
ఏపీలో ఎమ్మెల్సీలు ఏకగ్రీవం.. తెలంగాణలో పోటీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేల కోటాలో నాలుగు శాసన మండలి స్థానాలకు జరగాల్సిన ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. అధికార టీడీపీ తరపున ప్రతిభా భారతి, ఎంఏ షరీఫ్, మిత్రపక్షం బీజేపీ తరపున సోము వీర్రాజు, ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ సీపీ తరపున గోవింద రెడ్డి ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి సోమవారం మధ్యాహ్నంతో గడువు ముగిసింది. నాలుగు స్థానాలకు నాలుగే నామిషేన్లు దాఖలు కావడంతో ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. కాగా ఫలితాలను అధికారికంగా ప్రకటించాల్సివుంది.
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు అనివార్యంగా మారాయి. ఎమ్మెల్యేల కోటాలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా ఏడుగురు అభ్యర్థులు పోటీపడుతున్నారు. టీఆర్ఎస్ తరపున ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, నేతి విద్యాసాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, యాదవ రెడ్డి పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆకుల లలిత, టీడీపీ-బీజేపీ కూటమి నుంచి వేంనరేందర్ రెడ్డి బరిలో నిలిచారు. అధికార టీఆర్ఎస్ ఐదో అభ్యర్థిని రంగంలో దించడంతో పోటీ తప్పనిసరిగా మారింది.