మార్చిలో ఎమ్మెల్సీ ఎన్నికలు
- సీఈవో భన్వర్‌లాల్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ శానసమండళ్లకు సంబంధించి 15 ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే నెలలో ఎన్నికలు జరుగుతాయని రెండు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ శుక్రవారం ‘సాక్షి’కి తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ ఈ నెల రెండోవారంలో వెలువడుతుందన్నారు. ఏపీ శాసనమండలిలో 4 ఎమ్మెల్యే కోటా స్థానాలు, 2 ఉపాధ్యాయ కోటా స్థానాలు మార్చి 29 నాటికి ఖాళీ కానున్నాయి. తెలంగాణలో కూడా 7 ఎమ్మెల్యే కోటా స్థానా లు, 2 పట్టభద్రుల కోటా స్థానాలు అదే సమయానికి ఖాళీ కానున్నాయి.
తెలంగాణ మండలిలో ఎమ్మెల్యే కోటా స్థానాలు 7 ఖాళీ అవు తున్నా..6 స్థానాలకే ఎన్నికలుంటాయి. స్థానాల కేటాయింపులో ఒక ఎమ్మెల్సీ తెలంగాణకు ఎక్కువగా రాగా ఏపీకి ఒకటి తక్కువ వచ్చింది. దీంతో ఏపీ మండలిలో ఎమ్మెల్యే కోటా స్థానాలు నాలుగే ఖాళీ అవుతున్నా.. తెలంగాణలో ఒక స్థానాన్ని తగ్గించి దాన్ని ఏపీలో కలిపి 5 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. కాగా, డూప్లికేట్ ఓటర్ల తొలిగింపునకు ఆధార్ అనుసంధానాన్ని త్వరలో చేపడుతున్నట్లు భన్వర్‌లాల్ తెలిపారు.