మోదీవి అన్నీ మాయమాటలే
ఏఐసీసీ కార్యదర్శి టామ్ వణక్కన్
విజయవాడ సెంట్రల్: ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల వాగ్దానాలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని ఏఐసీసీ కార్యదర్శి టామ్ వణక్కన్ అన్నారు. రెండేళ్ల పాలనలో మోడీ వైఫల్యాల పుస్తకాన్ని శనివారం ఆంధ్రరత్నభవన్లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో విదేశాల్లోని బ్లాక్‌మనీని తెచ్చి భారత దేశంలోని ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. పరిశ్రమలకు పెట్టుబడులు సాధించడంలో విఫలమయ్యారన్నారు. ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
పది రాష్ట్రాల్లో కరువు తాండవిస్తుంటే సాయం చేయాల్సిన ప్రధాని నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. అధికార పార్టీ నాయకుల్లో అసహనం పెరుగుతోందన్నారు. ధాన్యాల దిగుబడులు తగ్గిపోవడంతో వాటి ధరలు ఆకాశాన్నంటాయని చెప్పారు. ఆచ్చేదిన్ పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్న ప్రధానికి త్వరలోనే గుణపాఠం తప్పదన్నారు. ఏపీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ, ప్రధాన కార్యదర్శి నరహరిశెట్టి నరసింహారావు, జిల్లా ఇన్‌చార్జి లింగంశెట్టి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.