్ ఆర్ట్ పాదచారులు, వాహనదారులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. ►ఇలా ప్రధానమైన చౌరస్తాలో ఈ నలుగురు విద్యార్థులు తమలోని ప్రతిభతో నగరంలోని పలు ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దుతూ చూపరులను కట్టిపడేస్తున్నారు. -
‘డర్టీ హరి’పై వాసిరెడ్డి పద్మ సీరియస్
సాక్షి, విజయవాడ : ‘డర్టీ హరి’ సినిమా వాల్ పోస్టర్‌పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాత, దర్శకుడు, అడ్వర్టయిజ్మెంట్ ఏజెన్సీలపై కేసు నమోదు చేయాలని డీజీపీ గౌతం సవాంగ్‌ను కోరారు. ఈ పోస్టర్లు మహిళలను అగౌరవపరిచేలా, యువతను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయన్నారు. గుంటూరు ఉండవల్లి సెంటర్లో, ఇతర పట్టణాలలో అసభ్యకరంగా వేసిన పోస్టర్లను తక్షణమే తొలగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ థ్రిల్లర్ ‘డర్టీ హరి’. శ్రవణ్ రెడ్డి, రుహానీ శర్మ, సిమ్రత్ కౌర్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఫ్రైడే మూవీస్ యాప్ ద్వారా ఈనెల 18న ఈ సినిమాను విడుదల చేశారు. (చదవండి : డర్టీ హరి మూవీ రివ్యూ) -
కరోనా అలర్ట్: పోస్టర్ విడుదల చేసిన సర్కార్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తొలి కోవిడ్-19 కేసు నమోదైన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. గాంధీ, చెస్ట్, ఫీవర్ ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసింది. దీంతోపాటు వైద్య ఆరోగ్యంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం ఉదయం భేటీ అయి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రజలకు అవగాహన కల్పిస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు ఈ సందర్భంగా తెలిపారు. హైదరాబాద్‌తో పాటు అన్ని మున్సిపాలిటీల్లో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో హోర్డింగ్‌లు, వాల్ పోస్టర్లతో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తామని అన్నారు. దానిలో భాగంగా ప్రజారోగ్య కుటుంబ సంక్షేమశాఖ.. ‘ముందు జాగ్రత్తలు పాటిద్దాం, కరోనా వైరస్ సంక్రమణ అరికడదాం’అని ఓ పోస్టర్ విడుదల చేసింది. వ్యాధి నిర్ధారణ పరీక్ష కేంద్రాల సమాచారం కోసం హెల్ప్‌లైన్ 040-24651119 నెంబర్ ను సంప్రదించాలని సూచించింది. -
ఎద్దు కనబడుట లేదు!
సాక్షి, పలమనేరు: ఎద్దు కనబడటం లేదంటూ కరపత్రాలు, వాల్పేపర్లు ముద్రించి గాలిస్తున్న ఘటన బుధవారం చిత్తూరు జిల్లా పలమనేరులో వెలుగుచూసింది. గంగవరం మండలం బండమీద జరావారిపల్లిలో ఈ నెల 25న మైలేరు (ఎడ్ల పరుగు పందెం పోటీలు)ను నిర్వహించారు. ఇందులో పాల్గొనేందుకు మన రాష్ట్రం నుంచేగాక.. తమిళనాడు నుంచి కూడా భారీగా ఎద్దులను తెచ్చారు. తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా పనమడుగుకు చెందిన ఎద్దును దాని యజమాని కొందరితో కలిసి లారీలో తెచ్చారు. పండుగలో దాన్ని వదలిపెట్టే క్రమంలో మూడో రౌండ్లో అది కనిపించకుండా పోయింది. దాని కోసం గ్రామం చుట్టుపక్కల వెతికినా లాభం లేకుండా పోయింది. గ్రామానికి ఆనుకుని ఉన్న కౌండిన్య అడవిలో మూడు రోజులుగా గాలిస్తున్నా ఆచూకీ లభించలేదు. దీంతో పట్టణంలోని పలు చోట్ల ఎద్దు కనిపించడంలేదంటూ వాల్పోస్టర్లంటించారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఎద్దు ఆచూకీ కోసం కరపత్రాలను ముద్రించి పంచుతున్నారు. ఆచూకీ లభిస్తే సెల్ : 09585172143కు సమాచారం ఇవ్వాలని కూడా వాటిలో కోరారు. మైలేరు పండగల్లో బహుమతులు తెచ్చే ఈ ఎద్దులకు భలే గిరాకీ ఉంది. దీని ఖరీదు రూ.మూడు లక్షల దాకా పలుకుతుందట. తప్పిపోయిన ఎద్దు పేరు ఎక్స్ప్రెసిడెంట్. ఇది గతంలో పలు బహుమతులను సాధించింది. -
నాడు వాల్ రైటింగ్.. నేడు సోషల్ మీడియా
సాక్షి, దమ్మపేట: ఎన్నికల సందర్భంగా ప్రచారం కోసం నిర్వహించే ప్రతి కార్యక్రమానికీ లెక్కలు చెప్పాల్సిందేనని అప్పటి ఎన్నికల ప్రధానాధికారి టీఎన్ శేషన్ ఆదేశించారు. అప్పటి నుంచి ఎన్నికల ప్రచార తీరులో మార్పులు సంతరించుకుంటూ వస్తున్నాయి. అధికార యంత్రాంగం కూడా నిఘా ఉంచడంతో సమావేశాలను ఆత్మీయ సమ్మేళనాలుగా, విందులను సహపంక్తి భోజనాలుగా పేర్లు మార్చుతూ గుట్టుచప్పుడు కాకుండా జరుపుతున్నారు. గోడలపై రాతలు ఎన్నికలంటే గోడలపై రాతలు.. అభ్యర్థుల ఫొటోలు ఉన్న పోస్టర్లు.. పగలు, రాత్రి మైకుల హోరు, రోడ్ల పొడవునా బ్యానర్లు తోరణాల్లాగా కట్టేవారు. పరీక్షల సమయంలోనూ చదువుకునే విద్యార్థులు సైతం మైకుల హోరు భరించలేక గ్రామాలకు దూరంగా వెళ్లిపోయేవారు. ఖాళీ ప్రదేశాల్లో చదువుకునేవారు. ఇదంతా ఒకప్పటి ఎన్నికలు. అనుమతులు తప్పనిసరి గోడలపై రాతలు రాయాలన్నా, ప్రచార పోస్టర్లు వేయించాలన్నా, బ్యానర్లు కట్టాలన్నా, మైకు హోరెత్తించాలన్నా ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరి. వాహనాల్లో తిరగాలంటే వ్యయం ఎంతో చెప్పాల్సిందే. గోడలపై రాతలకు సంబంధిత యాజమాని అనుమతి ఉండాల్సిందే. అయితే ప్రస్తుతం గోడలపై రాతలు దాదాపుగా ఎవరూ రాయడంలేదు. ఇటీవల వరకు ఫ్లెక్సీలు పెట్టేవారు. ఇప్పుడు అవి కూడా తగ్గిపోతున్నాయి. ప్రచార రథాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ.. ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్లు ఉండటంతో అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని మెసేజ్‌ల ద్వారా కోరుతున్నారు. ఆయా పార్టీల అభ్యర్థుల ప్రచారం, ముందస్తు సమాచారాన్ని అందుబాటులో ఉంచుతున్నారు. కొందరు పంపే ఫొటోలు, అభ్యర్థులపై వ్యంగ్య వ్యాఖ్యలు ఇబ్బంది కలిగిస్తున్నాయని పలువురు ఓటర్లు వాపోతున్నారు. విద్యార్థుల వద్దకు.. విద్యార్థులకు ప్రస్తుతం పరీక్ష కాలం. అభ్యర్థులకు కూడా ఐదేళ్ల భవితవ్యం నిర్ణయించే ఎన్నికలు పరీక్ష వంటిదే. దాంతో యువత ఎక్కడ ఉంటారో అక్కడికి ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు వెళుతున్నారు. ఆయా పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. మీ ఓటుతో పాటు మీ ఇంటనున్న వారికి, చుట్టుపక్కల వారికి చెప్పి తమ పార్టీ అభ్యర్థికే ఓటు వేయించాలంటూ కోరుతున్నారు. -
యాక్షన్ టీంలపై ప్రచారం...
