ఆక్వా చెరువుల కోసం అన్నదాతల కడుపు కొట్టారు..! | MLA Tried To Stop The Check Dam Construction In Prakasam | Sakshi
Sakshi News home page

ఆక్వా చెరువుల కోసం అన్నదాతల కడుపు కొట్టారు..!

Published Thu, Mar 14 2019 12:47 PM | Last Updated on Thu, Mar 14 2019 12:47 PM

MLA Tried To Stop The Check Dam Construction In Prakasam - Sakshi

పాతపాలేరు పై చెక్‌డ్యాం నిర్మించే ప్రాంతం

సాక్షి, సింగరాయకొండ: ఒకరికి మంచి చేయకపోయినా పర్లేదు కాదు..చెడు మాత్రం చేయకూడదు. కానీ అధికార పార్టీ నేతలు మాత్రం మంచి అన్న పదాన్ని మర్చిపోయారు. తమ స్వార్థం కోసం ఎంతకైనా వెనుకాడలేదు. వేల మంది రైతులకు ఉపయోగడే చెక్‌ డ్యాం నిర్మాణాన్ని నిర్ధాక్షిణ్యంగా అడ్డుకొని అన్నదాతల కడుపుకొట్టారు. వీరికి ఎమ్మెల్యే స్వామి మద్దతు పలకడంతో చెక్‌డ్యాం నిర్మాణం నిలిచిపోయి వేల ఎకరాల భూములు సాగుకు నోచుకోలేదు. రైతులకు ఆసరాగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు ఆక్వా రైతులకు అండగా ఉండటంతో చివరకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిధులు మంజూరైనా..
పాకల సమీపంలో పాత పాలేరుపై చెక్‌డ్యాం నిర్మాణానికి 2013లో కాంగ్రెస్‌ ప్రభుత్వం సుమారు రూ.1.53 కోట్లు మంజూరుచేసింది. ఈ చెక్‌డ్యాం నిర్మాణం పూర్తయితే బీడులుగా ఉన్న 250 ఎకరాల సాగులోకి రావడంతో పాటు కొత్త చెరువు కింద ఉన్న సుమారు 1300 ఎకరాల ఆయకట్టులో పంటలు పుష్కలంగా పండుతాయి. పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్‌ రూ.4.80 లక్షల పనులు చేసిన తరువాత ఎన్నికలు రావడంతో పనులు నిలిచిపోయాయి. ఆ తరువాత తనను గెలిపిస్తే చెక్‌డ్యాంను పూర్తి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అయితే ఆ తరువాత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో దామచర్ల కుటుంబానికి చెందిన బంధువులకు సంబంధించిన ఆక్వా చెరువులకు ఇబ్బందులు ఏర్పడతాయని భావించి  చెక్‌డ్యాం పనులను అడ్డుకుని ఎమ్మెల్యే స్వామి తన స్వామి భక్తిని చాటుకొని మా నోట్లో మట్టి కొట్టారని రైతులు బహిరంగంగా విమర్శిస్తున్నారు.

అనుమతులన్నీ ఉన్నా..
పాత పాలేరుపై చెక్‌డ్యాం నిర్మాణానికి అన్ని శాఖల నుంచి పూర్తి స్థాయిలో అనుమతులు ఉన్నాయి. అయితే అధికార పార్టీ నేతలు మాత్రం కుంటిసాకులు చెబుతూ పనులను అడ్డుకున్నారు.  చెక్‌డ్యాం నిర్మాణానికి ఫారెస్టుతో సహా అన్ని శాఖల అనుమతులు ఉన్నా పనులు అడ్డుకుంటున్నారని, దీంతో తామేం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని సాక్షాత్తు జిల్లా ఇరిగేషన్‌ శాఖ అధికారులే చెప్పారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామం మునిగిపోతుందంటూ పుకార్లు..
అధికార పార్టీ నేతలు చెక్‌డ్యాం నిర్మాణాన్ని అడ్డుకునేందుకు సరికొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చారు. చెక్‌డ్యాం పూర్తయితే  సమీపంలోని టంగుటూరు మండలం రాయివారిపాలెం గ్రామం మునిగిపోతుందని పుకార్లు పుట్టించారు. వాస్తవానికి రొయ్యల చెరువుల కట్టలు 6 అడుగుల ఎత్తులో ఉండగా, చెక్‌డ్యాం ఎత్తు కేవలం 4 అడుగులు మాత్రమేనని, అటువంటప్పుడు ఊరు ఏ విధంగా మునుగుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు.

అవసరం లేకున్నా నిర్మాణం..
పాకల సమీపంలో పాత పాలేరుపై చెక్‌డ్యాం నిర్మాణాన్ని అడ్డుకున్న అధికార పార్టీ నేతలు..అవసరం లేని ప్రాంతంలో రూ.10 లక్షల చొప్పున చెక్‌డ్యాంలు నిర్మించారు. వీటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదని రైతులు పేర్కొంటున్నారు.  కేవలం అధికార పార్టీ కోసమే వీటిని నిర్మించారని రైతులు పేర్కొంటున్నారు.

చెక్‌డ్యాంతో ఎంతో ప్రయోజనం
పాత పాలేరుపై చెక్‌డ్యాం నిర్మిస్తే సుమారు 1500 ఎకరాల్లో ఏటా నీటి ఎద్దడి తీరి పంటలు బాగా పండతాయి. మరో 250 ఎకరాలు సైతం సాగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది సరైన వర్షాలు లేక కేవలం 10 ఎకరాల్లో మాత్రమే పంటలు వేసుకున్నాం.
- గండవరపు పిచ్చిరెడ్డి, రైతు, పాకల

చెక్‌డ్యాం నిర్మాణంతో మా కష్టాలు తీరుతాయి
చెక్‌డ్యాం పూర్తయితే ఏటా రెండు పంటలు పండించుకోవచ్చు.  చెక్‌డ్యాంకు నిధులు మంజూరైతే కష్టాలు తీరతాయని ఆశించాం. అయితే నాలుగేళ్లుగా వర్షాభావ పరిస్థితులతో పంటలు పండించుకోలేపోయాం.
- బత్తుల భాస్కరరెడ్డి, రైతు, పాకల

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/4

చెక్‌డ్యాం నిర్మించే ప్రాంతంలో ఉన్న నీటి గుండం ఉప్పునీరుగా మారిన దృశ్యం

2
2/4

రొయ్యల చెరువుల కారణంగా బీళ్లు మారి పిచ్చిచెట్లతో ఉన్న పొలాలు

3
3/4

చెక్‌డ్యాం కోసం కాంక్రీట్‌ బెడ్‌ నిర్మించిన దృశ్యం

4
4/4

పాతపాలేరు లో రొయ్యల చెరువులు సాగు చేస్తున్న దృశ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement