ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటుదాం | MLC elections Capabilities | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటుదాం

Published Fri, Jun 12 2015 3:27 AM | Last Updated on Tue, Aug 14 2018 11:24 AM

MLC elections Capabilities

 కర్నూలు : స్థానిక సంస్థల కోటాలో శాసనమండలి స్థానానికి జరుగుతున్న పోటీలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వెంకటేశ్వరరెడ్డిని గెలిపించుకుని మరోసారి కర్నూలు జిల్లా సత్తాను చాటుదామని ఆ పార్టీ నేతలు ముక్తకంఠంతో పిలుపునిచ్చారు. గురువారం నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని దేవి ఫంక్షన్ హాల్‌లో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అధ్యక్షతన జిల్లా పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి హాజరయ్యారు.

అంతకుముందు బిర్లా కాంపౌండ్‌లోని కృష్ణకాంత్ ప్లాజాలో వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం జిల్లా పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో 11 శాసనసభ, 2 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుని జిల్లాలో పార్టీ పటిష్టంగా ఉందని నిరూపించారన్నా రు. మండలి ఎన్నికల్లో కూడా సమష్టి కృషితో వెంకటేశ్వరరెడ్డిని గెలిపించి పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు. టీడీపీ అవినీతిలో కూరుకుపోయినందున భవిష్యత్తు వైఎస్సార్‌సీపీదేనని భరోసా ఇచ్చారు.

 ప్రలోభాలను తిప్పికొట్టాలి..
 టీడీపీ నాయకుల ప్రలోభాలను తిప్పికొడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిని గెలిపించేందుకు  కృషి చేయాలని పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు భూమానాగిరెడ్డి పిలుపునిచ్చారు. పోలీసులను అడ్డం పెట్టుకుని జెడ్పీటీసీ సభ్యులను భయపెట్టి జెడ్పీ చైర్మన్ పదవిని టీడీపీ వారు కైవ సం చేసుకున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారి ఆటలు సాగబోవన్నారు.

 ఓటుకు నోటు వ్యవహారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం
 ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు వ్యవహారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి ఒక్క కార్యకర్త వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి పిలుపునిచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ సహకారంతో  శిల్పాసోదరులు రాజకీయంగా లబ్ధి పొంది, ఏరుదాటాక తెప్ప తగిలేశారన్న చందంగా ఆ కుటుంబానికే ద్రోహం చేశారని విమర్శించారు. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే డిప్యూటీ సీఎంను తప్పించి చంద్రబాబు తనకు మంత్రి పదవి ఇస్తారని శిల్పాచక్రపాణిరెడ్డి ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

టీడీపీ అధిష్టానం డబ్బులు దండుకుని కడప జిల్లాకు చెందిన శిల్పాచక్రపాణిరెడ్డికి  టీడీపీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు ఎమ్మెల్సీ సీటును కట్టబెట్టిందని విమర్శించారు. ఓటర్లను డబ్బులతో కొనుగోలు చేసి గెలవాలని టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని, ప్రలోభాలకు లొంగవద్దని సూచించారు.

 పోలీసులను అడ్డం పెట్టుకొని పాలన..
 ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, ఎమ్మిగనూరు నియోజకవర్గం ఇన్‌చార్జి ఎర్రకోట జగ న్‌మోహన్‌రెడ్డి తదితరులు నిప్పులు చెరిగారు. ఓటుకు నోటు వ్యవహారంలో సీఎం చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని పాలన సాగిస్తున్నారని విమర్శించారు.

జిల్లాలో వైఎస్సార్సీపీకి పటిష్టమైన నాయకత్వం ఉన్నందున కార్యకర్తలు భయపడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యేలు ఎస్.వి.మోహన్‌రెడ్డి, గౌరుచరిత, మణిగాంధీ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, మైనార్టీ సెల్ జిల్లా నాయకులు హఫీజ్ ఖాన్, షరీఫ్, సలీం, వైఎస్సార్‌సీపీ జిల్లాపరిషత్ ఫ్లోర్ లీడర్ లాలిస్వామి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాజావిష్ణువర్దన్‌రెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు రాకేష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు  అనిల్‌కుమార్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నారాయణమ్మ, వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు రాఘవేంద్రనాయుడు, మద్దయ్యతో పాటు రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాల కన్వీనర్లు, వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీలు, కర్నూలు సిటీ కన్వీనర్  పి. జి. నరసింహలు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement