అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో వర్షాభావ పరిస్థితులు అధికం అవుతుండడంతో తాగునీటి కష్టాలు రెట్టింపవుతున్నాయి. గత ఏడాది కన్నా ఈసారి రెట్టింపు స్థాయిలో తాగునీటి కష్టాలు ఎదురయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. అధికారులు మాత్రం ఇంత వరకూ ప్రతిపాదనలతోనే సరిపెట్టారు.
సహాయక చర్యలు ప్రారంభించలేదు. జిల్లాలో ఈ ఏడాది దాదాపు 1,100 గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఉంటుందని అధికారులు గుర్తించారు. దాదాపు 400 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాల్సి వస్తుందని భావిస్తున్నారు. ఆయా గ్రామాల్లో కొత్తగా బోర్ల తవ్వకం, పాత బోర్ల మరమ్మతులు, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా కోసం రూ.16.6 కోట్లు అవసరమని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. గత నెలలోనే ప్రతిపాదనలు పంపినా.. ప్రభుత్వం ఇంకా నిధులు విడుదల చేయలేదు. ఈ ఏడాది కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఆశాజనకంగానే కురిశాయి. మరికొన్ని ప్రాంతాల్లో వరుణుడు పూర్తిగా ముఖం చాటేశాడు. దీంతో ఆయా ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఏర్పడుతోంది.
అతి తక్కువ వర్షపాతం నమోదైన యల్లనూరు, పుట్లూరు, ఓడీసీ, అమడగూరు మండలాల్లోని 90 గ్రామాలకు నేటికీ ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. గత డిసెంబర్ నుంచే ఈ పరిస్థితి తలెత్తింది. రానున్న మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో పరిస్థితి మరింత దయనీయంగా మారే ప్రమాదముంది.
వర్షాభావం ప్రభావంతో ఈ ఏడాది పంటలు దెబ్బతినడమే కాకుండా భూగర్భజలాలపైనా ప్రభావం చూపింది. సుమారు 400 గ్రామాల్లో భూగర్భ జలమట్టం దారుణంగా పడిపోయింది. ఇటీవల అధికారులు నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది. దీని ప్రభావం వచ్చే వేసవిలో తాగునీటి, వ్యవసాయ బోర్లపై పడనుంది.
వేల సంఖ్యలో బోర్లు ఎండిపోవడం ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి. ఆర్‌డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో జిల్లాలో 3,215 గ్రామాలకు చేతిపంపులు, రక్షిత పథకాల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. వీటితో పాటు 38 సీపీడబ్ల్యూఎస్ స్కీంలు(ఒకటి కన్నా ఎక్కువ గ్రామాలకు నీటిసరఫరా), 1900 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. విడపనకల్లులో ఒకటి, నింబగల్లులో మూడు ఎస్‌ఎస్ ట్యాంకులను, శ్రీరామరెడ్డి పథకాన్ని ఆర్‌డబ్ల్యూఎస్ శాఖనే పర్యవేక్షిస్తోంది. వీటి కి పీఏబీఆర్ నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. ఒక్క శ్రీరామరెడ్డి పథకానికే 1.05 టీఎంసీల నీటిని కేటాయిస్తున్నారు.
అయితే... వేసవికి సరిపడా తాగునీటిని అధికారులు సిద్ధం చేసుకున్నారా అన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తుంగభద్ర జలాశయం నుంచి ఈ ఏడాది హెచ్చెల్సీకి 22 టీఎంసీల నీటిని కేటాయించారు. ఇందులో తాగునీటి అవసరాలకు 8.5 టీంఎసీలను మళ్లించారు. అయితే.. పీఏబీఆర్ కింద ఉన్న తాగునీటి పథకాలకు నీటి కేటాయింపులో భారీగా కోతపడింది.
వేసవిలో తాగునీటి అవసరాల కోసం పీఏబీఆర్‌లో 2.200 టీఎంసీలు నిల్వ చేయాల్సి ఉండగా.. ఆ పరిస్థితి కన్పించడం లేదు. చెరువులకు నీటి విడుదలకు డిమాండ్ పెరుగుతుండడంతో పీఏబీఆర్‌ను ఖాళీ చేస్తున్నారు. ప్రస్తుతం డ్యాంలో 1.85 టీఎంసీలు మాత్రమే నీరు నిల్వ ఉంది. ఈ నెల 25 వరకూ చెరువులకు విడుదల చేయాల్సి ఉండడంతో తాగునీటి అవసరాలకు 1.5 టీఎంసీలు కూడా మిగిలే పరిస్థితి కనిపించడం లేదు. పీఏబీఆర్ నీటిని జిల్లా కేంద్రంతో పాటు శ్రీరామరెడ్డి పథకం ద్వారా హిందూపురానికి, సత్యసాయి పథకాల ద్వారా 700 గ్రామాలకు సరఫరా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నిల్వ ఉంచిన నీరు వచ్చే వేసవికి ఏమాత్రమూ సరిపోవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మూలన పడుతున్న చేతిపంపులు, తాగునీటి బోర్లు
కొన్నేళ్లుగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో జిల్లాలో చేతిపంపులు, తాగునీటి బోర్లు మూలన పడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 3,215 గ్రామాల్లో 13,442 మంచి నీటి బోర్లు ఉన్నాయి.
వీటిలో ప్రస్తుతం నాలుగు వేలకు పైగా పనిచేయడం లేదు. చేతిపంపులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని గల్లంతయ్యాయనే వివరాలు అధికారుల వద్ద లేవు. 13వ ఆర్థిక సంఘం నిధులు పుష్కలంగా ఉండడంతో ప్రస్తుతం చేతిపంపులు, బోర్ల మరమ్మతులపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈలు, పంపు మెకానిక్‌లు సంయుక్తంగా ‘క్రాష్ ప్రోగ్రాం’ పేరుతో సర్వేలు చేస్తున్నారు. పనిచేయని వాటి వివరాలు తెప్పించుకొని మార్చి 31 నాటికి మరమ్మతులు చేస్తామని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి జిల్లాలో ఇప్పటికే తాగునీటి ఇబ్బందులు తలెత్తాయి. అలాంటప్పుడు మార్చి తర్వాత మరమ్మతులు చేసి ప్రయోజనం ఏమిటన్నది అధికారులకే తెలియాలి.
తాగునీటి సమస్యలు ఎదుర్కోవడానికి సిద్ధం
ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇందుకోసం రూ.16.6 కోట్లు అవసరమని వేసవి ప్రణాళికను రూపొందించి ప్రభుత్వానికి పంపాం. నిధులు వచ్చిన వెంటనే సహాయక చర్యలు చేపడతాం. జిల్లా పరిషత్ నుంచి 13వ ఆర్థిక సంఘం నిధులు కూడా ఖర్చు చేస్తున్నాం. తాగునీటి సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించడానికి జెడ్పీలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశాం. త్వరలో దీనిని కంప్యూటరైజ్డ్ చేస్తున్నాం.
- ప్రభాకర్‌రావు, ఎస్‌ఈ, ఆర్‌డబ్ల్యూఎస్
తాగునీటికి కటకట
Published Mon, Feb 10 2014 2:21 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement