సంపాదకీయం
ఎన్డీయే ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక విదేశాల్లో నల్లడబ్బు దాచుకున్నవారి భరతం పట్టడానికి చురుగ్గా చర్యలు ప్రారంభించింది. తొలి కేబినెట్ భేటీలోనే ఈ విషయమై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటుచేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సిట్ అడిగిన సమాచారాన్ని, అవసరమైన పత్రాలనూ అందజేసి సహకరించమని ఒకపక్క రిజర్వ్ బ్యాంకు దేశంలోని బ్యాంకులన్నిటినీ ఆదేశించగా... తమవద్ద డబ్బు దాచుకున్నవారి వివరాలను భారత్‌కు అందజేయడానికి స్విట్జర్లాండ్ సిద్ధంగా ఉన్నట్టు వార్తలొచ్చాయి. మీడియాలో వచ్చిన ఈ కథనాల ఆధారంగా వెనువెంటనే కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్‌జైట్లీ స్విట్జర్లాండ్‌కు లేఖ రాస్తున్నట్టు ప్రకటించారు. ఆయన అలా అన్నదే తడవుగా భారత్‌కు ఈ విషయంలో సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని స్విస్ ఆర్ధిక మంత్రిత్వ శాఖనుంచి వివరణ వెలువడింది.
చెయ్యదల్చుకుంటే, చిత్తశుద్ధి ఉంటే దేన్నయినా ఎంత వేగంగా పూర్తిచేయవచ్చునో ఈ పరిణామాలు చాటుతున్నాయి. పరస్పరం సంభాషించుకోవడానికైనా, సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికైనా ఎన్నో రకాల సాధనాలున్న ఈ కాలంలో యూపీఏ ప్రభుత్వం ఏదో సాకులు చెప్పి తప్పించుకుం దామని చూసింది. దశాబ్దకాలంపాటు అధికారంలో ఉన్నా ఎప్పటిక ప్పుడు మాటలు చెప్పడం తప్ప నల్ల డబ్బు ఆచూకీ రాబట్టడంలో కాస్తయినా పురోగతి సాధించలేకపోయింది. దానిపై శ్వేతపత్రం తీసుకొస్తున్నామని ఊరించి ఊరించి రెండేళ్లక్రితం ఆ పని చేసిందిగానీ అది పేరుకు తగినట్టు నిజంగానే తెల్లకాగితంగా మిగిలింది. 97 పేజీలున్నా అందులో విస్పష్టమైన వివరాలుంటే ఒట్టు. అంతవరకూ తమ ప్రభుత్వం చేసిందేమిటో, దానివల్ల వచ్చిన ఫలితాలేమిటో, ఇకముందు చేయబోయేదేమిటో అందులో చెప్పనేలేదు. కనీసం 2011లో నియమించిన నిపుణుల కమిటీ పని ఎంతవరకూ వచ్చిందో కూడా వెల్లడించలేకపోయింది.
చివరాఖరి పేజీల్లో మాత్రం నల్లధనం విలువ ఎంతనే విషయంలో మూడు ప్రభుత్వ రంగ సంస్థలు మదింపు వేస్తున్నాయన్న సమాచారాన్నివ్వడం, ఆర్నెల్లలో నివేదికలొ స్తాయని చెప్పడం తప్ప మరేమీ వివరించలేదు. అటు తర్వాత వాటి అతీగతీ ఏమైందో తెలియదు. సామాన్య జనానికి మాత్రమే కాదు...కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆ మూడు సంస్థలూ ఏం చేస్తున్నాయో తెలియదని ఈమధ్య సమాచార హక్కు చట్టంకింద అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ జవాబిచ్చినప్పుడు వెల్లడైంది. అయితే తాము ఎంతో చేశామని ఆ సంస్థలు చెబుతున్నాయి. నల్ల ధనం వెలికితీత విషయమై ప్రాథమిక దశలోనే ఇంత అయోమ యం నెలకొని ఉంటే ఇక దాన్ని తీసుకురావడానికి ప్రభుత్వాలకు ఎన్నేళ్లుపట్టగలదో ఊహించలేం.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (ఎన్‌ఐపీఎఫ్‌పీ), నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్‌సీఏఈఆర్), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐఎఫ్‌ఎమ్)లు తాము గత ఏడాది డిసెంబర్‌లో నివేదికలు అంద జేశామని, అవి ఆర్ధిక మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉన్నాయని చెబుతున్నాయి. విదేశాల్లోని బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనంపై అంచనాలు కూడా ఇచ్చామంటున్నాయి. ఎన్డీయే ప్రభుత్వం అధికారం లోకొచ్చి నెల్లాళ్లయినా కాలేదు గనుక ఈ వివరాలు తెలియలేదను కోవచ్చు. కానీ, యూపీఏ ప్రభుత్వం ఆ నివేదికలందాక అయిదు నెలలపాటు అధికారంలో ఉన్నా వాటిగురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అసలు స్విస్ బ్యాంకుల్లో దాచుకున్నవారి వివరాలు ఆ దేశంతో మనం కుదుర్చుకున్న ఒప్పందంకింద వెల్లడించడం కుదరదని దబాయించింది. ఈసారి అధికారంలోకొచ్చిన వంద రోజుల్లోగా నల్లడబ్బు అంతుచూస్తామని 2009 ఎన్నికల సందర్భంగా తానిచ్చిన హామీని మరిచింది. అయిదేళ్లపాటు ఏమీ చేయకుండా గడిపేసింది.
తాజాగా స్విస్ బ్యాంకులు చెబుతున్న లెక్కల ప్రకారం గత ఏడాది భారతీయులు అక్కడ దాచుకున్న మొత్తం రూ. 14,000 కోట్లు. స్విట్జర్లాండ్ సమాచారం వెల్లడించగలదని తెలియడంతో చాలామంది ఇప్పటికే ప్రత్యామ్నాయాలు వెతుక్కుని ఉంటారు. మన ప్రభుత్వాలు కేవలం స్విస్ బ్యాంకుల గురించి మాట్లాడుతుంటే నల్ల డబ్బు ఎల్లలెరుగకుండా తరలుతున్నది. సింగపూర్, దుబాయ్, మారిషస్, హాంకాంగ్‌ల్లో ఉండే బ్యాంకులకు కూడా నల్లడబ్బు భారీ మొత్తంలోనే వెళ్తున్నదని ఆర్ధిక నిపుణులు అంచనావేస్తున్నారు.
ప్రభుత్వంనుంచి చర్యలు తీసుకోవడంలో ఆలస్యమయ్యేకొద్దీ నల్లధనం కొత్త కొత్త దోవలు అన్వేషిస్తుంది. నల్లధనవంతులు ఒకచోటనుంచి మరోచోటకు సులభంగా డబ్బు తరలించి పబ్బం గడుపుకుంటారు. కనుక ఇప్పుడు సిట్ కార్యకలాపాలను వేగవంతం చేయడంతోపాటు మిగిలిన దేశాలతో కూడా మాట్లాడి నల్లడబ్బును రాబట్టడానికి అన్ని రకాల చర్యలూ తీసుకోవాలి. అదే సమయంలో అసలు ఇలా అక్రమ మార్గాల్లో డబ్బు తరలడానికి దారితీస్తున్న పరిస్థితులను మార్చాల్సిన అవసరం కూడా ఉన్నది. నల్లడబ్బు సరిహద్దులు దాటిపోకుండా చూడటానికి ప్రత్యక్ష పన్నుల కోడ్‌ను తీసుకొస్తామని యూపీఏ ప్రభుత్వం గతంలో చెప్పినా ఆ విషయంలో చేష్టలుడిగి ఉండిపోయింది. ఇక ఇతరత్రా సంస్కరణలు సరేసరి. ఈమధ్యనే అసోచామ్ నివేదిక నల్లడబ్బును రప్పించడానికి కొన్ని సూచనలు చేసింది. 40 శాతం పన్నుగా చెల్లిస్తే విదేశాల్లో దాచిన నల్లడబ్బును వెనక్కి తెచ్చుకోవడానికి వెసులుబాటు కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించాలన్నది. అలాగే ఆస్తుల విలువను తగ్గించిచూప డానికి వీలుకల్పిస్తున్న ప్రస్తుత స్టాంపు డ్యూటీ ధరలను హేతుబద్ధం చేయాలని సూచించింది. ఎన్డీయే ప్రభుత్వం వీటన్నిటిపైనా కూడా దృష్టి సారిస్తే మెరుగైన ఫలితాలకు అవకాశం ఉంటుంది.