ఎన్‌ఎస్జీ సభ్యత్వానికి స్విస్ బాసట | Switzerland to support India | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎస్జీ సభ్యత్వానికి స్విస్ బాసట

Published Tue, Jun 7 2016 2:18 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

ఎన్‌ఎస్జీ సభ్యత్వానికి స్విస్ బాసట - Sakshi

ఎన్‌ఎస్జీ సభ్యత్వానికి స్విస్ బాసట

భారత్‌కు మద్దతుగా నిలిచిన స్విట్జర్లాండ్
- నల్లధనం వెలికితీతకు సహకారం
- భారత్‌కు ఉన్నతాధికారిని పంపనున్న స్విస్
- దేశాధ్యక్షుడు ష్నీడర్‌తో మోదీ భేటీ
 
 జెనీవా/వాషింగ్టన్: భారత దౌత్యంలో కీలక ఘట్టం. అణు సరఫరా బృందం (ఎన్‌ఎస్జీ)లో సభ్యత్వం పొందేందుకు భారత్‌కు కీలక దేశమైన స్విట్జర్లాండ్ మద్దతు పలికింది. సోమవారం స్విస్ పర్యటన ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశం మద్దతు కూడగట్టడంలో విజయం సాధించారు. అలాగే స్విస్ బ్యాంకుల్లో పోగైన భారతీయుల నల్లధనాన్ని వెలికితీయడంలో పరస్పరం సహకారం కోసం ఇరుదేశాలు అంగీకరించాయి. స్విస్ అధ్యక్షుడు జోవాన్ ష్నీడర్ అమ్మన్‌తో మోదీ సమావేశమై పలు ద్వైపాక్షిక అంశాలపై సమగ్ర చర్చలు జరిపారు. అనంతరం ష్నీడర్, మోదీలు విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఎన్‌ఎస్జీలో భారత సభ్యత్వానికి  మద్దతిస్తామని ష్నీడర్  ప్రకటించారు. ‘అణ్వస్త్ర వ్యాప్తి నిరోధంలో భారత కృషి అమోఘం.

ఎన్‌ఎస్జీ సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు మా దేశం క్రియాశీలక మద్దతిస్తుంది’ అని చెప్పారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో  శాశ్వత సభ్యత్వం పొందడంలో పరస్పరం సహకరించుకునేందుకు ఇరుదేశాలు అంగీకరించాయన్నారు. భారత్‌ను అర్థం చేసుకొని బాసటగా నిలిచినందుకు ష్నీడర్‌కు మోదీ ధన్యవాదాలు తెలిపారు. యూరోపియన్ స్వేచ్ఛా వాణిజ్య సంఘం(ఎఫ్టా)లోని దేశాలైన స్విట్జర్లాండ్, ఐస్‌లాండ్, నార్వే, లీచ్‌టన్‌స్టీన్‌లతో స్వేచ్ఛా వాణిజ్యంపై చర్చించేందుకు భారత్ సన్నద్ధంగా ఉందన్నారు. భారత అవసరాలకు అనుగుణంగా స్విస్ వృత్తి, విద్య శిక్షణ వ్యవస్థను మలిచేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయన్నారు. ఇరుదేశాల ప్రజల మధ్య పటిష్ట బంధాల కోసం  ఈ ఏడాదిలో స్విస్ జాతీయుల కోసం ఈ-టూరిస్ట్ వీసా సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తామని చెప్పారు.

 భారత్‌కు రండి.. స్విస్ సీఈఓలతో సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. భారత్ ప్రపంచంలో అతివేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. భారత్‌లో 2-3 స్విట్జర్లాండ్లను నిర్మించాలని కోరుకుంటున్నామని చెప్పారు. భారత రైల్వే, ఇతర మౌలిక వసతులను స్విస్ టెక్నాలజీతో అభివృద్ధి చేయాలని, దీనికోసం తాము స్విస్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామన్నారు. ‘ఎన్నో స్విస్ కంపెనీల ఉత్పత్తులు భారత్‌లోని ముంగిళ్లలో ఉన్నాయి. ఈ వాణిజ్య అనుబంధాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ అవకాశాన్ని వినియోగించుకొని భారత ఆర్థిక వృద్ధిలో పాలుపంచుకునేందుకు మరిన్ని స్విస్ కంపెనీలు ముందుకు రావాలి’ అని స్విస్ వాణిజ్యవేత్తలకు పిలుపునిచ్చారు. భారత్‌లోని 125 కోట్ల మంది ప్రజానీకంతో యావత్ ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందన్నారు.

 స్విస్‌లో భారత్ సినిమాలు
 భారత చిత్రసీమకు స్విస్ ప్రముఖ గమ్యస్థానమని మోదీ ప్రత్యేకంగా చెప్పారు. ‘భారత సినీ పరిశ్రమ స్విస్ అందాలను మా ప్రేక్షకుల ముందుకు తెస్తోంది. రొమాంటిక్ గీతాల చిత్రీకరణ కోసం బాలీవుడ్ స్విట్జర్లాండ్‌కు వస్తోంది’ అని చెప్పారు. అలాగే స్విట్జర్లాండ్ దేశస్తులు పెద్దసంఖ్యలో భారత్‌ను సందర్శించాలని కోరారు.  స్విస్ టెన్నిస్ క్రీడాకారిణి మార్టినా హింగిస్‌తో జతకట్టి సానియా మీర్జా, లియాండర్ పేస్‌లు ఎన్నో గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను సాధించారని కొనియాడారు. ఇలా ఉమ్మడి లక్ష్యాలు, విలువలు, ప్రజల అనుసంధానత, పటిష్ట వాణిజ్య భాగస్వామ్యం కలిసి  సంబంధాలను కొత్త శిఖరాలకు చేరుస్తాయన్న నమ్మకముందని మోదీ చెప్పారు.

 అమెరికాకు మోదీ .. ఐదు దేశాల పర్యటనలో భాగంగా స్విస్ పర్యటన ముగించుకొని మోదీ అమెరికాకు వెళ్లారు.  మంగళవారం వాషింగ్టన్‌లోని ఓవల్ ఆఫీస్‌లో  ఆ దేశాధ్యక్షుడు ఒబామాతో మోదీ సమావేశమవుతారు. ఆ తర్వాత మోదీ గౌరవార్థం ఒబామా విందు ఇస్తారు. వీరిద్దరు భేటీకానుండటం ఇది ఆరోసారి. ఈనెల 8న అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తారు. మోదీ పర్యటన ఇరుదేశాల సంబంధాల్లో చిరస్థాయిలో నిలిచిపోతుందని వైట్‌హౌస్ కొనియాడింది. .

 ఎన్‌ఎస్జీ లో స్విస్ మద్దతు కీలకం
 ఎన్‌ఎస్జీలో 48 సభ్యదేశాలున్నాయి. అణురంగానికి సంబంధించిన కీలక అంశాలను ఈ   సంస్థ పర్యవేక్షిస్తుంది.అణు సాంకేతికత, వాణిజ్యం, ఎగుమతి చేసేందుకు సభ్యదేశాలను  అనుమతిస్తుంది. భారత అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ట్రాక్ రికార్డును చూసి అమెరికాతోపాటు ఎన్‌ఎస్జీలోని పలు దేశాలు భారత్‌కు బాసటగా ఉన్నాయి. ఎన్‌ఎస్జీలో భారత సభ్యత్వాన్ని చైనా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో భారత్‌కు స్విస్ మద్దతు కీలకం. ఒక్క దేశం వ్యతిరేకంగా ఉన్నా ఎన్‌ఎస్జీ సభ్యత్వానికి ఇబ్బందే. సభ్యత్వం కోసం కొన్నేళ్లుగా శ్రమిస్తున్న భారత్ గత నెల 12న అధికారికంగా దరఖాస్తు చేసింది. ఈ అంశం ఈనెల 9న వియన్నాలో, 24న సియోల్‌లో జరగనున్న ఎన్‌ఎస్జీ ప్లీనరీ సమావేశాల్లో చర్చకు రానుంది. ఈనేపథ్యంలో చైనాతోనూ భారత్ సంప్రదింపులు జరుపుతోంది.  
 
 నల్లధనం వెలికితీతకు...
 నల్లధనం, పన్ను ఎగవేత అంశాలు ఇరుదేశాలకు ప్రాథమ్యాలని, వీటిపై ఉమ్మడి పోరాటం చేస్తామని మోదీ చెప్పారు. పన్నుఎగవేతదారులను చట్టం ముందు నిలబెట్టేందుకు అవసరమైన సమాచారాన్ని వేగవంతంగా బదిలీ చేసుకోవడంపై చర్చించామన్నారు. నల్లధనం వెలికితీతకు సంబంధించిన తమ ఉన్నతాధికారిని భారత్‌కు పంపేందుకు స్విట్జర్లాండ్ అంగీకరించడం గమనార్హం. ఈనెల 14న ఆ దేశ కార్యదర్శి ఢిల్లీకి రానున్నారు. విదేశాల్లో పోగైన నల్లధనాన్ని రప్పిస్తామని మోదీ 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీ నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement