మొన్నటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. బ్యాలెట్ పేపర్లు దిద్దిన టీచర్లు.. ఎవరిని ఫస్ట్ మార్కుతో పాస్ చేయనున్నారో.. ఎవరెవరిని ఫెయిల్ చేస్తున్నారనే ఉత్కంఠకు తెరపడనుంది. శాసనమండలి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఆదివారం జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు బుధవారం చేపట్టనున్నారు. ఇందుకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది.
సాక్షి ప్రతినిధి, కాకినాడ :ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం బుధవారం తేలిపోనుంది. ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి? ఎవరిని విజయం వరిస్తుందనేదానిపై అభ్యర్థులు నరాలు తెగే ఉత్కంఠను ఎదుర్కొంటున్నారు. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థులు ఎవరికివారే గెలుపు తమదంటే తమదని చెబుతున్నారు. పరిమిత సంఖ్యలో ఉన్న ఉపాధ్యాయ ఓటర్ల కోసం కోట్ల రూపాయలు కుమ్మరించిన అభ్యర్థులు ఫలితంపై లెక్కలు వేసుకుంటున్నారు. ఏ జిల్లాలో సానుకూలమవుతుంది, ఎంత మెజార్టీ వస్తుంది, మొదటి ప్రాధాన్య ఓట్లతోనే విజయం వరిస్తుందా, రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపునకు వెళ్లక తప్పదా, అలా వెళితే ఫలితం ఎవరి పక్షాన నిలుస్తుందనే దానిపై అభ్యర్థులు, వారి అనుచరులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు.
ఉభయ గోదావరి జిల్లాల్లో 21,551 మంది ఓటర్లుండగా, 17,487 మంది ఉపాధ్యాయులు ఓటు వేశారు. ఏ అభ్యర్థి విజయానికైనా మ్యాజిక్ ఫిగర్ సుమారు 8 వేలు ఉంటుందని అంటున్నారు. శాసన మండలిలో అడుగు పెట్టాలన్న ఆశతో 15 మంది ఈ ఎన్నికల బరిలో నిలిచారు. ప్రచారం తీరు, అభ్యర్థుల అర్థ, అంగబలాలు, సేవాగుణం, రాజకీయ నేపథ్యాలు అవలోకిస్తే ఈ ఎన్నికల్లో త్రిముఖ పోరు జరుగుతుందని మేధావివర్గం మొదటి నుంచీ విశ్లేషిస్తూ వస్తోంది. ఈ ముగ్గురిలో సిట్టింగ్ ఎమ్మెల్సీ చైతన్యరాజు తెలుగుదేశం పార్టీ అధికారిక అభ్యర్థిగా బరిలోకి దిగారు. అదే పార్టీ మద్దతు కోరి విఫలమైన ప్రగతి విద్యా సంస్థల అధినేత పరుచూరి కృష్ణారావు సొంత బలంతో బరిలో సై అన్నారు. యూటీఎఫ్ బలపరిచిన అభ్యర్థిగా రాము సూర్యారావు ఉపాధ్యాయుల మద్దతు, విద్యాదాతగా ఉన్న పేరుతో ఈ ఎన్నికల్లో తలపడ్డారు.
వీరితో పాటు మరో 12 మంది బరిలో ఉన్నా ప్రధాన పోటీ మాత్రం ఆ ముగ్గురి మధ్యనే జరిగింది. ఆరేళ్లుగా ఉపాధ్యాయవర్గంతో మమేకమై ఉండటం, గడచిన ఆరు నెలలుగా చేసిన పనులు కలిసి రావడంతో 11 వేల పైచిలుకు ఓట్లతో పూర్తిస్థాయి మెజార్టీతో తొలి ప్రాధాన్య ఓట్లతోనే గట్టెక్కుతామని సిట్టింగ్ ఎమ్మెల్సీ చైతన్యరాజు వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మూడు దశాబ్దాలుగా విద్యారంగంలో ఉన్న పరిచయాలు, స్వతంత్ర అభ్యర్థిగా ఉండటం పరుచూరి కృష్ణారావుకు కలిసి వచ్చే అంశాలని ఆయన సన్నిహితులు లెక్కలేస్తున్నారు. ఎనిమిది వేలుపైగానే ఓట్లు వచ్చి తొలి ప్రాధాన్యంతోనే కృష్ణారావు గెలుపొందుతారని వారు చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యాపరంగా చేసిన సేవలతో మెజార్టీ బూత్‌లలో తనకు తొలి ప్రాధాన్య ఓట్లు వస్తాయని రాము సూర్యారావుకు మద్దతుగా నిలిచిన ఉపాధ్యాయ సంఘాలు, వామపక్ష నేతలు లెక్కలేస్తున్నారు. విజయం ఎవరిని ఎలా వరిస్తుందో తేలాలంటే మరికొద్ది గంటలు నిరీక్షించాల్సిందే.
‘ఫస్ట్ మార్కు’తో..పాసయ్యేదెవరో!
Published Wed, Mar 25 2015 3:47 AM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM
Advertisement