వేల్పనూరులో బెల్టుషాపును పరిశీలిస్తున్న ఎక్సైజ్ అధికారులు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఇప్పటివరకు కాంట్రాక్టులు చేసిన నేతల గురించి విన్నాం. నీరు–చెట్టు పనుల్లో రూ.కోట్లకు కోట్లు దండుకున్న ఎమ్మెల్యేలు, మంత్రులను చూశాం. ఇప్పుడు ఏకంగా బెల్టుషాపులు కూడా నిర్వహిస్తున్నారు. శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి స్వగ్రామం వేల్పనూరులో ‘అన్న’ ఆదేశాలతో ఆయన డ్రైవరు నేతృత్వంలో సాగుతున్న బెల్టుషాపు కథ ఇది. రోజుకు లక్ష రూపాయల వ్యాపారం సాగిస్తూ.. 30 నుంచి 40 శాతం అధిక ధరకు మద్యాన్ని విక్రయిస్తున్న వ్యవహారం తాజాగా బయటకు వచ్చింది. లక్ష రూపాయల వ్యాపారంలో రూ.40 వేల వరకూ లాభాన్ని ఆర్జిస్తుండటం గమనార్హం. ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంచే ఈ బెల్టు దుకాణం ‘అన్న’ ఆదేశాలతో నడుస్తుండటంతో ఇన్నాళ్లూ అటువైపు కన్నెత్తి చూసేందుకు అధికారులు సాహసించలేదు. అయితే, పక్కా ఫిర్యాదు రావడంతో చేసేదేమీ లేక రెండు రోజుల క్రితం ఎక్సైజ్ అధికారులు దాడి చేసి.. బెల్టుషాపును సీజ్ చేశారు. అయితే, అన్న ఆదేశాలతో.. ఆయన వద్ద డ్రైవరుగా పనిచేస్తున్న రమేష్ అనే వ్యక్తి నేతృత్వంలో ఈ షాపు నిర్వహిస్తున్నట్టు అందులో పనిచేసే వ్యక్తి స్పష్టంగా పేర్కొన్నప్పటికీ కేసులు పెట్టేందుకు అధికారులు జంకుతున్నారు. అసలు ‘అన్న’ ఎవరనే కోణంలో విచారణ చేసేందుకు సైతం సాహసించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. మొత్తమ్మీద ఎమ్మెల్యే స్వగ్రామంలో నడుస్తున్న ఈ బెల్టు షాపు వ్యవహారంలో ఫిర్యాదు చేసిన వారిపైనే తిరిగి కేసు నమోదుకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
అన్న చెబితేనే చేస్తున్నాం!
బెల్టుషాపుపై దాడి సందర్భంగా ఎవరు నిర్వహిస్తున్నారని అడిగిన ప్రశ్నకు... షాపులో ఉన్న వ్యక్తి ‘మాకేం పని సార్. అన్న చెబితేనే చేస్తున్నాను’ అని స్పష్టంగా పేర్కొన్నారు. అన్న ఎవరనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. చివరకు మాట మార్చి ఎమ్మెల్యే డ్రైవరు రమేష్ చెబితే చేస్తున్నానని బుకాయించాడు. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్సైజ్ అధికారులు బెల్టుషాపుపై దాడి చేసి, సుమారు రూ.20 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ‘అన్న’ ఎవరో నిగ్గుతేల్చి..అతనిపై కేసు పెట్టేందుకు మాత్రం సాహసించడం లేదు. కేవలం కింది వారిని బలిపశువులు చేసేందుకు సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
30–40 శాతం అధిక ధరలకు...
ఎమ్మెల్యే సొంతూరిలో నడుస్తున్న ఈ బెల్టుషాపులో మద్యాన్ని భారీగా అదనపు ధరలకు విక్రయిస్తున్నారు. 30 నుంచి 40 శాతం వరకూ అధిక ధర చెల్లించి మరీ మద్యం ప్రియులు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇదేంటని అడిగే ధైర్యం ఎవ్వరూ చేయడం లేదు. అంతేకాకుండా ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉంచుతున్నారు. దీనిపై గతంలో అనేకసార్లు అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రం తాత్కాలికంగా మూసివేస్తున్నారు. తిరిగి యధావిధిగా నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ నేతల అండదండలతో సాగుతున్న వ్యవహారం కావడంతో అధికారులు కూడా సీరియస్‌గా దృష్టి సారించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment