
గుత్తి: చిల్లర రాజకీయాలు మానుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు జిల్లా వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్ మిథున్‌రెడ్డి హితవు పలికారు. గుత్తి సబ్‌జైలులో ఉన్న తాడిపత్రి సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డిని శనివారం హిందూపురం, అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్తలు నదీమ్ అహమ్మద్, పీడీ తలారి రంగయ్య, అనంతపురం, హిందూపురం పార్లమెంటు అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి, శంకరనారాయణ, గుంతకల్లు, కదిరి సమన్వయకర్తలు వై. వెంకటరామిరెడ్డి, సిద్దారెడ్డితో కలిసి ఆయన పరామర్శించారు. అనంతరం స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు.
రాబోయేది రాజన్న రాజ్యం
ఆరు మాసాల్లో ప్రభుత్వ పతనం ఖాయమంటూ జాతీయ ఛానెళ్లు, పత్రికలు ప్రముఖంగా పేర్కొంటున్నాయన్నారు. జిల్లాలో టీడీపీకి ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదన్నారు. వైఎస్ జగన్ సీఎం కావడం ద్వారా రాజన్న రాజ్యం ఖాయమంటూ సర్వేలు స్పష్టం చేస్తున్నాయన్నారు. వీటన్నింటినీ గమనించిన టీడీపీ నేతలు.. అధికారం కోసం వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలపై దాడులు చేయిస్తున్నారన్నారు.
అక్రమ కేసుల బనాయింపు మానుకోవాలి
వైఎస్సార్ సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయించడం, గృహ నిర్బంధాలు చేయడం మానుకోవాలని సూచించారు. తాడిపత్రి, రాయదుర్గం, హిందూపురం, రాప్తాడు, ధర్మవరం సమన్వయకర్తలు పెద్దారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, నవీన్ నిశ్చల్, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై మంత్రులు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు, జేసీ బ్రదర్స్ అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. ఎలాంటి తప్పు చేయకున్నా వారిని పోలీసుల చేత గృహ నిర్బంధాలు చేయించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రాయదుర్గంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ మంత్రి కాలవ విసిరిన సవాలన్‌ను కాపు రామచంద్రారెడ్డితో పాటు పార్టీ స్వీకరించిందన్నారు. ఆయన నిర్ణయించిన తేదీకే బహిరంగ చర్చకు సిద్ధమైతే.. తన అక్రమాలు వెలుగు చూస్తాయనే భయంతో పోలీసులను అడ్డుపెట్టుకుని చర్చకు అనుమతి లేదంటూ తొక్కిపడేశారన్నారు.
రాష్ట్ర కార్యదర్శులు పైలా నరసింహయ్య, రమేష్‌రెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పామిడి వీరాంజనేయులు, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు గయాజ్ బాషా, రాష్ట్ర నాయకులు చవ్వా రాజశేఖర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి దిలీప్‌రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శులు నాగిరెడ్డి, గూడూరు సూర్యనారాయణరెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లయ్యయాదవ్, గుత్తి పట్టణ, మండల కన్వీనర్లు పీరా, గోవర్దన్‌రెడ్డి, న్యాయవాది బుసా సుధీర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శులు గురుప్రసాద్ యాదవ్, సీవీ రంగారెడ్డి, ఫారూక్, సుభాష్‌రెడ్డి, శివయ్య, జిల్లా ట్రేడ్ యూనియన్ కార్యదర్శి శ్యామ్యూల్, నియోజకవర్గ అధ్యక్షుడు సోమిరెడ్డి, ఎస్టీ సెల్ జిల్లా కార్యదర్శి గోవిందు పాల్గొన్నారు.
అధికారం శాశ్వతం కాదు
కొన్ని సంవత్సరాలుగా మహారాష్ట్ర నుంచి కోర్టు నోటీసులు వస్తున్నా.. పట్టించుకోకుండా ఇప్పుడిప్పుడే తనకు నోటీసులు అందినట్లు సీఎం చంద్రబాబు నటిస్తున్నాడని విమర్శించారు. కేవలం సానుభూతి పొందేందుకు ఈ తరహా చిల్లర రాజకీయాలకు ఆయన పాల్పడుతున్నాడని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణులే లక్ష్యంగా దాడులు అధికమయ్యాయన్నారు. దాడులకు బాధ్యులైన వారిపై, వారిని ప్రోత్సహిస్తున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా వైఎస్సార్ సీపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. ఈ నాలుగేళ్లలో పోలీస్, రెవెన్యూ వ్యవస్థలు పూర్తి భ్రష్టుపట్టిపోయాయన్నారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని వారు గుర్తించాలని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment