‘ముందస్తు’ బదిలీలు..! | IPS IAS Officers Transfers In Karimnagar | Sakshi
Sakshi News home page

‘ముందస్తు’ బదిలీలు..!

Published Thu, Aug 30 2018 12:44 PM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

IPS IAS Officers Transfers In Karimnagar - Sakshi

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో పలువురు అధికారులకు స్థాన చలనం కలుగుతుండటం చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల వ్యవధిలో ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో13 మంది ఐఏఎస్, 9 మంది ఐపీఎస్‌ల ను బదిలీ చేసింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ముగ్గురు ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్‌ అధికారులకు బదిలీలు, పోస్టింగ్‌లు ఉత్తర్వులు ఇచ్చారు. జిల్లాల పునర్విభజన తర్వాత నియమితులైన ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు పలువురు బదిలీలు, పదవీ విరమణ చేయగా, ఉన్న కొందరు అధికారులను అటు ఇటుగా మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ముందస్తు ఎన్నికలు ఖాయమన్న చర్చ జరుగుతున్న తరుణంలో బదిలీలు ప్రాధాన్యత సంతరించుకోగా, త్వరలోనే మరికొందరు ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులకు తోడు జాయింట్‌ కలెక్టర్లు, డీఆర్‌వోలు, ఆర్‌డీవోలు, అసిస్టెంట్‌ పోలీసు కమిషనర్లు, డీఎస్‌పీల బదిలీలు కూడా పెద్ద మొత్తంలో జరగనున్నాయని అధికారవర్గాల సమాచారం. ఈ మేరకు చేస్తున్న కసరత్తు కూడా తుది దశకు చేరిందంటున్నారు.

కలెక్టర్లతో మొదలైన బదిలీల పరంపర..
రెండు రోజులుగా సాగుతున్న బదిలీల ప్రక్రియ పాత కరీంనగర్‌ జిల్లాలో ఐఏఎస్‌లతో మొదలైంది. మంగళవారం వెలువడిన ఉత్తర్వులలో సిద్దిపేట కలెక్టర్‌ పి.వెంకట్రాంరెడ్డిని రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా నియమించిన ప్రభుత్వం, అక్కడి కలెక్టర్‌ డి.కృష్ణభాస్కర్‌ను సిద్దిపేట కలెక్టర్‌గా నియమించింది. కరీంనగర్‌ నగర పాలక సంస్థ కమిషనర్‌ కె.శశాంకను పదోన్నతిపై జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. అదేవిధంగా కరీంనగర్‌ డీఆర్వోగా విధులు నిర్వరిస్తున్న ఆయేషా మస్రత్‌ ఖానమ్‌ను ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా బదిలీ చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీసు కమిషనర్‌ వీజే దుగ్గల్‌ పది రోజుల క్రితం ఇతర రాష్ట్రాల సర్వీసులో వెళ్లగా, ఆయన స్థానంలో హైదరాబాద్‌లో పనిచేస్తున్న సత్యనారాయణను పోలీసు కమిషనర్‌గా నియమించారు.

పెద్దపల్లి జిల్లా కొంతకాలంగా ట్రైనీ ఐపీఎస్, ఏఎస్‌పీగా పనిచేసిన సింధూశర్మను పదోన్నతిపై జగిత్యాల ఎస్పీగా నియమించారు. అక్కడి ఎస్పీ సునిల్‌దత్‌ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీగా నియమించారు. అయితే.. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో మరికొందరు ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల బదిలీలు కూడా త్వరలోనే ఉంటాయన్న సంకేతాలు సదరు అధికారులకు ప్రభుత్వం నుంచి అందినట్లు చెప్తున్నారు. ఇదే సమయంలో ప్రధానంగా పోలీసు, రెవెన్యూ శాఖలలో కూడా అన్ని స్థాయిల్లో బదిలీలపై కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం.
 
