ఎమ్మెల్యే మాధవనాయుడుపై శిక్ష తీర్పు అమలు | mla madhavanayudu case | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే మాధవనాయుడుపై శిక్ష తీర్పు అమలు

Published Mon, Apr 27 2015 10:27 PM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

ఎమ్మెల్యే మాధవనాయుడుపై శిక్ష తీర్పు అమలు - Sakshi

ఎమ్మెల్యే మాధవనాయుడుపై శిక్ష తీర్పు అమలు

జడ్జి, ఇతర న్యాయాధికారులతో దురుసుగా వ్యవహరించిన ఘటనలో పశ్చిమ గోదావరి జిల్లా, నర్సాపూర్ శాసనసభ్యుడు బండారు మాధవ నాయుడు రాతపూర్వకంగా సమర్పించిన క్షమాపణలను హైకోర్టు మరోసారి తిరస్కరించింది.

హైదరాబాద్ : జడ్జి, ఇతర న్యాయాధికారులతో దురుసుగా వ్యవహరించిన ఘటనలో పశ్చిమ గోదావరి జిల్లా, నర్సాపూర్ శాసనసభ్యుడు బండారు మాధవ నాయుడు రాతపూర్వకంగా సమర్పించిన క్షమాపణలను హైకోర్టు మరోసారి తిరస్కరించింది. చేసిన పనికి ఆయనకు ఏ మాత్రం పశ్చాత్తాపం లేదని, అందువల్ల ఆయనకు జరిమానా విధిస్తూ తాము విధించిన శిక్ష తాలుకు తీర్పు అమల్లోకి వస్తుందని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొందరు వ్యాపారులు శాశ్వత ప్రతిపాదికన కోర్టు భవనాన్ని ఆనుకుని తోపుడు బండ్లు ఏర్పాటు చేసుకున్నారని, వీటి వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ పలువురు న్యాయవాదులు జిల్లా అదనపు జడ్జి దృష్టికి తీసుకొచ్చారు.

 

ఆ తోపుడు బండ్లను అక్కడి నుంచి తొలగించేందుకు జడ్జి ఆదేశాలు జారీ చేశారు. అనుచరులతో అక్కడికి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే మాధవనాయుడు తనకు చెప్పకుండా ఎలా తోపుడు బండ్లను తొలగిస్తారంటూ వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో జిల్లా జడ్జి ఈ మొత్తం వ్యవహారాన్ని ఓ నివేదిక రూపంలో హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మాధవ నాయుడు వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు కోర్టు ధిక్కారం కింద విచారణ ప్రారంభించింది. సుదీర్ఘ విచారణ తరువాత, గత వారం తీర్పు వెలువరించిన ధర్మాసనం, జిల్లా జడ్జితో పాటు ఇతర న్యాయాధికారుల పట్ల మాధవనాయుడు దురుసుగా వ్యవహరించారని, ఇది కోర్టు ధిక్కారమే అవుతుందని తెలిపింది. అందుకు గాను మాధవనాయుడుకు రూ.1000 జరిమానా విధించింది. అయితే మాధవ నాయుడు భేషరతు క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తరఫు న్యాయవాది చిదంబరం చెప్పడంతో, ధర్మాసనం అందుకు అంగీకరిస్తూ, భేషరతు క్షమాపణను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని, అప్పటి వరకు తమ ఆదేశాల అమలును నిలుపుదల చేస్తున్నట్లు పేర్కొంది. తాజాగా ఈ వ్యవహారం సోమవారం మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా మాధవ నాయుడు సమర్పించిన అఫిడవిట్‌ను పరిశీలించిన ధర్మాసనం, న్యాయాధికారులతో దురుసు ప్రవర్తనకు ఆయన ఎక్కడా పశ్చాత్తాపం వ్యక్తం చేయడం లేదని, అందువల్ల తాము జరిమానా విధిస్తూ ఇచ్చిన తీర్పు అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement