మూడుసార్లు గడువెందుకు పెంచినట్టు? | MLA RK fire on tdp government | Sakshi
Sakshi News home page

మూడుసార్లు గడువెందుకు పెంచినట్టు?

Published Sun, Mar 8 2015 1:56 AM | Last Updated on Tue, Aug 14 2018 2:31 PM

మూడుసార్లు గడువెందుకు పెంచినట్టు? - Sakshi

మూడుసార్లు గడువెందుకు పెంచినట్టు?

హైదరాబాద్: రాజధాని ప్రాంతంలో రైతులు స్వచ్ఛందంగా భూములిస్తే సమీకరణకోసం మూడుసార్లు గడువు ఎందుకు పెంచారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సూటిగా ప్రశ్నించారు. భూసమీకరణకు అంగీకరించని రైతులను మంత్రులు నారాయణ, పుల్లారావు భూసేకరణ చేస్తామంటూ బెదిరించారన్నారు. రైతులను ప్రత్యక్షంగా, పరోక్షంగా బెదిరించి మరీ 33 వేల ఎకరాలను భూసమీకరణ చేశారని ఆయన మండిపడ్డారు. శనివారం గవర్నర్ ప్రసంగం అనంతరం మీడియా పాయింట్‌లో ఆయన పార్టీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సర్వేశ్వరరావు, చాంద్‌పాషాలతో కలసి మాట్లాడారు. భూసమీకరణ విషయంలో మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులు అధికారులతో కలసి అర్ధరాత్రులు గ్రామాల్లో తిరిగి రైతులను బెదిరించింది వాస్తవం కాదా? అని నిలదీశారు. ప్రభుత్వం తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీతోపాటు సింగపూర్ ప్రభుత్వానికి తాకట్టు పెట్టిందన్నారు. రైతు ఆత్మహత్యలే జరగలేదన్నప్పుడు రూ.5 లక్షల చొప్పున 30 మందికి పరిహారమెలా ఇచ్చారని ఎమ్మెల్యే చాంద్‌పాషా ప్రభుత్వాన్ని నిలదీశారు.

గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించిన ఘనుడు బాబు: చెవిరెడ్డి
గవర్నర్ నరసింహన్‌తో పచ్చి అబద్ధాలు చెప్పించిన ఘనుడు చంద్రబాబు అని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఏడాదికి రూ.వంద కోట్లు చొప్పున కేటాయిస్తే 2018 నాటికి పోలవరం ప్రాజెక్తు పూర్తవడం సాధ్యమా? అని ఆయన ప్రశ్నించారు. ఐదేళ్ల వ్యవధిలో కేటాయించే రూ.500 కోట్లతో ఈ ప్రాజెక్టు పూర్తయితే... సమస్యలన్నీ పరిష్కారమవుతాయనడం ప్రజలను మోసగించడం కాదా? అన్నారు. ఎస్సీలకు ఉద్యోగాలని, ఇంటికో ఉద్యోగమని మభ్యపెట్టారని దుయ్యబట్టారు. వేలాదిమంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేశామంటూ గొప్పలు చెబుతున్నారని, అలాగైతే 60 వేల మంది విద్యార్థులు చదువుకు ఎందుకు దూరమవుతారని ఆయన ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement