
ఎమ్మెల్యే పీఏ ‘శివా’లు
పేరుకు ‘జన్మభూమి మా ఊరు’ ప్రభుత్వ కార్యక్రమం అయినా.. టీడీపీ నాయకుల ఓవర్ యాక్షన్ అంతాఇంత కాదు. వారి చేస్తున్న హడావుడితో లబ్ధిదారులు పడుతున్న అవస్థలు అన్ని ఇన్నీకావు. గాజువాకలో సమస్యలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష పార్టీ సభ్యులను చేయి పట్టుకొని గెంటేసే ప్రయత్నం చేశారు. ఆరిలోవలో ఎమ్మెల్యే పీఏ ‘శివా’లెత్తారు. జెడ్సీ, వైద్యురాలిపై నోరుపారేసుకున్నారు. భీమిలి నియోజకవర్గం లోడగలవానిపాలెం, చోడవరం నియోజకవర్గం జన్నవరంలో అధికారులను దర ఖాస్తుదారులు ప్రశ్నించారు. డుంబ్రిగుడలో జన్మభూమి రసభాసగా ముగిసింది. గాజువాకలో రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఉత్తర నియోజకవర్గంలో ఐటీ మంత్రి పల్లెరఘనాథ్‌రెడ్డి పాల్గొని ప్రభుత్వ పథకాలను వివరించారు. మొత్తం మీద రెండో రోజూ కూడా నిరసనలతో జన్మభూమి సాగింది.
ఆరిలోవ: ఆరిలోవ ప్రాంతం ఒకటో వార్డులో ఆదివారం జరిగిన జన్మభూమి సభలో తూర్పు నియోజక వర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు వ్యక్తిగత కార్యదర్శి శివ హడావిడి చేశాడు. అధికారులపై జులం ప్రదర్శించి అతని కనుసన్నలో సభ నిర్వహించే ప్రయత్నం చేశాడు. అతని జులుం ముందు అధికారులు తలొగ్గి చెతులెత్తేశారు. సభ నిర్వహించే సమయానికి వేదిక చుట్టూ టీడీపీ జెండాలు కట్టి ఉండడాన్ని గమనించిన జోనల్ కమిషనర్ సత్యవేణి, వాటిని తొలగించారు. అక్కడ ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను కూడా తొలగించాలని సిబ్బందికి ఆదేశించారు. ఏ అధికారమూ లేకపోయినా, సభా వేదికపై అధికారుల మధ్య ఆశీనుడైన శివ, అప్పటికే జెండాలు తొలగించడంపై ఆవేశంతో ఉన్నాడు. ప్లెక్సీలు కూడా తొలగించమని ఆదేశించడంతో జెడ్సీపై శివాలెత్తిపోయాడు. ‘జెండాలు పీకేశారు, పోనిలే అని ఊరుకొంటే.. ప్లెక్సీలు కూడా తొలిగించేస్తారా? తొలగిస్తే ఊరుకోను. అలా చేస్తే బాగుండదు. ఖబడ్డార్’ అంటూ జెడ్సీపై నోరు పారేసుకున్నాడు. ఆ మాటలు విని వేదికపై ఉన్న అధికారులంతా నోళ్లు వెళ్లబెట్టుకున్నారు. ఆయన జులుం ముందు అధికారులు తలొగ్గారు. అతని చెప్పినట్లే, అతని సలహాలు మేరకు సభ నడిపారు.
ఇలా సభ జరుగుతుండగా, సభా ప్రాంగణంలో నిర్వహించిన సీమంతాల కార్యక్రమం వద్దకు వెళ్లారు. ‘నేను ఈ రోజు వద్దన్నాను కదా.. చెప్పినా వినకుండా ఎందుకు నిర్వహించారు’ అంటూ ఐసీడీఎస్, ఆరిలోవ జీవీఎంసీ ఆస్పత్రి వైద్యాధికారి డాక్టర్ అనితపై ఫైర్ అయ్యారు. ఆయన తీరుతో అధికారులతో పాటు స్థానిక నాయకులు, వార్డు ప్రజలకు ముక్కున వేలేసుకున్నారు.