ఎన్నికల నిబంధనలే ప్రామాణికం.. బదిలీలకు మార్గదర్శకాలు..
ఎన్నికల సమయంలో అధికార పార్టీకి వత్తాసు పలికే విషయంలో రెవెన్యూ, పోలీసులపై ఆరోపణలు వెల్లువెత్తడాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీ) కొన్ని నిబంధనలు రూపొందించింది. దీని ప్రకారం సొంత జిల్లాల్లో పనిచేస్తున్న రెవెన్యూ, పోలీసు అధికారులను పక్క జిల్లాకు బదిలీ చేయాల్సి ఉంటుంది. అలాగే నాలుగేళ్ల కాలంలో మూడేళ్లకు మించి ఒకేస్థానంలో పనిచేస్తున్న రెవెన్యూ, పోలీసులను కూడా వేరే ప్రాంతానికి పంపాల్సి ఉంటుంది. సాధారణంగా ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టిన తర్వాత ఈసీ దీనిపై పోలీసుశాఖకు ఆదేశాలు జారీ చేస్తుంటుంది

అయితే.. ఈసీ నుంచి ఇంకా ఆదేశాలు రాకముందే తెలంగాణ పోలీసుశాఖ ఈ పని మొదలుపెట్టింది. నిబంధనల పరిధిలోకి వచ్చే పోలీసు ల అధికారుల జాబితా సిద్ధం చేయాలంటూ అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. 2015 మార్చి 1 నుంచి 2019 ఫిబ్రవరి 28వ తేదీ మధ్య కాలంలో మూడేళ్లు పూర్తయిన వారు, పూర్తి కాబోయే వారి జాబితా సిద్ధం చేసి పంపాలంటూ ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. అయితే రెవెన్యూశాఖలో స్థానికంగా పని చేసే వా రికి ఈ నిబంధనలు వర్తించనుండగా, పోలీసుశాఖలో క్షేత్రస్థాయిలో ముఖ్యమైన విధులు నిర్వర్తిం చే (సివిల్‌) వారికే ఇవి వర్తించనున్నాయి. కమ్యూనికేషన్స్, స్పెషల్‌ బ్రాంచి, శిక్షణ వంటివి భాగాల్లో పనిచేసే వారికి వర్తించదని స్పష్టం చేశారు.

రెవెన్యూ, పోలీసుశాఖలో ఊపందుకున్న కసరత్తు..
అన్ని స్థాయిల్లో బదిలీలకు రెవెన్యూ, పోలీసుశాఖ కసరత్తు మొదలు పెట్టింది. ఇప్పటికే సిబ్బందికి ఎన్నికల శిక్షణ ప్రారంభించగా తాజాగా మూడేళ్లకు మించి ఒకేచోట పని చేస్తున్న, సొంత జిల్లాలకు చెందిన తహసీల్దార్లు, సీఐల జాబితా తయారు చేసే పని మొదలుపెట్టారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం వీరందర్నీ బదిలీ చేయాల్సి ఉంటుంది. ఎన్నికలకు ముందు మాత్రమే మొదలు పెట్టాల్సిన జాబితా పనిని చాలా ముందుగానే సిద్ధం చేయిస్తుండటం గమనార్హం.

పోలీసుశాఖకు వస్తే రెండు పోలీసు కమిషనర్‌ (కరీంనగర్, రామగుండం), రెండు జిల్లాల ఎస్పీ (జగిత్యాల, రాజన్న సిరిసిల్ల) కార్యాలయాల పరిధిలో మొత్తం 14 పోలీసు సబ్‌ డివిజన్‌లు, 27 సర్కిళ్లు, 107 పోలీసుస్టేషన్లు ఉన్నాయి. రామగుండం కమిషనరేట్‌ పరిధి మంచిర్యాల జిల్లా వరకు కూడా విస్తరించి ఉంది. జిల్లాల పునర్విభజనలో భాగంగా పాత కరీంనగర్‌ జిల్లా పరిధిలో ఏర్పడిన మొత్తం ఏడు రెవెన్యూ డివిజన్లు, 73 మండల రెవెన్యూ కార్యాలయాలు ఉన్నాయి. ఈ పోలీసు సబ్‌ డివిజన్లు, రెవెన్యూ డివిజన్ల పరిధిలోని పలువురిని బదిలీ చేసేందుకు కూడా కసరత్తు జరుగుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement