పూజా ఖేద్కర్ తరహాలో నకిలీ దివ్యాంగుడని ఆరోపణలు
ఎక్స్ వేదికగా లేఖతో నెటిజన్లకు స్పష్టతనిచ్చిన అడిషనల్ కలెక్టర్
బాధ్యులపై చర్యల విషయాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడి
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ అడిషనల్ కలెక్టర్(లోకల్ బాడీస్) ప్రఫుల్ దేశాయ్‌పై వివాదాస్పద ఐఏఎస్ పూజా ఖేద్కర్ తరహాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2019 ఐఏఎస్ బ్యాచ్‌కి చెందిన ఆయన సివిల్స్‌లో 523వ ర్యాంకుతోపాటు ఆర్థోపెడికల్లీ హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్ కూడా క్లెయిమ్ చేశారు. ఇటీవల మహారాష్ట్రలో ట్రైనీ ఐఏఎస్ ఖేద్కర్ తరహాలోనే ప్రపుల్ దేశాయ్ కూడా నకిలీ దివ్యాంగుడని, ఆయన సర్టిఫికెట్ తప్పని పలువురు ‘ఎక్స్’ వేదికగా ట్రోల్ చేస్తున్నారు. ఇందుకు సోషల్ మీడియాలోని ఆయన సైక్లింగ్, హార్స్ రైడింగ్, బోటింగ్, ట్రెక్కింగ్ చేసిన ఫొటోలను ఉదహరిస్తున్నారు.
కాలు బాగాలేని వ్యక్తి ఇవన్నీ ఎలా చేస్తున్నాడు? అంటూ విమర్శలకు దిగుతున్నారు. ఈ పోస్టులపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఆయన మిత్రులు, తెలిసినవారు ప్రఫుల్ దేశాయ్‌కి మద్దతుగా నిలుస్తున్నారు. ముఖ్య ంగా ఆయనతో చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్న వారంతా ప్రఫుల్ కాలికి ఉన్న సమస్య నిజమైనదేనని, వాస్తవాలు తెలుసుకోకుండా ఆయన మనసు గాయపరచవద్దని హితవు పలుకుతున్నారు. అయినా, ట్రోలింగ్ ఆగడకపోవడం గమనార్హం. ఒక ఖాతా నుంచి కాకుండా వివిధ సోషల్ మీడియా ఖాతాల నుంచి ట్రోల్ చేస్తుండటంతో ఇది ఉద్దేశపూర్వక చర్యగా కరీంనగర్ కలెక్టరేట్ అధికారులు భావిస్తున్నారు.
చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై ఐఏఎస్ ప్రఫుల్ దేశాయ్ ఎక్స్ వేదికగా స్పందించారు. మూడు పేజీల లేఖతో నెటిజన్లకు స్పష్టత ఇచ్చారు. అందులో.. ‘2019 యూపీఎస్సీ ఇంటర్వ్యూ అనంతరం ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్సెస్(ఏఐఐఎంఎస్) మెడికల్ బోర్డు ముందు హా జరయ్యాను. వారు నాకున్న లోపాన్ని సర్టిఫై చేశారు. అనంతరం అదే రిపోర్టును డీవోపీటీతోపాటు యూపీఎస్సీకి పంపారు. కొందరు నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్న విషయం నా దృష్టికి వచ్చింది. ఇది ఎంతో బాధాకరం. నిజంగానే తప్పుడు సర్టిఫికెట్లు పెట్టిన వారిని ప్రశ్నిస్తే అందులో అర్థముంది. కానీ, నిజాయతీగా ఉన్న వారిని ఆన్‌లైన్‌లో వ్యక్తిగత ఫొటోలు పెట్టి మరీ తప్పుడు ఆరోపణలు చే యడం మా పనితీరును, వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడమే అవుతుంది.’ అని స్పష్టం చేశారు. ఈ అంశంపై ‘సాక్షి’కి వివరణ ఇస్తూ.. తనను ఆన్‌లైన్‌లో ట్రోల్ చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు.
యూపీఎస్సీ స్కాం పేరిట ట్రెండింగ్
మొత్తం మీద ఖేద్కర్ వ్యవహారంతో ఇప్పుడు సోషల్ మీడియాలో యూపీఎస్సీ స్కాం, ఈడబ్ల్యూఎస్, వీల్‌చైర్ యూజర్ హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్ట్రాగామ్‌లలో ఎకనమిక్ వీకర్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్), నకిలీ దివ్యాంగుల సర్టిఫికెట్లు తీసుకొని, సివిల్స్ ర్యాంకు సాధిస్తున్నారంటూ ఇటీవల సివిల్స్ ర్యాంకు సాధించినవారి ఫొటోలతో నేరుగా ట్రోలింగ్‌కు దిగుతున్నారు. వీటిని ప్రధాని కార్యాలయం, డీవోపీటీ, ప్రధాని నరేంద్రమోదీకి ట్యాగ్ చేస్తున్నారు. మొత్తానికి పూజా ఖేద్కర్ వివాదంతో యూపీఎస్సీ తీవ్ర విమర్శలను మూటగట్టుకుంటోంది. ఆన్‌లైన్‌లో ర్యాంకర్ల ర్యాంకులు, వారి రిజర్వేషన్లను స్క్రీన్ షాట్లు తీసి, పెడుతుండటంతో సదరు అభ్యర్థులు తల పట్టుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment