సాక్షి, నెల్లూరు: ‘ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లు’ ఉదయగిరి టీడీపీ అభ్యర్థి బొల్లినేని రామారావుకు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అసమ్మతి తలనొప్పి.. నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బీద మస్తాన్‌రావుకు సంకటంగా మారింది. ఉదయగిరి నియోజవర్గంలో చేపట్టిన ఫైబర్ చెక్‌డ్యామ్ పనులను బొల్లినేని స్థానిక నేతలకు సబ్‌కాంట్రాక్ట్‌గా ఇచ్చి చేయించారు. ఆ బిల్లులను వసూలు చేసుకుని తన ఖాతాలో వేసుకున్నాడే కానీ.. పనులు చేసిన నేతలకు డబ్బులు ఇవ్వలేదు. తమ డబ్బులు ఎగనామం పెట్టిన ఎమ్మెల్యే బొల్లినేనికి ఎన్నికల సమయంలో సదరు నేతలు చుక్కలు చూపిస్తున్నారు. తమకు ఇవ్వాల్సిన బకాయిలు ఇస్తే కానీ ఎన్నికల్లో పని చేయమని తెగేసి చెప్పడంతో వారిని సర్దుబాటు చేసే వ్యవహారంలో భాగంగా బొల్లినేని అప్పుల బండను నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి బీద మస్తాన్‌రావు నెత్తినేసుకున్నాడు. బొల్లినేని బాధితులను నెల్లూరులోని తమ కార్యాలయం వద్దకు పిలిపించుకుని నగదు సర్దుబాటు చేస్తున్నారు. ముందుగా నియోజకవర్గంలోని రూ.10 లక్షల లోపు బకాయిలు ఉన్న వారిని పిలిపించుకుని వారికి సగం నగదు ఇచ్చేలా ఒప్పించేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ పూర్తిస్థాయిలో బకాయిలు ఇచ్చే వరకు ఈ ఎన్నికల్లో బొల్లినేనికి పని చేయమని వారు తెగేసి చెబుతుండడంతో వారిని ఒప్పించేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు.
రూ.9 కోట్ల బకాయిలు
ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొల్లినేని రామారావు కొత్త టెక్నాలజీ పేరుతో దాదాపు రూ.120 కోట్ల వ్యయంతో పైబర్‌చెక్ డ్యామ్‌ల నిర్మాణం చేపట్టారు. మహారాష్ట్రలోని పైబర్ చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలు ఉపయోగ పడుతున్నాయంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి నియోజక వర్గంలో పైబర్ చెక్ డ్యామ్‌లు నిర్మాణాలకు çపూనుకున్నారు. ఖర్చు తక్కువతో నిర్మాణాలు జరిగే పైబర్ చెక్ డ్యామ్‌ల నిర్మాణాల్లో అంచనా భారీగా పెంచి వేయించారు. తన సొంత కంపెనీ పేరుతోనే టెండర్లు దక్కించుకుని ఆయా చెక్‌డ్యామ్ నిర్మాణ పనులను నియోజకవర్గ పరిధిలోని టీడీపీ నేతలకు పంపకాలు చేసి వారి ద్వారా నిర్మాణాలు చేయించారు. కానీ ఆయా బిల్లులు పూర్తిస్థాయిలో తీసుకున్న బొల్లినేని రామారావు సబ్ కాంట్రాక్టర్లకు మాత్రం ఇవ్వలేదు. దాదాపు రూ.9 కోట్ల వరకు బిల్లులు ఇవ్వకుండా మూడేళ్లగా వారిని ముప్పు తిప్పులు పెట్టారు.
వీరే కాకుండా మహారాష్ట్ర, ఏపీలో కూడా బొల్లినేని కంపెనీ నుంచి బిల్లులు రావాల్సిన జాబితా చాలానే ఉంది. సబ్ కాంట్రాక్టర్లకు రావాల్సిన నగదు ఇవ్వకుండా ఎగనామం పెట్టిన ఎమ్మెల్యేపై వారు పోరాటం చేయలేకపోయారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బాధితులంతా ఏకమై బొల్లినేని వ్యవహారంపై తీవ్రంగా పోరాటం చేశారు. ఒకనొక దశలో సీఎం చంద్రబాబు వద్ద పంచాయితీ పెట్టి టికెట్ ఇవ్వొద్దని, టికెట్ ఇస్తే ఓడిస్తామని హెచ్చరించి వచ్చారు. దీంతో సీఎం చంద్రబాబు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లినేనికి టికెట్ ఇవ్వకుండా చివరి వరకు జాప్యం చేసినా, కొన్ని ఒత్తిళ్లకు తలొగ్గి టికెట్ ఇచ్చారు.
కానీ బొల్లినేని బాధితులు మాత్రం మా బిల్లులు ఇస్తే కానీ ఆయనకు పని చేయమని తెగేసి చెప్పడంతో పాటు పలువురు ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లడంతో మింగుడు పడని బొల్లినేని ఈ వ్యవహారం చక్కదిద్దాలని నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి బీద మస్తాన్‌రావుకు అప్పగించారు. ఆయన నియోజకవర్గంలోని బొల్లినేని బాధితులను పిలిపించుకుని వారికి కొంత సర్దుబాటు చేసి పంపే ప్రయత్నాలు మమ్మురం చేశారు. దీంతో బొల్లినేని నగదు సర్దుబాటు చేస్తున్నారని తెలియగానే బాధితులు క్యూ కట్టారు. కేవలం నియోజకవర్గానికి చెందిన బాధితులను మాత్రం పిలిపించుకుని సర్దుబాటు చేస్తున్నారు. మిగిలిన వారికి పట్టించుకోకపోవడంతో వారు ఆగ్రహాం వ్యక్తం చేస్తునారు.
Comments
Please login to add a commentAdd a comment