వేములవాడ(చందుర్తి) : ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని, గ్రామాల్లో సంచరిస్తున్న మావోయిస్టు యాక్షన్ టీంలకు సంబంధించి జాగరుకతతో ఉండాలని పోలీసులు విస్తృతంగా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. వివిధ గ్రామాల్లో వాల్‌పోస్టర్లు వేశారు. ఎన్నికలు ముగిసే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు భాగంగా పోలీసులు మావోయిస్టు యాక్షన్ టీం సభ్యులపై దృష్టి సారించినట్లు గ్రామాల్లో పోలీసులు వేస్తున్న వాల్‌పోస్టర్లే నిదర్శనమని అనిపిస్తుంది. నిన్న, మొన్నటి వరకు నక్సలైట్ల ప్రభావమే లేదని స్పష్టం చేసిన పోలీసులే యాక్షన్ టీంల సభ్యులతో కూడిన వాల్ పోస్టర్లను వేస్తూ ప్రచారం చేయడంతో రాజకీయ నాయకుల్లో మళ్లీ కలవరం మొదలైంది. మావోయిస్టు సక్సలైట్లు ఎన్నికల్లో తమ ప్రభావాన్ని చాటుకునేందుకు ఎక్కడ దాడులకు దిగుతారోనని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో మళ్లీ మావోయిస్టు తలలకు వెలకడుతూ వెలిసిన వాల్ పోస్టర్లు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. యాక్షన్ టీం సభ్యుల ఫొటోలతో పాటు పూర్తి వివరాలను పోలీసు శాఖ వాల్ పోస్టర్లలో ముద్రించింది. గత దశాబ్దకాలంగా ఎలాంటి అలజడి లేకుండా ప్రశాంత జీవనాన్ని గడుపుతున్న సామాన్యులకు మళ్లీ ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని కంటి మీద కునుకు లేకుండా పోతోంది. పోలీసులు వేసిన వాల్ పోస్టర్లలో ఈ ప్రాంతానికి చెందిన నక్సలైట్లు ఎవరైనా ఉన్నారా అని పోస్టర్లను అసక్తిగా చూస్తున్నారు. ఏది ఏమైనా ఎన్నికలు సాధ్యమైనంత త్వరగా, ప్రశాంతంగా పూర్తికావాలని ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు. -
కేంద్ర రైతు పథకాలపై బీజేపీ వాల్‌పోస్టర్
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ ఈ నాలుగేళ్లలో రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ బీజేపీ రాష్ట్ర శాఖ వాల్ పోస్టర్‌ను రూపొందించింది. మంగళవారం బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ నాలుగేళ్లలో ప్రధాని మోదీ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, భూసార పరీక్షలు వంటి వినూత్న పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ఈ ఏడాది పెంచిన మద్దతు ధరల వల్ల రైతులకు ఎకరానికి రూ. 4 వేల నుంచి రూ.12 వేల వరకు లబ్ధి చేకూరుతోందని చెప్పారు. ఈ నెల 17 నుంచి 26 వరకు చేపట్టనున్న ‘మాట తప్పిన రాష్ట్ర ప్రభుత్వం– మార్పు కోసం బీజేపీ’నినాదంతో గ్రామాల్లో బైక్ ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎన్నికల హామీలు, ప్రధాని మోదీ చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామన్నారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నర్సింహారెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యుడు జైపాల్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ కుమార్ పాల్గొన్నారు. -
ఆ సినిమా పోస్టర్‌పై ఫిర్యాదు..!
హైదరాబాద్: అర్జున్ రెడ్డి సినిమాపై బీసీ యువజన సంఘం నాయకులు మంగళవారం మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసభ్యకరమైన పోస్టర్‌ను చిత్రికరించిన అర్జున్ రెడ్డి సినిమా నిర్మాత, దర్శకుడు, హీరో, హీరోయిన్లపై తగిన చర్యలు తీసుకోవాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకాల శ్యామ్‌కురుమ పోలీసులకు విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువతను పెడదారి పట్టించే విధంగా చిత్రికరించిన వాల్‌పోస్టర్‌ను విద్యాసంస్థలు, ప్రధాన కూడళ్లు, బస్టాండ్ ప్రాంతాలలో అతికించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. యువతను ఆకర్షించడానికి పోస్టర్ల ద్వారా విష సంస్కృతిని ప్రదర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో ఎక్కడ చూసినా అర్జున్ రెడ్డి సినిమా పోస్టర్ కనిపిస్తుందని వాటిని వెంటనే నియంత్రించే విధంగా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. సినిమా విడుదల కాకుండా చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులు కోరారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చట్టరీత్యా తగిన చర్యలు తీసుకుంటామని అడ్మిన్ ఎస్సై రంజిత్‌కుమార్ తెలిపారు. -
14న రెడ్డి మహాగర్జన
కర్నూలు(అర్బన్): హైదరాబాద్ మేడ్చల్ చెక్‌పోస్టు సమీపంలోని సాకేత్ భూసత్వా మైదానంలో ఈ నెల 14వ తేదీన రెడ్డి మహాగర్జన కార్యక్రమం జరుగుతున్నదని జిల్లా రెడ్డి యువజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు దొనపాటి యల్లారెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్థానిక గణేష్‌నగర్‌లోని రెడ్డి భవన్లో మహా గర్జనకు సంబంధించిన పోస్టర్లను నేతలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు మహాగర్జనలో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన రెడ్డి ప్రజా ప్రతినిధులందరూ హాజరువుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రెడ్డి యువజన సంఘం నాయకులు బిర్రు ప్రతాపరెడ్డి, ఏ హనుమంతరెడ్డి, తూంకుంట ప్రతాపరెడ్డి, ఎదురూరు రాకేష్‌రెడ్డి, పల్లె శశిధర్‌రెడ్డి, ప్రదీప్‌కుమార్‌రెడ్డి, సర్వేశ్వరరెడ్డి, సంపతి లక్ష్మికాంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మల్లికా షెరావత్‌పై చర్యలకు ఆదేశాలివ్వండి
హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం హైదరాబాద్: జాతీయ పతాకాన్ని అవమానించిన బాలీవుడ్ నటి మల్లికా షెరావత్‌పై తగిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. త్వరలో విడుదల కానున్న డర్టీ పొలిటిక్స్ చిత్రంలో మల్లికా షెరావత్ జాతీయ పతాకాన్ని తన ఒంటికి చుట్టుకున్నారని, ఇది జాతీయ జెండాను అవమానించడమేనంటూ హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త టి.ధనగోపాల్ రావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఆ చిత్ర నిర్మాత కస్తూర్ చంద్ బొకాడియా ఉద్దేశపూర్వకంగానే జాతీయ జెండాను అవమానపరిచేలా ఉన్న వాల్ పోస్టర్లను విడుదల చేశారని పిటిషనర్ పేర్కొన్నారు. మల్లికా షెరావత్‌పై చర్యలకు ఆదేశించాలని కోర్టును కోరారు. దీనిపై వచ్చే వారం కోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది. -
సేవకు మరణం లేదు!
దిక్కులేని వాళ్లు కనిపిస్తే... ఒక జాలి చూపు చూస్తారు... అనాథ శవం కనిపిస్తే... దగ్గరకు పోతే ఏమవుతుందో అని పారిపోతారు. ఎవరైనా ఒంట్లో శక్తి లేకుండా బిచ్చమెత్తుకుంటూ ఉంటే... ఒక రూపాయి దానం చేసి ఛాతీ నిండా గాలిపీల్చుకుంటారు. శ్రీనివాస్ మాత్రం... రాణంతో ఉంటే వైద్యం చేయిస్తాడు... ప్రాణం లేకపోతే మార్చురీకి తరలిస్తాడు. మనిషికి మరణం ఉంటుంది కానీ సేవతో అమరం కావాలంటాడు. హైదరాబాద్, సికింద్రాబాద్ రోడ్ల మీద వెళ్తుంటే ఒక వాల్‌పోస్టర్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. అందులో మదర్ థెరిసా, శిలువ, ఓం, కృపాణాలు, మసీదు, స్వామి వివేకానంద చిత్రాలు, వాటి కింద ఒక వ్యక్తి ఫొటో ఉంటాయి. పక్కన వృద్ధులు, వికలాంగులు, గుర్తు తెలియని మృతదేహాలను మార్చురీకి తరలించాలన్నా, అంధులు, హెచ్ఐవి, కుష్టు రోగులు, ఇతర అనారోగ్యాలతో బాధపడుతూ దిక్కులేకుండా పడి ఉన్నా, వారిని హాస్పిటల్‌కు తరలించాలన్నా ఒక ఫోన్ కాల్ చేయండి అంటూ 9849420641ఫోన్ నంబరు ఉంటుంది. ప్రకటనలో చెప్పినట్లే... ఫోన్ కాల్ అందుకున్న వెంటనే నిమిషాల్లో అక్కడ ప్రత్యక్షమవుతారు శ్రీనివాస్. రోగులను హాస్పిటల్‌కు చేరవేస్తారాయన. వారందరి ఫొటోలు తీసి దగ్గరుంచుకుంటాడు. ‘‘వేలి ముద్రల సేకరణ పోలీసులకు ఉపయోగపడుతుంది. ఇక ఫొటోలు... కొంతమంది తమ వాళ్లు తప్పిపోయారని వెతుకుతుంటారు. వారికి నా దగ్గరున్న ఫొటోలు ఉపయోగపడతాయి’’ అంటాడు. శ్రీనివాస్ తండ్రి వరంగల్ జిల్లా జనగాం నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. ముషీరాబాద్‌లో ఆరవ తరగతి చదువుకుంటున్న రోజుల్లో చేపల మార్కెట్ దగ్గర ఒక వ్యక్తి స్పృహతప్పి పడిపోయాడు. అతడి ముఖం మీద నీళ్లు చల్లి లేవదీసి తన బాక్సులో అన్నం పెట్టాడు శ్రీనివాస్. స్థానికుల సహాయంతో అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ఒకరు బాధలో ఉంటే మనసు స్పందించిన తొలి సంఘటన అదేనంటారాయన. స్కూల్లో టీచర్లు, తోటిపిల్లలు ప్రశంసలతో ముంచెత్తడంతో తాను చేసింది మంచి పని అని తెలిసింది. డిగ్రీలో సోషల్ వర్క్ ఒక సబ్జెక్టుగా చదవడానికి ఇవన్నీ కారణమే అంటూ... ‘‘ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడాన్ని ఒక పద్ధతిగా చేయడానికి చదువు బాగా ఉపయోగపడింది. నగరంలోని 24 పోలీస్ స్టేషన్లలో నా వివరాలు, పోస్టర్లు ఉంటాయి. బేకరీలు, రోడ్డు పక్కన ఉండే కిళ్లీ బడ్డీలకు నా ప్రకటన పత్రికలు కనిపిస్తాయి. ఎప్పుడు ఎవరికి నా అవసరం ఏర్పడుతుందో ఊహించలేం. రోడ్డు మీద దిక్కులేకుండా పడి ఉన్న వాళ్లను చూసిన వాళ్లకు ఈ ప్రకటన గుర్తొస్తే చాలు. నాకు ఒక ఫోన్ చేస్తారు’’ అంటారు. ప్రాణాలు కోల్పోయిన వారిని మార్చురీకి తరలించడం, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారిని హాస్పిటల్లో చేర్చడం, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అడుక్కుంటున్న వారికి కౌన్సెలింగ్ ఇచ్చి అనాథ ఆశ్రమాలకు పంపించడం ఇతడి దైనందిన కార్యక్రమం. అనారోగ్యం నుంచి సాంత్వన పొందిన వారికి దారి ఖర్చులకు డబ్బిచ్చి మరీ సొంత ఊరికి పంపిస్తారు. ‘‘సెకండ్ హ్యాండ్ బైకులు, కార్లను కొనడం, అమ్మడం నా వ్యాపారం. రాబడి బాగానే ఉంటుంది. కాబట్టి ఇంతవరకూ ఇబ్బంది రాలేదు. నా భార్య అనూరాధ మొదట్లో నన్ను ప్రోత్సహించింది. కానీ, పిల్లలు పెద్దవుతున్నారు, స్కూల్లో చేరిస్తే ఖర్చులు పెరుగుతాయి, పైగా ఎప్పుడు ఎక్కడ ఉంటానో తెలియక ఇంట్లో వాళ్లకు ఆందోళన. ఇప్పుడిప్పుడే చిన్న చిన్న గొడవలవుతున్నాయి’’ అన్నారు శ్రీనివాస్ నవ్వుతూ. నగరంలో యాచకులు, రోడ్డు మీద ప్రాణాలు వదిలే అభాగ్యులు ఉండకూడదన్నదే తన జీవితాశయం అంటారు శ్రీనివాస్. ఇలాంటి బృహత్తర యజ్ఞాన్ని ఒక్కరుగా చేస్తూ పోతే కొంతకాలానికి ఆగిపోతుంది. కాబట్టి తన ఆలోచనలకు ప్రభావితమవుతున్న యువకులను సమీకరించి, తన కార్యకలాపాల్లో భాగం చేస్తున్నారు. ‘‘మనకు చావు ఉంటుంది, కానీ మనం చేసే పనికి మరణం ఉండకూడదు. అందుకే నా ప్రయత్నాన్ని విస్తరించాలనే ఉద్దేశంలో ఉన్నాను. ప్రతి ఒక్కరూ సామాజికసేవకులు కావాలి’’ అంటారు శ్రీనివాస్. - వాకా మంజులారెడ్డి ఎక్కడ అవసరమైతే... నాకు శ్రీనివాస్ ఏడాదికి పైగా తెలుసు. రోడ్డు మీద నిస్సహాయంగా పడిపోయిన వాళ్లని లేపి అన్నం తినిపించి, స్నానం చేయించి బట్టలిస్తాడు. మాకంటే ముందు అతడికే సమాచారం వెళ్తుంది. కొన్నిసార్లు అతడే మాకు సమాచారం అందిస్తాడు. బ్లడ్ డొనేషన్ క్యాంపు పెట్టాలంటే మరుసటి రోజుకు రక్తదానం చేయాలనే ఆసక్తి ఉన్నవారిని తీసుకొచ్చి మా ముందు నిలబెడతాడు. ఒక విధంగా చెప్పాలంటే ఆపన్నులకు మా నుంచి అందే సర్వీస్ కంటే శ్రీనివాస్ నుంచి ఎక్కువ అందుతోంది. - అమరకాంత్ రెడ్డి, ఏసీపీ, హైదరాబాద్ -
మావోయిస్టుల పేర మరో వాల్‌పోస్టర్
మిడ్జిల్, న్యూస్‌లైన్: మావోయిస్టుల పేర పోస్టర్ల ద్వారా హెచ్చరికల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆదివారం తాజాగా మండలంలోని ఊర్కోండపేట్ గ్రామంలో సర్పంచ్‌ను హెచ్చరిస్తూ మరోపోస్టర్ వెలిసింది. ఈ పోస్టర్ స్థానికంగా కలకలం రేపింది. గ్రామంలో ఆదివారం రాత్రి స్థానిక పాలసెంటర్ వద్ద ఊర్కోండపేట్ సర్పంచ్‌ను హెచ్చరిస్తూ వాల్‌పోస్టర్ వెలిసింది. ‘ గ్రామ సర్పంచ్‌కు కుక్కచావు తప్పదు. అధికారం అహంతో చెలాగాటమాడటం సమంజసం కాదు. గ్రామంలో అన్ని పార్టీలతో కలిసిపోతే బతుకగలవు’ అంటూ హెచ్చరిస్తూ మవోయిస్టుల పేరుతో మరియు మాజీ మవోయిస్టుల పేరుతో వాల్‌పోస్టర్ వేశారు. ఈ పోస్టర్ చూసి సర్పంచ్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆ పోస్టర్‌ను తొలగించారు. మండలంలో ఇటీవల మావోయిస్టుల పేర వాల్‌పోస్టర్లు వెలవడం పట్ల నాయకులకు గుండెల్లో గుబులురేపుతోంది. గత గురువారం రాచాలపల్లి గ్రామ సర్పంచ్‌ను హెచ్చరిస్తూ వాల్‌పోస్టర్ వేయగా.. తాజాగా ఆదివారం ఊర్కోండపేట్ సర్పంచ్‌ను హెచ్చరిస్తూ పోస్టర్ వెలిసింది. ఈ విషయంలో పోలీసులు పెద్దగా స్పందించకపోవడంతో సర్పంచ్‌లు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.