కాంగ్రెస్ అధినేతల పొరపాట్లకు సీమాంధ్ర బలి
Published Sun, Dec 1 2013 1:27 AM | Last Updated on Sat, Sep 2 2017 1:08 AM
బొప్పూడి (చిలకలూరిపేట రూరల్), న్యూస్‌లైన్ :కాంగ్రెస్ పార్టీ అధినేతలు చేసిన పొరపాట్లకు కోట్లాది మంది సీమాంధ్ర ప్రజలు బలైపోతున్నారని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ చెప్పారు. బొప్పూడిలోని ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎత్తిపోతల పథకాన్ని శని వారం ఆయన ప్రారంభించారు. పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు సమైక్యాంధ్రను కోరుతూ ఉద్యమాన్ని ఇక్కడ చేస్తే ప్రయోజనం ఉండదని ఢిల్లీని స్తంభింపజేస్తే ఫలితం లభిస్తుందన్నారు. రైతులు సంతోషంగా ఉండి పంటలు పండించుకునేందుకు, భూములు విలు వ పెంపొందేందుకు లిఫ్ట్ ఇరిగేషన్‌ను ఏర్పాటు చేశామన్నారు. నాలుగు గ్రామాలకు చెందిన 3153 ఎకరాల వ్యవసాయ భూములకు నీటిని అందించేందుకు రూ 15.87 కోట్లతో దీనిని ఏర్పాటుచేశామన్నారు. లిఫ్ట్‌ను గ్రామ ప్రజలు కాపాడుకుంటూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఫుట్ బ్రిడ్జిలను నిర్మించాలి ..
పేట ప్రాంతంలోని ఓగేరు, కుప్పగంజి, నల్లమడ పరీవాహక ప్రాంతంలో వాగులు దాటి ప్రయాణించి పంటలు సాగు చేసేందుకు అనుకూలంగా ఫుట్‌బ్రిడ్జిలను నిర్మించాలని రైతు సంఘం కార్యదర్శి బొల్లు శంకరరావు, రైతులు మంత్రి వెంకటేష్‌కు వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమం అనంతరం ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో గ్రామసభ నిర్వహించారు. పంచాయతీ సర్పంచి పూసల హరిబాబు గ్రామంలో ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరారు. వివిధ శాఖల ఉద్యోగులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఎత్తిపోతల రైతులకు కల్పవక్షాలు
గణపవరం (నాదెండ్ల) : ఎత్తిపోతల పథకాలు రైతులకు కల్పవృక్షాలని మంత్రి టీజీ వెంకటేష్ చెప్పారు. గణపవరం పరిధిలోని ఏపీఎస్‌ఐడీసీ నిధులతో 7.87 కోట్ల వ్యయంతో 1700 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే ఎత్తిపోతల పథకాన్ని ఆయన ప్రారంభించారు. కావూరు డొంకరోడ్డులో కుప్పగంజివాగుకు అనుసంధానంగా నిర్మించిన పథకానికి మంత్రి స్విచ్‌ఆన్ చేశారు. గ్రామ ప్రధాన వీధిలో ఏర్పాటుచేసిన సభలో ఆయన ప్రసంగిస్తూ మూడేళ్ల క్రితం తానే శంకుస్థానన చేసిన పథకాన్ని నేడు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నా రు. మంత్రి కాసు కృష్ణారెడ్డి అనారోగ్యం కారణంగా హాజరుకాలేకపోయారని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, ఏపీఎస్‌ఐడీసీ చైర్మన్ ఘంటా మురళి, డీసీసీ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు, జెడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు నల్లమోతు నటరాజేశ్వరరావు, ఎత్తిపోతల పథకం అధ్యక్షుడు వలేటి హిమంతరావు, ఆర్డీవో శ్రీనివాసరావు, ఏపీఎస్‌ఐడీసీ ఎస్‌ఈ షేక్ కాలేషావలి, ఈఈ డీఎల్ నరసింహం, డీఈ ఆదిశేషారావు, ఏఈ కృష్ణమూర్తి, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
విభజనవాదులను దేశద్రోహులుగా పరిగణించాలి..
విభజనకోరేవారిని దేశద్రోహులుగా పరిగణించే చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని మంత్రి టీజీ వెంకటేష్ అభిప్రాయపడ్డారు. పారిశ్రామికవేత్త మద్ది లక్ష్మయ్య కంపెనీ అతిథిగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను సమైక్యవాదినని, సమైక్యాంధ్రకే కట్టుబడి ఉంటానని, రాయలసీమ హక్కుల కోసం పోరాడతానాన్నారు. రాష్ట్ర విభజన అనివార్యమైతే మిగిలిన ప్రాంతాల్లో కూడా అనేక ప్రత్యేక డిమాండ్లు తలెత్తుతాయన్నారు.
Advertisement