దివిలి అప్రోచ్ నిర్మాణంపై ఎస్‌ఈని ప్రశ్నిస్తున్న పిఠాపురం కో–ఆర్డినేటర్ పెండెం
ఏలేరు ఆధునికీకరణ పనులు అధికార పక్ష ప్రజాప్రతినిధుల మధ్య వివాదానికి ఆజ్యం పోశాయి. సాక్షాత్తూ హోంమంత్రి, ఉపముఖ్యమంత్రి చినరాజప్ప అనుచరులు, పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. రక్షణ గోడ పనుల విషయంలో రాద్ధాంతం మొదలైంది. ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వర్మ ఆందోళనకు దిగడంతో పరిస్థితి మరింత తీవ్రతరమైంది.
తూర్పుగోదావరి, పెద్దాపురం: ఏలేరు ఆధునికీకరణ పనులు అధికార పక్ష ప్రజాప్రతినిధుల మధ్య వాగ్వివాదానికి తెర తీశాయి. శివారు భూములకు ఏలేరు నీరు అందాల్సి ఉండగా, ఏలేరు ఆయకట్టుపై పెద్దాపురం మండలం దివిలిలో నిర్మిస్తున్న రక్షణ గోడ నిర్మాణ విషయంలో ఆదివారం మధ్యాహ్నం పిఠాపురం ఎమ్మెల్యే వర్మ, మంత్రి రాజప్ప అనుచరుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. పిఠాపురం రోడ్డులో అప్రోచ్ నిర్మాణం జరుపుతున్న మండల సర్పంచ్‌ల సమాఖ్య మాజీ అధ్యక్షుడు కొత్తెం కోటి, వారి అనుచరులపై అప్రోచ్ నిర్మాణం ఆపాలంటూ ఎమ్మెల్యే వర్మ ఆందోళనకు దిగారు. అక్రమ కట్టడం కాదని, రక్షణ గోడ నిర్మాణం చేపడుతుంటే పనులు నిలపాలనడం సరికాదంటూ కోటి వర్గీయులు పనులు ఆపకుండా కాంక్రీట్ పనులు చేపట్టారు.
దీంతో ఆగ్రహించిన వర్మ ప్రత్తిపాడు –సామర్లకోట ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పెద్దాపురం డీఎస్పీ చిలకా వెంకట రామారావు ఆధ్వర్యంలో సీఐ యువకుమార్ పర్యవేక్షణలో భారీ బందోబస్తు కల్పించారు. మంత్రి సహాయకులు నిమ్మకాయల సుబ్బారావు, ఇరిగేషన్ ఎస్‌ఈ కృష్ణారావు వారిని సముదాయించే ప్రయత్నం చేసినా వర్మ ఆగలేదు. ‘‘ఆరు రోజుల నుంచి ఈ ఈఈ గాడికి చెబుతూనే ఉన్నాను.. అయినా ఈ నా కొడుకులు పట్టించుకోవట్లేదు’’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన వర్గీయులు ఆందోళన తీవ్రతరం చేయడంతో విషయాన్ని ఇరిగేషన్ అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆయన ఆదేశాల మేరకు నిర్మాణ పనులు తాత్కాలికంగా వాయిదా వేస్తామని హామీ ఇవ్వడంతో వర్మ ఆందోళన విరమించారు. మూడు గంటల ఉద్రిక్త పరిస్థితుల అనంతరం ఆందోళన విరమించడంతో ఇటు పోలీసులు, ఇరిగేషన్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
రైతులకు అన్యాయం జరిగితే సహించం
ఏలేరు రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని పెద్దాపురం మాజీ ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్ అన్నారు. దివిలి జంక్షన్‌లో రైతులు చేపట్టిన ఆందోళనకు ఆయన మద్దతు పలికారు. అప్రోచ్ నిర్మాణంలో అక్రమంగా రైతులకు నీరు విడుదల కాకుండా చేస్తే సహించేది లేదన్నారు.
రైతుల పక్షాన ఆందోళనకు సిద్ధమవుతాం..
ఏలేరు నీరు శివారు భూములకు అందకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే రైతుల పక్షాన ఆందోళనకు సిద్ధమవుతామని పిఠాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కో–ఆర్డినేటర్ పెండెం దొరబాబు హెచ్చరించారు. ఏలేరు ఆధునికీకరణ పనుల పేరుతో దివిలిలో చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై రైతుల ఆందోళనకు మద్దతుగా దివిలి వచ్చిన ఆయన అధికారులతో మాట్లాడారు. ఇరిగేషన్ ఎస్‌ఈ కృష్ణారావు, సర్పంచ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు కొత్తెం కోటి, రైతులతో సమావేశమై రైతులకు ఇబ్బందులు లేకుండా నిర్మాణాలు చేపట్టాలని నీరు ఇబ్బందులకు కారణమైతే ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు.
అప్రోచ్ నిర్మాణం తాత్కాలిక వాయిదాకు చర్యలు
దివిలిలో జరుగుతున్న అప్రోచ్ నిర్మాణాన్ని రైతుల అభిప్రాయాల మేరకు తాత్కాలిక వాయిదాకు చర్యలు చేపట్టామని ఇరిగేషన్ ఎస్‌ఈ కృష్ణారావు అన్నారు. పిఠాపురం నియోజకవర్గ రైతుల ప్రధాన డిమాండ్ మేరకు జిల్లా కలెక్టర్ దృష్టిలో ఉంచామని, అప్రోచ్ నిర్మాణంపై పూర్తి విచారణ చేపట్టి రక్షణ గోడ నిర్మాణం చేపడతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment