చందుర్తి బస్టాండ్ పోస్టర్ వేస్తున్న పోలీసు
వేములవాడ(చందుర్తి) : ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని, గ్రామాల్లో సంచరిస్తున్న మావోయిస్టు యాక్షన్ టీంలకు సంబంధించి జాగరుకతతో ఉండాలని పోలీసులు విస్తృతంగా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. వివిధ గ్రామాల్లో వాల్‌పోస్టర్లు వేశారు. ఎన్నికలు ముగిసే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు భాగంగా పోలీసులు మావోయిస్టు యాక్షన్ టీం సభ్యులపై దృష్టి సారించినట్లు గ్రామాల్లో పోలీసులు వేస్తున్న వాల్‌పోస్టర్లే నిదర్శనమని అనిపిస్తుంది. నిన్న, మొన్నటి వరకు నక్సలైట్ల ప్రభావమే లేదని స్పష్టం చేసిన పోలీసులే యాక్షన్ టీంల సభ్యులతో కూడిన వాల్ పోస్టర్లను వేస్తూ ప్రచారం చేయడంతో రాజకీయ నాయకుల్లో మళ్లీ కలవరం మొదలైంది. మావోయిస్టు సక్సలైట్లు ఎన్నికల్లో తమ ప్రభావాన్ని చాటుకునేందుకు ఎక్కడ దాడులకు దిగుతారోనని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం.
ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో మళ్లీ మావోయిస్టు తలలకు వెలకడుతూ వెలిసిన వాల్ పోస్టర్లు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. యాక్షన్ టీం సభ్యుల ఫొటోలతో పాటు పూర్తి వివరాలను పోలీసు శాఖ వాల్ పోస్టర్లలో ముద్రించింది. గత దశాబ్దకాలంగా ఎలాంటి అలజడి లేకుండా ప్రశాంత జీవనాన్ని గడుపుతున్న సామాన్యులకు మళ్లీ ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని కంటి మీద కునుకు లేకుండా పోతోంది. పోలీసులు వేసిన వాల్ పోస్టర్లలో ఈ ప్రాంతానికి చెందిన నక్సలైట్లు ఎవరైనా ఉన్నారా అని పోస్టర్లను అసక్తిగా చూస్తున్నారు. ఏది ఏమైనా ఎన్నికలు సాధ్యమైనంత త్వరగా, ప్రశాంతంగా పూర్తికావాలని ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment