మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. రానున్న ఎన్నికల్లో బరిలే నిలిచేందుకు ఆయన సిద్ధమవుతుండగా, అసలు టికెట్ వస్తుందో లేదో తెలియని పరిస్థితి. పైగా ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న దానిపై స్పష్టత లేదు. పుట్టపర్తిలో అసమ్మతి నేతల బెడద వెంటాడుతోంది. అందువల్లే కదిరి నుంచి బరిలో దిగితే ఎలా ఉంటుందన్న దానిపై వ్యక్తిగత సర్వే చేపట్టినట్లు సమాచారం. అధిష్టానం టికెట్ ఇవ్వకపోతే టీడీపీకి రాజీనామా చేయాలనే ఆలోచనలోనూ ఉన్నట్లు తెలిసింది.
సాక్షి, పుట్టపర్తి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి రాజకీయ మనుగడ కష్టంగా మారింది. రెండున్నర దశాబ్దాల పాటు టీడీపీలో పని చేసినా.. ప్రస్తుతం తగిన గుర్తింపు లేకపోవడంతో పార్టీలో కొనసాగాలా? వీడాలా? అనే సందిగ్దంలో పడ్డారు. 2024 ఎన్నికల్లో టికెట్ వస్తుందో? లేదో? తెలియని పరిస్థితి. దీనికి తోడు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై స్పష్టత లేదు. ఒకవేళ టికెట్ ఇచ్చినా.. గెలుస్తామన్న నమ్మకం లేదు. దీంతో ఆయన అనుచర వర్గం కూడా అయోమయంలో పడిపోయారు. పల్లె వెంట నడవాలా? వద్దా? అనే అనుమానంతో స్తబ్ధతగా ఉండిపోయారు. అధిష్టానం టికెట్ ఇవ్వకపోతే టీడీపీకి రాజీనామా చేసేందుకు పల్లె రఘునాథరెడ్డి సిద్ధమైనట్లు తెలిసింది. అయితే టీడీపీకి రాజీనామా చేస్తే.. ఏ పార్టీలో చేరుతారనే దానిపై కూడా క్లారిటీ లేదు. దీంతో ఆయన వెంట నడిచేందుకు టీడీపీ కార్యకర్తలు వెనుకడుగు వేస్తున్నారు.
అసమ్మతి నేతల బెడద..
పుట్టపర్తిలో పల్లె రఘునాథరెడ్డికి భారీ వ్యతిరేకత ఉంది. మున్సిపల్ మాజీ చైర్మన్ పీసీ గంగన్న టీడీపీ హయాంలో కూడా పల్లెపై తిరుగుబాటు చేశారు. దీనికి తోడు రెడ్డి సామాజికవర్గం నుంచి కూడా పల్లె రఘునాథరెడ్డికి వ్యతిరేకత ఉంది. నల్లమాడ మండలానికి చెందిన సైకం శ్రీనివాసరెడ్డికి పల్లె రఘునాథరెడ్డికి పడదు. అంతేకాకుండా సైకం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. పుట్టపర్తికి చెందిన పెదరాసు సుబ్రమణ్యం టీడీపీకి అనుకూలంగా ఉన్నా... పల్లెకు వ్యతిరేకం. ఇప్పటికే రెండుసార్లు ప్రెస్‌మీట్‌లో తన అసమ్మతి బహిరంగంగానే వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ‘పల్లె’ పుట్టపర్తిని వద్దనుకుంటున్నట్లు తెలుస్తోంది.
సర్వం వైఎస్సార్‌సీపీ కైవసం..
పుట్టపర్తి నియోజకవర్గంలోని నల్లమాడ, అమడగూరు మండలాలు గతంలో టీడీపీకి అనుకూలంగా ఉండేవి. అయితే 2019 నుంచి ఈ రెండు మండలాల్లో వైఎస్సార్‌సీపీ హవా కొనసాగుతోంది. అమడగూరు మండలంలోని పది పంచాయతీ సర్పంచ్ స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. టీడీపీకి అనుకూలంగా ఉన్న కొత్తచెరువులో రఘుపతి (మార్కెట్ యార్డు మాజీ వైస్ చైర్మన్), పెద్దన్న (లోచెర్ల), నిసార్ అహ్మద్ (మాజీ డీలర్), మండల మాజీ కన్వీనర్ శ్రీనాథ్.. పల్లె రఘునాథరెడ్డికి దూరంగా ఉంటున్నారు. ఓబుళదేవరచెరువు మండలానికి చెందిన అల్లాబకాష్, ఇస్మాయిల్ కూడా పల్లెకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ‘పల్లె’కు సీటు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీనిపై ‘పల్లె’ కూడా తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
కదిరి నుంచి పోటీ?..
పుట్టపర్తిని దాదాపుగా వద్దనుకుంటున్న పల్లె రఘునాథరెడ్డి వచ్చే ఎన్నికల్లో కదిరి నుంచి బరిలో దిగే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. తన సొంత మండలం తనకల్లు కావడంతో కదిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. అయితే టీడీపీ అధిష్టానం కందికుంట వెంకటప్రసాద్‌ను కాదని.. పల్లెకు కదిరి టికెట్ ఇచ్చే సాహసం చేయదు. అందువల్లే ‘పల్లె’నే దీనికి ప్రత్యామ్నాయ మార్గం సూచించినట్లు సమాచారం. కందికుంట వెంకట ప్రసాద్‌ను ధర్మవరం నుంచి బరిలో దింపి.. తనకు కదిరి టికెట్ ఇస్తే బాగుంటుందని అధిష్టానం వద్ద విన్నవించినట్లు తెలిసింది.
వెంటాడుతున్న ఓటమి భయం..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాక.. రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటు చేయడంతో ఈప్రాంత వాసులంతా వైఎస్సార్ సీసీ వెంట నడుస్తున్నారు. ఇక జాతీయ రహదారి 342కు శ్రీకారం, బెంగళూరు నుంచి అమరావతి వరకు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి శ్రీకారంతో జనం ఆలోచనా విధానం కూడా మారింది. అభివృద్ధికే పట్టం కట్టాలని వారంతా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పుట్టపర్తి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులనే జెడ్పీటీసీ సభ్యులుగా గెలిపించారు. ప్రజాభిమానంతో నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోనూ ఎంపీపీ స్థానాలనూ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. పుట్టపర్తి మున్సిపాలిటీలోని 20 వార్డుల్లోని 15 చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే గెలుపొందారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అన్ని వర్గాల ప్రజలు ఆకర్షితులయ్యారు. దీంతో ఓటమి భయం వెంటాడుతుండగా.. పల్లె ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్నారు. (క్లిక్ చేయండి: పవన్ గందరగోళం.. మళ్లీ ఆ ఇద్దరే రేసులో?!)
Comments
Please login to add a commentAdd a comment