
కారు నిలిపి సాక్షి విలేకరిని బెదిరిస్తున్న ఎమ్మెల్యే బీకే ,మసీదుకు నీళ్లు లేవని చెబుతున్న ముస్లింలు
ఆయన ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధి. ప్రజల బాగోగులు చూడాల్సిన ఆయనే భగ్గుమన్నారు. తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని చెబుతుంటే తనకేమీ పట్టనట్టుగా కారులో కూర్చున్నారు. ఓటు వేసి గెలిపిస్తే.. బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారా అంటూ ప్రజలు తిరగబడ్డారు. అంతే చిర్రెత్తుకుపోయిన ప్రజాప్రతినిధి అసహనంతో రగిలిపోయారు.
అనంతపురం , సోమందేపల్లి: సోమందేపల్లి మండలం పత్తికుంటపల్లిలో సోమవారం పర్యటించిన ఎమ్మెల్యే బీకే పార్థసారథిని ప్రజలు తాగునీటి సమస్యపై నిలదీశారు. నాలుగున్నరేళ్ల తర్వాత గ్రామానికి వచ్చి సమస్యల గురించి తెలుసుకోకుండానే వెనుదిరుగుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుకు కదలనీయకుండా ఘెరావ్ చేశారు. అయితే ఎమ్మెల్యే ఎటువంటి హామీ ఇవ్వకుండా కారు ఎక్కి వెళ్లిపోవడానికి ప్రయత్నించడంతో ప్రజలు అడ్డుకున్నారు. మసీదుకు సైతం నీటి సరఫరా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ముస్లింలు ఆవేదన వ్యక్తం చేశారు. తాజా మాజీ సర్పంచ్ శిల్ప, ఆమె భర్త సోముల దృష్టికి తీసుకెళ్లినా ఏమాత్రం పట్టించుకోలేదని తెలిపారు. తక్షణమే నీటి సమస్య పరిష్కరించాలని పట్టుబట్టారు. ఈ దృశ్యాన్ని చిత్రీకరిస్తున్న సాక్షి విలేకరి జాకీర్ హుసేన్‌ను ఎమ్మెల్యే గమనించి.. కారు దిగి వచ్చారు. ‘చేయి చూపిస్తూ.. ఫొటోలు తీస్తున్నావ్.. ఏమనుకుంటున్నావ్? నీ అంతు చూస్తా.. జాగ్రత్త’ అంటూ బెదిరించారు. సమస్య పరిష్కారంపై హామీ ఇవ్వకపోగా ఆందోళనను కవరేజ్ చేస్తున్న విలేకరిపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేస్తూ బెదిరింపులకు దిగడంపై ప్రజలు మండిపడ్డారు. ఇంతలో టీడీపీ నాయకులు రంగప్రవేశం చేసి ప్రజలను కట్టడి చేశారు. ఎమ్మెల్యేను అక్కడి నుంచి పంపించివేశారు.
పట్టాల పంపిణీకి డబ్బు వసూళ్లు
నిరుపేదలకు నివేశన స్థల పట్టాలు ఇవ్వడం కోసం సేకరించే భూములకు సంబంధించి సదరు రైతులకు ప్రభుత్వమే పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ టీడీపీ మాజీ సర్పంచ్ శిల్ప భర్త సోము గ్రామంలోని 59 మంది వద్ద రూ.10 వేల నుంచి రూ.13 వేల దాకా పట్టాల కోసం వసూళ్లూ చేసి.. ఎమ్మెల్యే చేతుల మీదుగా సోమవారం పట్టాల పంపిణీ చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సేకరించిన భూముల యజమానులకు ప్రభుత్వం పరిహారం అందజేసినట్లు ప్రకటించారు. పట్టాల పంపిణీకి సంబంధించిన సర్వే నంబర్ 211 భూమిపై నాగభూషణ్‌రెడ్డి అనే వ్యక్తి హిందూపురం కోర్టులో కేసు సైతం వేశారు. కోర్టు పరిధిలో కేసు ఉండగానే టీడీపీ నాయకులు అధికారులతో కలిసి పట్టాల పంపిణీకి అత్యుత్సాహం చూపారు. గ్రామంలో నెలకొన్న సమస్యలపై స్ధానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో వారిపై కొంతమంది టీడీపీ నాయకులు ఎదురుదాడికి దిగారు. కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాలకు నచ్చచెప్పడానికి కానిస్టేబుల్ ఒకరే ఉండడంతో ఇబ్బంది పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment