సాక్షి, ఢిల్లీ: ఏపీలో సోలార్ పవర్ విషయంలో వైఎస్సార్‌సీపీపై గత కొన్నాళ్లుగా టీడీపీ, దాని అనుకూల మీడియా అడ్డగోలు ప్రచారానికి దిగాయి. ప్రముఖ వ్యాపారవేత్త అదానీపై అమెరికాలో నమోదైన అభియోగాలను.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి అన్వయిస్తూ ఇష్టానుసారం కథనాలతో వైఎస్ జగన్ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించాయి. అయితే.. ఈ కుట్రను తాజాగా లోక్‌సభలోనూ వైఎస్సార్‌సీపీ బయటపెట్టింది.
విద్యుత్ కొనుగోలు ఒప్పందం విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతోనే ఒప్పందం చేసుకుందని వెల్లడించారు. ఇదే సమయంలో అదానీతో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని పార్టీ తరఫున ఆయన మరోసారి వివరణ ఇచ్చారు.
పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా.. మంగళవారం లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ..‘సోలార్ పవర్ విషయంలో మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు . ఎద్దు ఈనిందంటే దూడను కట్టేయమంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతోనే ఒప్పందం చేసుకుంది. అదానీతో ఒప్పందం చేసుకోలేదు.
సెకీతో అనేక రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయి. చాలా తక్కువ రేటుకు మేము ఒప్పందం చేసుకున్నాం. 2021లో సోలార్ పవర్ 5.90 యూనిట్‌కు ఉంది. మేము 2.49కు మాత్రమే కొనడానికి ఒప్పందం చేసుకున్నాము. ఇటీవల కాలంలో కూడా ఐదు రూపాయలకు పైగా యూనిట్‌కు చెల్లించి పవర్ కొన్న రాష్ట్రాలు ఉన్నాయి. ఒక వర్గం మీడియా, మేధావులు మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చట్ట సభ దృష్టికి తీసుకెళ్లారు.
దేశంలో బ్యాంకింగ్ రంగం గణనీయంగా వృద్ధి చెందుతుంది. దేశంలో 62% జనాభా వ్యవసాయంపైన ఆధారపడి ఉంది. వ్యవసాయ రంగం అభివృద్ధికి తగిన చర్యలు కనిపించడం లేదు. రుణమాఫీ, అందుబాటులోని రుణాలు క్షేత్రస్థాయిలో సరిగ్గా అమలు కావడం లేదు. చాలా ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. చిన్నతరహ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. విద్యార్థులకు ఇచ్చే రుణాలకు సరైన విధానం రూపొందించాలి’ అని మిథున్ రెడ్డి సూచనలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment