
ఏడాది తర్వాత సభలో అడుగిడిన రోజా
మహిళా ఎమ్మెల్యేల ఆత్మీయ పలకరింపు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా ఏడాది తర్వాత రాష్ట్ర శాసనసభలోకి అడుగుపెట్టారు. నూతన రాజధాని అమరావతిలో నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీ భవనంలో సోమవారం శాసనసభ తొలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు రోజా హాజరవుతారా? లేదా? అనే ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఆమె ఉదయం సభకు హాజరై గవర్నర్ ప్రసంగాన్ని శ్రద్ధతో ఆలకించారు. ఆమెను సభలోకి రానివ్వకుండా అడ్డుకుంటారని పుకార్లు వ్యాపించడంతో నాలుగో నెంబర్ గేటు వద్ద ఉదయం నుంచే మీడియా ప్రతినిధులు, ఫొటో గ్రాఫర్లు పెద్దఎత్తున గుమికూడారు.
తుదకు ఆమె తన సహచర ఎమ్మెల్యేలతో కలసి బస్సు దిగి సభలోకి నేరుగా వెళుతున్నా పోలీసుల నుంచి ఎటువంటి అభ్యంతరం వ్యక్తం కాలేదు. మీడియా ప్రతినిధులు కొందరు ఉభయ కుశలోపరి ప్రశ్నలు వేశారు. గవర్నర్ ప్రసంగం తర్వాత ఆమెను సభలో పలువురు మహిళా శాసనసభ్యులు ఆత్మీయంగా పలకరించారు. పలువురు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రోజాను 2015 డిసెంబర్‌లో అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఏడాది పాటు సస్పెన్షన్ విధించడంపై పౌరసమాజం నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమైనా, కోర్టు ఉత్తర్వులతో సభలోకి ప్రవేశించేందుకు రోజా ప్రయత్నించినా ప్రభుత్వం ససేమిరా అనడంతో ఇంత కాలం ఆగాల్సి వచ్చింది.