రాజప్పకు భాస్కరరామారావు రాసిన బహిరంగ లేఖ
తూర్పుగోదావరి, సామర్లకోట (పెద్దాపురం): ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప లాంటి సంస్కారహీనుడికి మిత్రుడిగా ఉండడం కంటే శత్రువుగా ఉండడమే సంతోషమని మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు వ్యాఖ్యానించారు. రాజప్ప ఇటీవల ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూపై స్పందిస్తూ భాస్కర రామారావు బహిరంగ లేఖ రాశారు.
దాని పూర్తి పాఠం..
గౌరవ ఉపముఖ్యమంత్రి వర్యులు,
హోంశాఖ మంత్రి వర్యులు
శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారికి..
మీ స్థాయికి, సంస్కారానికి సంబంధం లేదని మీ మాటలు నిరూపిస్తున్నాయి. ఒక రాష్ట్ర శాంతి భద్రతలని పరిరక్షించే అత్యంత కీలకమైన హోంమంత్రి పదవిలో వుండి దాని పరువు తీస్తూ నోరు పారేసుకోవడం మీకే చెల్లింది. ఈ మధ్య కాలంలో ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ప్రోగ్రామ్‌లో నన్ను మరియు దివంగత నేత మెట్ల సత్యనారాయణరావును మీ శత్రువులుగా చెబుతూ ఏక వచనంతో హీనంగా, అణుమాత్రం సభ్యత లేకుండా మాట్లాడిన తీరు రాష్ట్ర ప్రజ లంతా అసహ్యించుకొనేలా ఉంది.
జీవించినంత కాలం మంచికి మారుపేరుగా నిలిచిన మెట్ల సత్యనారాయణరావుని, మీ జీవిత కాలంలో ఏమీ చేయలేని మీరు ఆయన మరణించిన తరువాత ఇప్పుడు విమర్శిస్తుంటే ఆకాశం మీద ఉమ్మేసినట్లుంది. చనిపోయిన వారి గురించి చెడుగా మాట్లాడే సంస్కారం ఏ సీమదో తెలియదుగానీ, కోనసీమది మాత్రం కాదు, తెలుగుజాతిది కాదు.
ఇక నన్ను శత్రువుగా భావిస్తూ మీరు మాట్లాడడం, ఏకవచనంతో వెటకారంగా మాట్లాడడం బాధనిపించినా మీలాంటి సంస్కారహీనుడికి మిత్రుడుగా కన్నా శత్రువుగా ఉండడమే మేలు! మీ శత్రుత్వం మాకు సంతోషం. ఇకపై దానినే కొనసాగిద్దాం! మీరు టీవీ చానల్‌లో మాట్లాడినవి అన్నీ అబద్ధాలే. గత 25 సంవత్సరాలలో జిల్లా తెలుగుదేశం పార్టీకి, పెద్దాపురం నియోజకవర్గానికి మీరేం చేశారో, నేనేం చేశానో జిల్లా నాయకులకు మరియు పెద్దాపురం నియోజకవర్గ ప్రజలకు, బాగా తెలుసు. ఈ విషయంలో నేను బహిరంగ చర్చకు సిద్ధం.
మన పార్టీ పెద్దలు అయిన యనమల రామకృష్ణుడు, జ్యోతుల నెహ్రూ వంటి పెద్దల సమక్షంలోఈ బహిరంగ చర్చకు నేను సిద్ధం. పెద్దాపురం నియోజకవర్గం నా జన్మభూమి. ఇక్కడ ప్రజలతో నాది ఎప్పుడూ రక్త సంబంధమే. ఇక్కడ నేనెప్పుడూ అతిథిని కాదు. సొంత మనిషిని. అని మళ్లీ వక్కాణిస్తూ బహిరంగ చర్చకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ....
మీరు శత్రువుగా భావించే – బొడ్డు భాస్కర రామారావు
Comments
Please login to add a commentAdd a comment