హోదారుణమిది..
మోదీ,బాబు మోసంపై నిరసన
ధర్నాలు, ఆందోళనలు, ర్యాలీలు
పలుచోట్ల దిష్టిబొమ్మల దహనాలు
నిప్పులు కక్కిన ప్రతిపక్షాలు
ఆందోళనకారుల అరెస్టులు
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై కోటి ఆశలు పెట్టుకున్న ప్రజానీకానికి మొండిచెయ్యి చూపిన ప్రధాని మోదీ వైఖరికి, ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుకు నిరసనగా ప్రతిపక్షాలు శుక్రవారం ఆందోళన చేపట్టాయి. వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ (ఎం) శ్రేణులు ధర్నాలు, ర్యాలీలు, మానవహారాలు, రాస్తారోకోలు, నినాదాలతో నిరసన వ్యక్తం చేశాయి. ఆయా పార్టీ నాయకులు, కార్యకర్తలు పలుచోట్ల మోదీ, చంద్రబాబుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. కొన్నిచోట్ల పోలీసులను వారిని నిలువరించారు. ఆందోళనకారులను అరెస్టు చేశారు. విశాఖ నగరంలోని దక్షిణ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అరగుండు గీయించుకుని వ్యతిరేకతను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త కోలా గురువులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నగర కార్యాలయంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్, నగర అధ్యక్షుడు బెహరా భాస్కరరావులు ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
అనంతరం వారిని పోలీసులు అరెస్టు చేశారు. జగదాంబ జంక్షన్లో సీపీఐ నాయకులు మోదీ దిష్టిబొమ్మ దహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. జడ్జి కోర్టు ఎదుట ఉత్తరాంధ్ర పొలిటికల్ జేఏసీ కన్వీనర్ జేటీ రామారావు ప్రధాని మోదీ చిత్రపటాన్ని చెత్తబుట్టలో వేసి నిరసన తెలియజేశారు. ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర నియోజకవర్గం తాటిచెట్లపాలెంలో సమన్వయకర్త తైనాల విజయకుమార్, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆంజనేయస్వామి విగ్రహం నుంచి హైవేపై ర్యాలీగా వెళ్లారు. మోదీ, చంద్రబాబుల దిష్టిబొమ్మలను చెప్పులతో కొడుతూ దహనం చేశారు. అనంతరం మానవహారం నిర్వహించారు. తూర్పు నియోజకవర్గం ఇసుకతోట జంక్షన్లో సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్, కార్యకర్తలు నోటికి నల్ల బ్యాడ్జీలు కట్టుకుని మౌన ప్రదర్శన చేశారు. సీపీఎం జోన్ కార్యదర్శి ఆర్‌కేఎస్‌వీ కుమార్ తదితరులు మద్దిలపాలెంలో రాస్తారోకో నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గ పరిధలోని మల్కాపురంలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్ తదితరులు ర్యాలీ నిర్వహించారు. వేపగుంటలో సీపీఐ, సీపీఎం నాయకులు ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. పాతగాజువాక మెయిన్ రోడ్డులో వైఎస్సార్‌సీ సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి, శ్రేణులు, కాంగ్రెస్ తరఫున మంత్రి రాజశేఖర్, సీపీఎం నాయకులు ధర్నా చేశారు. పెందుర్తి తహసీల్దారు కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ నాయకులు ధర్నా చేసి తహసీల్దారుకు వినతిపత్రం ఇచ్చారు. భీమిలి నియోజకవర్గం తగరపువలసలో వైఎస్సార్‌సీపీ పట్టణాధ్యక్షుడు అక్రమాని వెంకట్రావు, సీపీఐ నాయకుడు అల్లు బాబూరావు తదితరులు హైవేపై రాస్తారోకో నిర్వహించారు.
జిల్లాలో : జిల్లాలోని మాడుగులలో ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ నాయకులు సంయుక్తంగా బస్టాండులో మానవహారం నిర్వహించారు. వాహనాలను అడ్డుకుని నిరసన తెలియజేశారు. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా వచ్చి తహసీల్దారు కార్యాలయం వద్ద ధర్నా చేశారు.
చోడవరంలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ తదితరులు రాస్తారోకో నిర్వహించి తహసీల్దారు కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. అరకులో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అర్థనగ్న ప్రదర్శన జరిపారు. శెట్టి అప్పాలు, సమర్థి రఘునాథ్‌లు పాల్గొన్నారు. యలమంచిలిలో సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరావు, నాయకులు తహసీల్దారు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనకాపల్లిలో పట్టణాధ్యక్షుడు మందపాటి జానకీరాం తదితరులు ఆర్డీవో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. నెహ్రూ చౌక్ వద్ద రాస్తారోకో చేశారు. సీపీఐ, సీపీఎం, ఆమ్‌ఆద్మీ పార్టీల నాయకులు మోదీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. పాయకరావుపేటలో వైఎస్సార్‌సీపీ జెడ్పీ ఫ్లోర్‌లీడర్ చిక్కాల రామారావు, పట్టణాధ్యక్షుడు ధనిశెట్టి బాబూరావు, ఎంపీపీ అల్లాడ శివ తదితరులు తహసీల్దారు కార్యాలయం వద్ద నల్లబ్యాడ్జీలతో ధర్నా చేసి నిరసన తెలిపారు. సీపీఐ నాయకుడు అర్జునరావు గౌతమ్ థియేటర్ వద్ద, నక్కపల్లిలో సీపీఎం డివిజన్ కార్యదర్శి ఎం.అప్పలరాజు హైవేపై మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. నర్సీపట్నంలో వైఎస్సార్‌సీపీ, సీపీఎం నాయకులు సంయుక్తంగా ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ చేసి వద్ద బైఠాయించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్ గణేష్, కోనేటి రామకృష్ణ, సీపీఎం నాయకులు బి.సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.